పృథ్వీ షా పెళ్లి పెటాకులు.. ఎంగేజ్‌మెంట్ రద్దు! ఇన్‌స్టాలో వెల్లడించిన ఆకృతి అగర్వాల్!
టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా వ్యక్తిగత జీవితంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఏడాది మార్చిలో నటి ఆకృతి అగర్వాల్‌తో అతను చేసుకున్న నిశ్చితార్థం రద్దయ్యింది. ఈ విషయాన్ని ఆకృతి అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా గురువారం వెల్లడించింది.
ఈ ఏడాది మార్చిలో తన చిరకాల ప్రేయసితో ఏడడుగులు వేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ పృథ్వీ షా ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలను పంచుకున్నాడు. ఇక పెళ్లే తరువాయి అనుకున్న క్రమంలో ఆకృతి అగర్వాల్ ఊహించని షాచ్చింది. తమ లక్ష్యాలు భిన్నంగా ఉండటంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామని ఆకృతి అగర్వాల్ తన ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చింది.

మా దారులు వేరు..
'చాలా బరువెక్కిన గుండెతో ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. భవిష్యత్తు గురించి మా ఆలోచనలు, లక్ష్యాలు భిన్నంగా ఉండటంతో పృథ్వీ షాతో విడిపోవాలనుకుంటున్నాను. మేం మా నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నాం.
మేం ఒకరినొకరం ఎంతగానో ప్రేమించుకున్నా.. గౌరవించుకున్నా... ఇద్దరి దారులు ఒక్కటి కావని అర్థం చేసుకున్నాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, బాధ్యతల దృష్ట్యా ఇద్దరం పరస్పర అంగీకారంతో వేర్వేరుగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. ముందుముందు మేమిద్దరం ఎవరి దారిలో వారు ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ప్లీజ్ ఊహాగానాలు వద్దు..
ఈ కష్టసమయంలో దయచేసి మా ప్రైవసీని గౌరవించాల్సిందిగా కోరుతున్నాను. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాల గురించి రకరకాల ఊహాగానాలు, అంచనాలు వేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. మా పరిస్థితిని అర్థం చేసుకుని, మాకు కాస్త సమయం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు'అని ఆకృతి అగర్వాల్ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. మరోవైపు పృథ్వీ షా ఎలాంటి పోస్ట్ చేయలేదు. ఆకృతి అగర్వాల్‌తో ఉన్న ఫొటోలను మొత్తం తన ఇన్‌స్టా ఖాతా నుంచి తొలగించాడు.
రెండు నెలల నుంచే గొడవలు..?
వాస్తవానికి రెండు నెలల క్రితమే పృథ్వీ షా-ఆకృతి అగర్వాల్ ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయ్యిందంటూ వార్తలు వచ్చాయి. ఈ ఏడాది జూన్‌లో ఆకృతి అగర్వాల్ పెట్టిన ఇన్‌స్టా పోస్ట్‌తో ఈ ప్రచారం మొదలైంది. 'నేను చాలా సార్లు మోసపోయా. కానీ ఒక్క మాట కూడా అనలేదు. అతనితో కలిసి జీవితంలో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాక ఇదంతా నమ్మలేకపోతున్నా. అతని గురించి సోషల్ మీడియాలో చూసిందంతా నిజమే. వందంతులన్నీ వాస్తవమే'అని ఆకృతి అగర్వాల్ పోస్ట్ చేసింది.
కానీ ఆ వెంటనే తన పోస్ట్‌ను అపార్థం చేసుకున్నారని, పృథ్వీ షాను ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టలేదని పేర్కొంది. 'ఒక విషయాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నాను. నేను ఎక్కడా నా కాబోయే భర్త పేరును ప్రస్తావించలేదు. అలాగే మా ఎంగేజ్‌మెంట్ రద్దయిందని గానీ, మేం విడిపోయామని గానీ చెప్పలేదు. ఆ పోస్ట్ పృథ్వీ షా గురించి పెట్టానని చాలా మంది భావించడం దురదృష్టకరం.
క్లారిటీ ఇచ్చినా..
మేం కలిసి సంతోషంగా ఉన్నాం. మా బంధం కొనసాగుతోంది. కేవలం ఊహగానాల ఆధారంగా ఒక వ్యక్తి ప్రతిష్ట, గౌరవం ఎంత ఈజీగా దెబ్బతింటాయో ఈ సంఘటన నాకు అర్థమయ్యేలా చేసింది. నేను పెట్టిన ఆ స్టోరీ నా క్లోజ్ ఫ్రెండ్స్ గురించి మాత్రమే. నేను చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల నేను అత్యంతగా ప్రేమించే వ్యక్తి తన పరువును కోల్పోయే పరిస్థితి వచ్చింది.'అని ఇన్‌స్టా స్టోరీ ఆకృతి వివరణ ఇచ్చింది. నిశ్చితార్థం రద్దు చేసుకున్నామని తాజాగా వెల్లడించడంతో ఈ ఇద్దరి మధ్య గత 2-3 నెలలుగా గొడవలు జరుగుతున్నట్లు అర్థమవుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


