టీమిండియాను తిట్టడానికే ఛీటింగ్ ఆరోపణలు: ఆకాష్ చోప్రా
టీమిండియాను తిట్టడానికే ఛీటింగ్ ఆరోపణలు చేశారని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అన్నాడు. కానీ భారత్ ఎలాంటి ఛీటింగ్‌కు పాల్పడలేదని స్పష్టం చేశాడు. ఇటీవల జపాన్‌తో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో భారత్ 2 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ ఆఖరి ఓవర్‌లో హైడ్రామా చోటు చేసుకుంది.
అక్షర్ పటేల్ వేసిన ఈ ఓవర్‌లో అంపైర్ వైడ్ ఇచ్చి తన నిర్ణయాన్ని మార్చుకోవడం వివాదాస్పదమైంది. బ్యాటర్ రివర్స్ స్వీప్ షాట్ ఆడినా వైడ్ ఇవ్వడాన్ని భారత ఆటగాళ్లు నిలదీసారు. కొత్త రూల్స్ ప్రకారం బ్యాటర్ స్విచ్ హిట్ ఆడితే బ్యాటర్ స్టాన్స్ మార్చుకున్నట్లేనని వాదించారు. దాంతో సహచర అంపైర్‌తో చర్చించిన ప్రధాన అంపైర్ వైడ్ కాదని ప్రకటించాడు. చివరకు భారత్ 2 పరుగులతోనే గెలవడంతో ఈ వైడ్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది.
టీమిండియా ఛీటింగ్ చేయలేదు..
భారత్ ఒత్తిడి చేయడంతోనే అంపైర్లు నిర్ణయాన్ని మార్చుకున్నారని, ఛీటింగ్ చేసి గెలిచిందని పలువురు నెటిజన్లు ఆరోపించారు. అయితే ఐసీసీ రూల్స్ ప్రకారం ఫీల్డ్ అంపైర్ తమ నిర్ణయాన్ని మార్చుకునే అధికారం ఉంది. ఈ వ్యవహారంపై తన యూట్యుబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన ఆకాష్ చోప్రా.. ఛీటింగ్ ఆరోపణలను కొట్టిపారేసాడు.

'భారత్ ఛీటింగ్ చేసి జపాన్‌పై గెలిచిందని కొందరు అంటున్నారు. అంపైర్ తన వైడ్ నిర్ణయాన్ని మార్చుకోవడంతో ఈ వివాదం తలెత్తింది. భారత ఆటగాళ్ల ఒత్తిడితోనే అంపైర్ నిర్ణయం మార్చుకున్నాడని ఆరోపిస్తున్నారు. అనవసరంగా గందరగోళం సృష్టిస్తున్నారు. టీమిండియాను తిట్టాలనుకునే వారు చాలా మంది ఉన్నారు. భారత్ అన్యాయంగా గెలిచిందనడం సరికాదు. ఎందుకంటే అది ఏ మాత్రం అన్యాయం కాదు.
నేను కూడా తప్పుగా ఆలోచించాను..
ఈ విషయంలో నేను కూడా పొరబడ్డాను. స్విచ్ హిట్ ఆడకపోతే.. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, రైట్ హ్యాండ్ బ్యాటర్‌గా మారడనుకున్నా. స్విచ్ హిట్ ఆడినప్పుడు మాత్రమే బౌలర్‌కు అనుకూలంగా ఇరువైపులా వైడ్‌లైన్ పరిగణనలోకి తీసుకుంటారని, రివర్స్ స్వీప్ ఆడినప్పుడు కాదని నేను భావించాను.
అంతేకాకుండా బౌలర్ బంతి వేసే సమయంలో బ్యాటర్ తన స్టాన్స్ మార్చుకున్నాడా? బంతి వేయడానికి ముందే స్టాన్స్ మార్చుకోకపోతే.. అది వైడ్‌గానే ఉంటుందని అనుకున్నాను. కానీ నా ఆలోచన తప్పని తెలిసొచ్చింది. నేను ఐసీసీ రూల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించాను. అంపైర్లు చెప్పింది కూడా విన్నాను.
రెండు షాట్స్ ఒకటే..
ఐసీసీ నయా రూల్స్ ప్రకారం.. స్విచ్ హిట్, రివర్స్ స్వీప్ మధ్య ఎలాంటి తేడా లేదు. రెండింటినీ ఒక్కటిగానే చూస్తారు. రెండు షాట్లను ఒకేలా పరిగణిస్తారు. బంతి బౌలర్ చేతిలో ఉందా? రిలీజ్ అయ్యిందా? అనేదానితో సంబంధం లేకుండా బ్యాటర్ ఎప్పుడు పొజిషన్ మార్చుకున్నా.. స్టాన్స్ మార్చుకున్నట్లుగానే పరిగణిస్తారు.
కాబట్టి బెన్‌ఫిట్ ఆఫ్ ది డౌట్ అడ్వాంటేజ్ బౌలర్‌కే దక్కుతుంది. ఈ రూల్స్ ప్రకారం బ్యాటర్ స్విచ్ హిట్, రివర్స్ స్వీప్ ఆడితే ఒకే సమయంలో లెఫ్ట్, రైట్ హ్యాండర్‌గా పరిగణిస్తారు.'అని ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


