బంగ్లాదేశ్ పర్యటనకు భారత్.. సెప్టెంబర్‌లో 6 మ్యాచ్‌లు!
ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రద్దయిన భారత్ బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సిరీస్‌లను తిరిగి నిర్వహిస్తామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) ప్రకటించింది. బీసీసీఐతో విభేదాలు తలెత్తినప్పటికీ సెప్టెంబర్‌లో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లకు ఆతిథ్యం ఇస్తామని ధీమా వ్యక్తం చేసింది.
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడులను నిరసిస్తూ ఆ దేశ ఆటగాళ్లను ఐపీఎల్ నుంచి తొలగించాలని భారత్‌లో పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. ఈ నిరసనలకు తలొగ్గిన బీసీసీఐ.. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు నుంచి ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను తొలగించాలని ఆ ఫ్రాంచైజీని ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని తప్పుబట్టిన బంగ్లాదేశ్ ప్రభుత్వం.. భారత్‌తో కయ్యానికి కాలు దువ్వింది.

ఇదే సందు అని భావించిన పాకిస్థాన్.. బంగ్లాదేశ్‌ను రెచ్చగొట్టింది. దాంతో భారత్, బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భద్రతా కారణాలను చూపుతూ.. భారత్ వేదికగా జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీని కూడా బీసీబీ బహిష్కరించింది. దాంతో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ బరిలోకి దిగింది. అయితే బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారడంతో మళ్లీ ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఈ క్రమంలోనే గతేడాది వాయిదా పడిన ద్వైపాక్షిక సిరీస్‌లను ఈ ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రయత్నాలు చేస్తుంది.
ఈ విషయంపై బీసీబీ మీడియా కమిటీ ఛైర్మన్ ఆసిఫ్ రబ్బానీ మాట్లాడుతూ.. 'మేం ప్లాన్ ప్రకారం భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లను నిర్వహిస్తాం. భారత్‌తో సహా ఇతర ద్వైపాక్షిక సిరీస్‌ల మీడియా హక్కుల అమ్మకం కోసం మేం టెండర్ జారీ చేశాం. ఈ వేలంలో మంచి స్పందన వస్తుందని మేం ఆశిస్తున్నాం. భారత్‌తో సిరీస్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి అందరికీ తెలుసు. ద్వైపాక్షిక సిరీస్‌ల విషయంలో బీసీసీఐ నుంచి సానుకూలమైన సంకేతాలు ఉన్నాయి.'అని తెలిపారు.
బీసీబీ గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఆగస్ట్ 28న భారత జట్టు బంగ్లాదేశ్‌కు చేరుకుంటుంది. మూడు వన్డేల సిరీస్ సెప్టెంబర్ 1,3,6 తేదీల్లో జరగనుండగా.. సెప్టెంబర్ 9, 12, 13 తేదీల్లో మూడు టీ20ల సిరీస్ జరగాల్సి ఉంది. వాస్తవానికి ఈ సిరీస్‌లను 2025 ఆగస్ట్ సెప్టెంబర్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఇరు జట్ల బోర్డుల అంగీకారంతో.. ఈ సిరీస్‌ను 2026 సెప్టెంబర్‌కు వాయిదా వేశారు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు, ఇరు జట్ల షెడ్యూళ్లను దృష్టిలో ఉంచుకొనిఈ నిర్ణయం తీసుకున్నట్లు రెండు బోర్డులు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

