పెయిన్ కిల్లర్స్ సాయంతో సెంచరీ చేశా.. కెప్టెన్సీ లేదనే బాధ లేదు: హర్మన్‌ప్రీత్ కౌర్
పెయిన్ కిల్లర్స్ సాయంతో సెంచరీ సాధించానని టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది. మ్యాచ్‌కు ముందు రాత్రి జ్వరం వచ్చిందని తెలిపింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 121 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. హర్మన్‌ప్రీత్ కౌర్(121 బంతుల్లో 15 ఫోర్లతో 126) అద్భుతమైన శతకంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. దాంతో ఆమెకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఈ సందర్భంగా మాట్లాడిన హర్మన్‌ప్రీత్ కౌర్.. కెప్టెన్సీ వదులుకున్నాననే బాధలేదని, ఆటను ఆస్వాదిస్తున్నానని తెలిపింది.
కెప్టెన్సీ గురించి బాధ లేదు..
'నేను నా బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఇదే కొనసాగించాలనుకుంటున్నాను. వన్డే ఫార్మాట్‌లో పరిస్థితులకు తగ్గట్లు ఆడాల్సి ఉంటుంది. 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడంతో నేను, ప్రతీక ఆచితూచి ఆడాం. మంచి బంతులను గౌరవించి.. లూజ్ బాల్స్‌ను బౌండరీకి తరలించాలని నిర్ణయించుకున్నాడు. స్పష్టమైన ప్లాన్‌తో బ్యాటింగ్ చేశాం.

నేను ఎప్పుడూ వాస్తవంలోనే బతుకుతాను. పరిస్థితులు ఎలా ఉన్నా స్వీకరించాలి. అయితే క్రికెట్ ఎప్పుడూ నాకు సంతోషాన్ని ఇస్తూనే ఉంది. నా కెరీర్ అసాంతం నా బ్యాటింగ్‌ను ఎంతగానో ఆస్వాదించాను. ఈ రోజు కూడా బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా. కెప్టెన్సీ లేదనే బాధ నాకు లేదు. ఆ ఆలోచన కూడా రాదు.
పెయిన్ కిల్లర్స్ సాయంతో ఆడా..
బ్యాటింగ్ చేసేటప్పుడు బ్యాటర్‌గానే ఆలోచిస్తా. జట్టు కోసం బాధ్యత తీసుకుంటా. మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లు ఆడటానికి ఇష్టపడుతా. పరిస్థితి ఏదైనా సరే.. నా ఆటను నేను ఆస్వాదిస్తా. తీవ్ర ఎండలో బ్యాటింగ్ చేయడంతో కాస్త అలసిపోయాను. అంతేకాకుండా రాత్రి నాకు జ్వరం వచ్చింది. అందుకే బ్యాటింగ్ తర్వాత ఫీల్డింగ్ చేయకుండా విశ్రాంతి తీసుకున్నా. పెయిన్ కిల్లర్స్, మందుల సాయంతో బ్యాటింగ్ చేశా. త్వరలోనే పూర్తిగా కోలుకుంటా.'అని హర్మన్‌ప్రీత్ కౌర్ పేర్కొంది.
భారత్ ఘన విజయం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్లకు 328 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ(106 నాటౌట్) సెంచరీలతో రాణించగా.. ప్రతీకా రావల్(61) హాఫ్ సెంచరీతో సత్తా చాటింది మంధాన(0) మాత్రం సిల్వర్ డక్‌గా వెనుదిరిగి నిరాశపర్చింది.
అనంతరం జింబాబ్వే 48.5 ఓవర్లలో 207 పరుగులకు కుప్పకూలింది. వైష్ణవి శర్మ(4/39) నాలుగు వికెట్లు తీయగా..దీప్తి శర్మ(3/32) మూడు వికెట్లు పడగొట్టింది. సయాలి, జింటిమణి కలిత, శ్రీచరణి తలో వికెట్ తీసారు. ఇరు జట్ల మధ్య ఆఖరి వన్డే బుధవారం జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


