
అంటిగ్వా: రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో గురువారం మొదలైన తొలి టెస్టు భారత జట్టు ఎంపికపై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తొలి టెస్టు తుది జట్టులో ఓపెనర్ రోహిత్ శర్మ, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు చోటు దక్కలేదు. దీంతో ముఖ్యంగా అశ్విన్ గురించి గవాస్కర్ మాట్లాడుతూ అసహనం వ్యక్తం చేశారు.
రోహిత్, అశ్విన్‌కు దక్కని చోటు.. కోహ్లీపై విమర్శల వర్షం
గవాస్కర్ వ్యాఖ్యానం చేస్తూ మాట్లాడారు. 'టెస్టుల్లో అశ్విన్‌కు మంచి రికార్డు ఉంది. అందులోనూ వెస్టిండీస్‌పై అత్యద్భుతమై రికార్డు కలిగి ఉన్నాడు. అలాంటి ఆటగాడికి 11 మంది సభ్యులతో కూడిన జట్టులో చోటు దక్కకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది' అంటూ గావస్కర్ పేర్కొన్నాడు. గావస్కర్‌తో పాటు పలువురు మాజీలు కూడా తీవ్రంగా విమర్శించారు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీపై ట్విట్టర్‌లో విమర్శల వర్షం కురుస్తోంది.
అశ్విన్‌కు వెస్టిండీస్‌పై ఘనమైన రికార్డే ఉంది. విండీస్‌పై ఇప్పటివరకు 11 టెస్టులు ఆడిన అశ్విన్ 60 వికెట్లను పడగొట్టాడు. ఇందులో ఐదు వికెట్లను నాలుగు సందర్భాల్లో సాధించాడు. అంతేకాకుండా 552 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉండటం విశేషం. 2016లో వెస్టిండీస్‌లో భారత్ పర్యటించినపుడు అశ్విన్ 17 వికెట్లు పడగొట్టాడు, అంతేకాదు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా అందుకున్నాడు. విండీస్‌పై ఆల్‌రౌండర్‌గా మంచి రికార్డు ఉన్న అశ్విన్‌ను జట్టులోకి తీసుకోకపోవడంపై అందరూ కోహ్లీపై మండిపడుతున్నారు.
'సెంచరీ కోసం కాదు.. జట్టు కోసమే ఆలోచిస్తా'
అయితే టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్యా రహానే కెప్టెన్ నిర్ణయాన్ని సమర్థించాడు. 'రవిచంద్రన్ అశ్విన్ వంటి ఆటగాడు తుది జట్టులో లేకపోతే చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ.. ఉత్తమ కలయిక ఏమిటో జట్టు యాజమాన్యం ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. ఈ వికెట్‌పై రవీంద్ర జడేజా మంచి ఎంపిక అని వారు భావించారు. ఎందుకంటే మాకు ఆరో బ్యాట్స్‌మన్ కూడా అవసరం. జడేజా అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. ఈ ట్రాక్‌పై విహారీ బాగా బౌలింగ్ చేయగలడు కాబట్టి కెప్టెన్, కోచ్ అతన్ని తీసుకున్నారు. రోహిత్ వంటి ఆటగాడిని బెంచ్‌పై కూర్చోబెట్టడం చాలా కష్టం' అని రహానే పేర్కొన్నాడు.