పాపం పడిక్కల్.. అంపైర్ ఘోర తప్పిదంతో డబుల్ సెంచరీ మిస్!(వీడియో)
టీమిండియా యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌ను దురదృష్టం వెంటాడింది. ఫీల్డ్ అంపైర్ ఘోర తప్పిదంతో పడిక్కల్(248 బంతుల్లో 24 ఫోర్లు, 3 సిక్స్‌లతో 199) తృటిలో డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. న్యూజిలాండ్-ఏతో ఓవల్ లింకాల్న్ వేదికగా జరుగుతున్న అనధికారిక టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అంపైర్ నిర్ణయంతో దేవదత్ పడిక్కల్ షాక్ అయ్యాడు. జాక్ గిబ్సన్ బౌలింగ్‌లో డౌన్ ది లైగ్ సైడ్ వేసిన బంతిని పడిక్కల్ లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి అతని బ్యాట్‌ను మిస్సై ప్యాడ్లను ముద్దాడుతూ.. వికెట్ కీపర్ చేతిలో పడింది. దాంతో న్యూజిలాండ్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. అంపైర్ ఔటిచ్చాడు. ప్యాడ్లను తాకిన సౌండ్‌ను బ్యాట్‌గా పొరపడి అంపైర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

ఈ షాట్ మిస్సైన అనంతరం కాసేపు క్రీజులోనే ఉన్న పడిక్కల్.. అంపైర్‌ను చూసి అవాక్కయ్యాడు. నెత్తిని బాదుకుంటూ తీవ్ర నిరాశలో పెవిలియన్ బాట పట్టాడు. అంపైర్ నిర్ణయంపై అతను తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. మైదానం వీడుతున్న అతన్ని నాన్‌స్ట్రైకర్ యశ్ రాథోడ్ అభినందించాడు. ప్రస్తుత ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అనధికారిక టెస్ట్‌ల్లో అంపైర్ల నిర్ణయాన్ని సవాల్ చేసే అవకాశం లేకపోవడంతో పడిక్కల్ అసాధారణ పోరాటం ముగిసింది.
204 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్-ఏ జట్టును దేవదత్ పడిక్కల్ అసాధారణ బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. ఓపెనర్లు కేఎల్ రాహుల్(5), యశస్వి జైస్వాల్(4) విఫలమైనా.. సాయి సుదర్శన్(91) సాయంతో మూడో వికెట్‌కు 215 పరుగులు జోడించాడు. సెంచరీ ముంగిట సాయి సుదర్శన్ ఔటైనా.. కెప్టెన్ ధ్రువ్ జురెల్(2) నిరాశపర్చినా.. యశ్ రాథోడ్‌తో కలిసి ఐదో వికెట్‌కు 142 పరుగులు జోడించాడు. దాంతో భారత్-ఏ భారీ లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే కుప్పకూలింది. దేవదత్ పడిక్కల్(32), యశ్ రాథోడ్(44) టాప్ స్కోరర్లుగా నిలవగా.. సైమన్ కీన్(5/24), జాక్ గిబ్సన్(3/29) భారత్ పతనాన్ని శాసించారు. అనంతరం న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 317 పరుగుల భారీ స్కోర్ చేసి 204 పరుగుల భారీ ఆధిక్యాన్ని అందుకుంది. భారత్-ఏ బౌలర్లలో అన్షుల్ కాంబోజ్, అకీబ్ నబీ మూడేసి వికెట్లు తీయగా.. ఆకాష్ దీప్ రెండు వికెట్లు పడగొట్టాడు. ముఖేష్ చౌదరి, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


