
టోక్యో: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో ఈవెంట్లో నిరాశే ఎదురైంది. మహిళల డిస్కస్ త్రో ఈవెంట్‌లో ఫైనల్ చేరి ఆశలు రేకెత్తించిన కమల్ ప్రీత్ కౌర్ పోరాటం ముగిసింది. క్వాలిఫయింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆమె ఆ జోరును ఫైనల్లో కొనసాగించలేకపోయింది. ఫలితంగా 6వ స్థానంలో నిలిచి మెడల్ లేకుండానే ఆమె ఇంటిదారి పట్టింది. క్వాలిఫయింగ్‌లో కమల్‌ప్రీత్ డిస్క్‌ను 64 మీటర్ల దూరం విసిరితే కీలక ఫైనల్లో మాత్రం 63.70 మీటర్లు మాత్రమే విసిరింది.
ఇక అమెరికా స్టార్ వలారీ అల్‌మన్ 68.98 మీటర్లతో అగ్రస్థానంలో నిలిచి పసిడి సొంతం చేసుకోగా.. క్రిస్టిన్ పుదెంజ్(జర్మనీ) 66.86 మీటర్లతో సిల్వర్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ వైమి పెరెజ్ (క్యూబా) 65.72 మీటర్లతో బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకుంది. మొత్తం 6 ప్రయత్నాల్లో మూడు సార్లు ఫౌల్ చేసిన 25 ఏళ్ల కమల్ ప్రీత్.. తొలి ప్రయత్నంలో 61.62 మీటర్లు విసిరింది. రెండో ప్రయత్నంలో ఫౌల్ చేయగా.. 63.70 మీటర్లు విసిరి టాప్-8లో చోటు దక్కించుకుంది. దాంతో కమల్‌ప్రీత్‌కు మరో 3 ప్రయత్నాలు లభించగా.. ఫస్ట్ అటెంప్ట్‌లో ఫౌల్ చేసి రెండో ప్రయత్నంలో 61.37 మీటర్లు విసిరింది. ఇక చివరి ప్రయత్నంలో మరోసారి ఫౌల్ చేసి తీవ్రంగా నిరాశపరిచింది. దాంతో ఒలింపిక్స్ క్రీడల్లో అథ్లెటిక్స్ విభాగంలో మెడల్ నిరీక్షణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నిరీక్షణకు కమల్ ప్రీత్‌తో ఈ రోజు తెరపడుతుందని అంతా భావించినా.. ఆమె ఊరించి ఊసురుమనిపించింది.