IND vs NZ: ఫిలిప్స్ క్యాచ్ కోసం మైదానంలోకి దూకిన ప్రేక్షకుడు!(వీడియో)
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య శనివారం జరిగిన రెండో టీ20లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాటర్ గ్లేన్ ఫిలిప్స్ కొట్టిన భారీ సిక్సర్‌ను అందుకునేందుకు ఓ ప్రేక్షకుడు మైదానంలోకి దూకాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. 'ఇదెక్కిడి పిచ్చిరా అయ్యా'అని ఒకరంటే.. మైదానంలోకి దూకడం ఏంట్రా? అని మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..?
అక్షర్ పటేల్ వేసిన 15వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని ఫిలిప్స్ స్టెప్ ఔటై లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాడు. ఈ బంతిని అందుకోవడానికి ప్రయత్నించిన ఒక ప్రేక్షకుడు.. ఫెన్సింగ్ బయటకి దొర్లుకుంటూ పడిపోయాడు. సరిగ్గా బౌండరీ వెనుక ఉండే హోర్డింగ్‌ల దగ్గర పడ్డాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి. అదృష్టవశాతస్తు సదరు అభిమానికి గాయాలు కాలేదు. పక్కనే ఉన్న ఫ్యాన్స్ అయ్యో అంటూ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారు.

ఉత్కంఠ పోరులో భారత్ విజయం
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. గ్లేన్ ఫిలిప్స్(43 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 70), బెవాన్ జాకోబ్స్(46 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 58) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(2/33) రెండు వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్(1/50), ప్రిన్స్ యాదవ్(1/30), నితీష్ కుమార్ రెడ్డి(1/31)తలో వికెట్ తీసారు. స్పిన్నర్లు నమన్ ధీర్, అక్షర్ పటేల్ వికెట్లు తీయకపోయినా.. కట్టడిగా బౌలింగ్ చేశారు.
అనంతరం భారత్ 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 181 పరుగులు చేసి గెలుపొందింది. తెలుగు తేజాలు తిలక్ వర్మ(26 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 51 నాటౌట్), నితీష్ కుమార్ రెడ్డి(13 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 26 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో అదిరిపోయే విజయాన్ని అందించారు. ఓటమి ఖాయమనుకున్న ఈ మ్యాచ్‌లో 69 పరుగుల అజేయ భాగస్వామ్యంతో గట్టెక్కించారు.
నమన్ ధీర్(17 బంతుల్లో ఫోర్లు, 2 సిక్స్‌లతో 31) దూకుడుగా ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్(4/21) నాలుగు వికెట్లు తీయగా.. జాకోబ్ డఫీ, నాథన్ స్మిత్ తలో వికెట్ తీసారు. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 మంగళవారం జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


