వాడో దుర్మార్గుడు.. ఆస్ట్రేలియా కోసం టీమిండియాను ముక్కలు చేశాడు: హర్భజన్ సింగ్
టీమిండియా మాజీ హెడ్ కోచ్ గ్రేగ్ చాపెల్‌పై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా కోసం చాపెల్ కుట్ర చేశాడని, జట్టులో 'విభజించు, పాలించు' అనే దుర్మార్గపు విధానాన్ని అమలు చేశాడని మండిపడ్డాడు. అతని పదవికాలం భారత క్రికెట్ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయమని చెప్పుకొచ్చాడు.
2003 వన్డే ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టుకు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అయిన గ్రేగ్ చాపెల్ 2005లో హెడ్ కోచ్‌గా నియమితులయ్యాడు. అయితే అతని అనాలోచిత నిర్ణయాల కారణంగా జట్టు ఐక్యత పూర్తిగా దెబ్బతిన్నది. ఆటగాళ్ల మధ్య గొడవలు జరగడంతో పాటు భారత సారథ్య బాధ్యతల నుంచి సౌరవ్ గంగూలీని తప్పించడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. దాంతో 2007 వన్డే ప్రపంచకప్‌లో భారత్.. బంగ్లాదేశ్ వంటి పసికూన చేతిలో ఓడి లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది.

ఈ పరాజయంతో గ్రేగ్ చాపెల్ పదవి కాలం కూడా ముగిసింది. తాజాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న హర్భజన్ సింగ్.. గ్రేగ్ చాపెల్‌పై దుమ్మెత్తిపోసాడు. ఆటగాళ్ల మధ్య చాపెల్ చిచ్చు పెట్టాడని గుర్తు చేశాడు. ' హెడ్ కోచ్‌గా చాపెల్ పదవి కాలం భారత క్రికెట్ చరిత్రలోనే చీకటి అధ్యాయం. ముఖ్యంగా అప్పటి కెప్టెన్ దాదా(సౌరవ్ గంగూలీ)తో ప్రవర్తించిన తీరు, జట్టుతో వ్యవహరించిన పద్దతి దారుణం. ఆటగాళ్ల మధ్య గొడవలు సృష్టించి తాను ఆధిపత్యం చెలాయించాలనుకున్నాడు. దాని ఫలితంగా ప్రాణ స్నేహితుల్లా ఉన్న సహచర ఆటగాళ్లు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేశారు.
చాపెల్ ఇలా చేయడం వెనుక కుట్ర కోణం ఉండవచ్చనేది నా అనుమానం. ఆ సమయంలో ఆస్ట్రేలియాకు గట్టి పోటీ ఇవ్వగల ఏకైక జట్టు భారత్. అలాంటి జట్టును బలహీనపరిస్తే ఓడిపోతుందనే వ్యూహంతో చాపెల్ ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసి ఉండవచ్చు. అతని విధానాల కారణంగా 2007 వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఘోరంగా విఫలమైంది.'అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.
సీనియర్ ఆటగాళ్లను తొలగించి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని చాపెల్ భావించాడు. అంతేకాకుండా ఫామ్ కోల్పోయిన సౌరవ్ గంగూలీని సారథ్య బాధ్యతల నుంచి తప్పించాడు. ఈ నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


