ఎందుకు పక్కన పెట్టానో సంజూకు తెలుసు: గౌతమ్ గంభీర్
టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ను పక్కన పెట్టడంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. సంజూను ఎందుకు తప్పించామో అతనికి తెలుసని, ఆ క్లారిటీ అతనికి ఉందని చెప్పాడు. హెడ్ కోచ్, ఆటగాడి మధ్య జరిగిన సంభాషణను బయటకు వెల్లడించలేనని తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నాడు.
ఐర్లాండ్‌తో పాటు ఇంగ్లండ్‌తో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమవ్వడంతో సంజూ శాంసన్‌ను తుది జట్టు నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. జింబాబ్వే పర్యటనకు కూడా సంజూను ఎంపిక చేయలేదు. దాంతో టీమ్ మేనేజ్‌మెంట్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 గెలవడంలో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్‌ను ఎలా పక్కనపెడుతారు? అని మాజీ క్రికెటర్లు, నెటిజన్లు విమర్శలు గుప్పించారు.

సంజూకు ఆ క్లారిటీ ఉంది..
సంజూను పక్కనపెట్టినా టీమిండియా పరాజయాల పరంపర ఆగడం లేదు. మంగళవారం జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ 125 పరుగుల భారీ తేడాతో టీమిండియాను చిత్తు చేసింది. ఈ ఘోర పరాజయం అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న గంభీర్.. సంజూను తప్పించడానికి గల కారణాలను వెల్లడించాడు. టీమ్ కాంబినేషన్‌తో సంబంధం లేదని, మ్యాచ్ గెలిచామా? లేదా? అనేది చూడాలని చెప్పాడు. టీమిండియా వరుస పరాజయాలకు గల కారణాలను కూడా వెల్లడించాడు.
'తుది జట్టు నుంచి ఎందుకు తప్పించామనే విషయంపై సంజూ శాంసన్‌కు నావైపు నుంచి క్లారిటీ ఇచ్చాను. అది కేవలం హెడ్ కోచ్, ఆటగాడికి మధ్య జరిగిన సంభాషణ మాత్రమే. ఆ వివరాలను బహిర్గతం చేయలేను. సంజూ శాంసన్ వ్యవహరంలో మేం క్లారిటీగానే ఉన్నాం. భారత జట్టుకు అతను చేసిన సేవలను మరిచిపోలేం.
ఫామ్‌లో ఉన్నాడా? లేదా అన్నది ముఖ్యం..
అయితే ఏదైనా సిరీస్‌కు ఆటగాళ్లను ఎంపిక చేసేటప్పుడు సదరు ప్లేయర్ ఫామ్‌లో ఉన్నాడా? లేదా? అనేది పరిగణలోకి తీసుకుంటాం. సంజూ పునరాగమనం చేసి ఇదే సిరీస్‌లో పుంజుకోవచ్చు. ప్రపంచకప్ ముందు కూడా అతను ఇబ్బంది పడ్డాడు. కానీ, మెగా టోర్నీలో అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో టీమ్ కాంబినేషన్ సమస్య కాదు. ఫలితమే ముఖ్యం. తుది జట్టులో ఎవరు ఉన్నారనేదానికంటే మనం విజయం సాధించామా? లేదా? అనేది చూడాలి. టీమిండియా కోసం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ జట్టులో స్థానం దక్కుతుంది. అయితే ఐర్లాండ్‌తో పాటు ఇంగ్లండ్‌తో పరిస్థితులను అలవర్చుకోవడంలో ఆటగాళ్లు ఇబ్బంది పడటం చూశాం. ఇంకా మెరుగైన ఆటతీరు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. వరుసగా మేం నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోవడానికి ఇవే కారణాలుగా భావిస్తున్నాం.'అని గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 విజయానంతరం టీమిండియా ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం కూడా నమోదు చేయలేకపోయింది. టీ20 క్రికెట్ చరిత్రలోనే భారత్ ఇలా వరుసగా 5 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం సాధించకపోవడం ఇదే తొలిసారి. అంతేకాకుండా 125 పరుగుల తేడాతో ఓడిపోవడం కూడా ఇదే ఫస్ట్‌టైమ్. ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా 0-2తో వెనుకంజలో ఉంది. కీలకమైన నాలుగో టీ20 గురువారం రాత్రి 10 గంటలకు జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

