Asian Games 2026: ప్రత్యేకమైన జెర్సీలో భారత మహిళా క్రికెటర్లు.. ఎందుకంటే?
ఆసియా గేమ్స్ 2026 టోర్నీలో భారత మహిళల క్రికెట్ జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం ఆతిథ్య జపాన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.
అయితే ఈ మ్యాచ్‌లో భారత జట్టు భిన్నమైన జెర్సీలో బరిలోకి దిగింది. రెగ్యులర్ బ్లూ జెర్సీ, దానిపై పెద్ద ఎత్తున ఉండే కమర్షియల్ స్పాన్సర్స్ లోగోలు, బీసీసీఐ పేర్లు కనిపించలేదు. ఇది చూసి ఫ్యాన్స్ అందరూ ఆశ్చర్యపోయారు. భారత జట్టు జెర్సీ మార్పు వెనుక బలమైన కారణం ఉంది. అదేంటో తెలుసుకుందాం.
ఆ రూల్స్‌లో భాగంగానే..
ద్వైపాక్షిక సిరీస్‌లు, ఐసీసీ టోర్నీల్లో ఆడేటప్పుడు ఆటగాళ్లు నేరుగా బీసీసీఐ తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు. కానీ ఆసియా గేమ్స్ వంటి ప్రతిష్టాత్మక మల్టీ-స్పోర్ట్స్ ఈవెంట్లలో కేవలం క్రికెట్ జట్టు మాత్రమే పాల్గొనడం లేదు. భారతీయ అథ్లెట్ల బృందంలో భాగంగా బరిలోకి దిగుతోంది.
ఈ టోర్నీలో అథ్లెట్లంతా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ పతాకం కింద బరిలోకి దిగుతారు. వ్యక్తిగత క్రీడా సంఘాల గుర్తింపు కంటే దేశానికి ప్రాతినిథ్యం వహించే జాతీయ ఒలింపిక్ సంఘానికే ఇక్కడ అత్యంత ప్రాధాన్యత ఉంటుంది.

అన్ని ఆటలకు ఒకే రకమైన జెర్సీ..
అంతర్జాతీయ మల్టీ-స్పోర్ట్స్ ఈవెంట్లలో క్రీడాస్ఫూర్తి, సమానత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. అథ్లెటిక్స్, కుస్తీ, బ్యాడ్మింటన్, హాకీ, క్రికెట్.. ఏ క్రీడ అయినా సరే.. దేశం తరఫున బరిలోకి దిగే ప్రతి క్రీడాకారుడికి ఒకే రకమైన అధికారిక జెర్సీ కోడ్ వర్తిస్తుంది. ఇండియన్ ఒలింపిక్ అసోసియే(ఐఓఏ) ప్రత్యేకంగా రూపొందించిన డిజైన్.. రంగులు ఉన్న అధికారిక నేషనల్ కిట్‌నే ప్రతి ఒక్కరూ ధరించాల్సి ఉంటుంది. భారత క్రీడాకారులంతా ఒకే రకమైన జెర్సీలు ధరిస్తారు.
సాధారణంగా బీసీసీఐ జెర్సీలపై స్పాన్సర్ల లోగోలు పెద్ద సైజులో కనిపిస్తాయి. కానీ ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా (OCA), అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) రూల్స్ ప్రకారం.. ఈ వేదికలపై ప్రైవేట్ బోర్డుల వాణిజ్య ప్రకటనలు లేదా స్పాన్సర్ లోగోల ప్రదర్శనకు అనుమతి లేదు. క్రీడా వేదికలను వ్యాపార ప్రచారాలకు ఉపయోగించకూడదనే కఠినమైన రూల్స్ ఉన్నందునే.. టీమిండియా రెగ్యూలర్ జెర్సీలను పక్కనపెట్టి ఐఓఏ జెర్సీలతో భారత జట్టు బరిలోకి దిగింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పురుషుల టీమ్ కూడా ఐఓఏ జెర్సీలనే ధరించనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


