IND vs ENG: ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన భారత్.. చిత్తుగా ఓడిన బ్రూక్ సేన!
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా ఎట్టకేలకు విజయం సాధించింది. వరుసగా నాలుగు పరాజయాల తర్వాత మూడు వన్డేల సిరీస్‌లో శుభారంభం చేసింది. మంగళవారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో సమష్టిగా రాణించిన భారత్ 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది.
అక్షర్ పటేల్(4/62, 57*) ఆల్‌రౌండర్ ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించగా.. శుభ్‌మన్ గిల్(75 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 80 రిటైర్డ్ హర్ట్) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
అదరగొట్టిన అక్షర్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులకే ఆలౌటైంది. జోరూట్(76 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 76 నాటౌట్), లియామ్ డాసన్(83 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 68) హాఫ్ సెంచరీలతో రాణించగా.. బెన్ డకెట్(45 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ నాలుగు వికెట్లు తీయగా.. ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ రెండేసి వికెట్లు పడగొట్టారు. జస్‌ప్రీత్ బుమ్రా, శివమ్ దూబేకు చెరో వికెట్ దక్కింది.

అనంతరం భారత్ 45.2 ఓవర్లలో 4 వికెట్లకు 262 పరుగులు చేసి 28 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని కైవసం చేసుకుంది. శుభ్‌మన్ గిల్, అక్షర్ పటేల్(52 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 57 నాటౌట్), వాషింగ్టన్ సుందర్(63 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 52 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటగా.. శ్రేయస్ అయ్యర్(35) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్, సామ్ కరణ్ తలో వికెట్ తీసారు.
నిరాశపర్చిన కోహ్లీ, రోహిత్..
259 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఆశించిన శుభారంభం దక్కలేదు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన రోహిత్ శర్మ(11)తో పాటు విరాట్ కోహ్లీ(5) తీవ్రంగా నిరాశపర్చారు. సామ్ కరణ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ క్యాచ్ ఔటవ్వగా.. విరాట్ కోహ్లీని జోఫ్రా ఆర్చర్ ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. ఈ ఇద్దరూ వెనువెంటనే వెనుదిరిగడంతో భారత్ 48 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.
ఈ పరిస్థితుల్లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆచితూచి ఆడి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. అయ్యర్ కాస్త నిదానంగా ఆడినా.. గిల్ తనదైన శైలిలో బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో శుభ్‌మన్ గిల్ 51 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 101 పరుగుల భాగస్వామ్యంతో ఈ జోడీ క్రీజులో పాతుకుపోయింది. గిల్ సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ అతన్ని దురదృష్టం వెంటాడింది.
టెన్షన్ పెట్టిన అయ్యర్ రనౌట్..
క్రాంప్స్ రావడంతో గిల్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అతను మైదానం వీడిన కాసేపటికే క్రీజులో సెట్ అయిన శ్రేయస్ అయ్యర్.. అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. ఆ వెంటనే కేఎల్ రాహుల్(1) క్లీన్ బౌల్డ్ కావడంతో భారత శిభిరంలో ఆందోళన మొదలైంది. కానీ అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఆచితూచి ఆడి జట్టును విజయం దిశగా నడిపించారు.
సుందర్ సింగిల్స్, డబుల్స్‌తో బ్యాటింగ్ చేయగా.. అక్షర్ పటేల్ వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించాడు. ఈ క్రమంలో అతను 39 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరూ సాధికారికంగా బ్యాటింగ్ చేయడంతో భారత విజయం లాంఛనమైంది. విన్నింగ్ షాట్‌గా సిక్సర్ బాదిన సుందర్.. 63 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే గురువారం జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

