హిందూ దేవాలయం సందర్శించి మరీ.. సాయం చేసిన అఫ్రిది!

కరాచీ: కరోనా రక్కసికి విలవిలలాడుతున్న అభాగ్యులకు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. తన స్వచ్ఛంద సంస్థ ద్వారా పేద ప్రజలకు నిత్యవసర సరకులు అందజేస్తున్నాడు. తమ దేశంలోని మారుమూల గ్రామాలకు సైతం తన ఫౌండేషన్ సేవలను విస్తరించాడు. సాయం కోసం ఎదురు చూస్తున్న ప్రతీ ఒక్కరిని ఆదుకుంటున్నాడు.
ముస్లిం రాజ్యం అయిన పాకిస్థాన్‌లో మాములు సమయంలోనే ఇతర మతాల ప్రజలకు దక్కే గౌరవం చాలా తక్కువ. వారిని ప్రభుత్వం కూడా పెద్దగా పట్టించుకోదు. ఇక ఇలాంటి విపత్కర పరిస్థితిలో వారి బతుకు అగమ్యగోచరం. కానీ అఫ్రిది అందరూ సమానమే.. మతం కన్నా మానవత్వమే గొప్పా అని చాటుతున్నాడు. ఇప్పటికే పేద హిందువులు, క్రిస్టియన్‌లకు బియ్యం, నిత్యవసర వస్తువులను ఈ పాక్ మాజీ కెప్టెన్ అందజేసాడు. గత రెండు నెలలుగా సహాయ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తు అందరి మన్ననలు అందుకుంటున్న అఫ్రిది ఈ రోజు మరో మెట్టు ఎక్కాడు.
మనమంతా ఒక్కటే..
తాజాగా తమదేశంలోని ఓ హిందూ దేవాలయాన్ని సందర్శించి.. ఆ దేవస్థానానికి చెందిన వారికి కావాల్సిన నిత్యవసర సరకులు అందజేశాడు. ఈ విషయాన్ని అఫ్రిదే ట్వీటర్ వేదికగా తెలియజేశాడు. ‘మనమంతా ఒక్కటే.. అందరం కలిసి ఈ మహమ్మారిపై విజయం సాధించాలి. ఐక్యతే మన బలం. శ్రీలక్ష్మీ నారాయణ దేవాలయాన్ని సందర్శించి నిత్యవసర సరకులు అందజేసి వారికి భరోసా కల్పించడం జరిగింది.'అని ఆ టెంపుల్ విజిట్‌కు సంబంధించిన ఫొటోలను అఫ్రిది ట్వీట్ చేశాడు.
బ్రాండ్స్‌కు బంపరాఫర్..
ఇక గత నెలలో తన ఫౌండేషన్ నిధుల కోసం అఫ్రిది బ్రాండ్స్‌కు బంఫరాఫర్ ఇచ్చాడు. కరోనా నేపథ్యంలో వ్యాపార సంస్థలకు ప్రచారకర్తగా ఉచితంగా పనిచేస్తానని.. కాకపోతే తన ఫౌండేషన్‌కు బియ్యం, నిధులు ఇవ్వాలని కోరాడు. ట్విటర్ వేదికగా ఓ వీడియోను విడుదల చేసి ఆయా బ్రాండ్స్‌కు విజ్ఞప్తి చేశాడు. ‘మీరంతా బాగానే ఉన్నారని ఆశిస్తున్నా. నేను గతంలో పనిచేసిన అన్ని బ్రాండ్లకు, వివిధ వాణిజ్య ప్రకటన సంస్థలకు ఇది నా నుంచి విభిన్నమైన విన్నపం. ఇన్నాళ్లు నా స్వంత ప్రయోజనాల కోసం నేను, మార్కెటింగ్ అవసరాలు కోసం మీరు నాతో పనిచేయించుకున్నారు. కానీ ఇప్పుడు కష్టాల్లో ఉన్న నా దేశం కోసం ఆయా బ్రాండ్లన్నిటికీ నా సేవలను అందిస్తానని తెలియజేస్తున్నా.

బియ్యం ఇస్తే చాలు..
నా స్వచ్చంద సంస్థ ద్వారా పుడ్ డ్రైవ్ చేపట్టాననే విషయం మీకు తెలిసే ఉంటుంది. సాధ్యమైనంత వరకు అన్ని ప్రదేశాలను కవర్ చేయడానికి మేం ప్రయత్నిస్తున్నాం. పాకిస్థాన్ చాలా పెద్ద దేశం. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ప్రజలు రేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. వాణిజ్యపరంగా మీ నుంచి నేను ఏం ఆశించడం లేదు. సోషల్ మీడియా, టీవీల ద్వారా మీకు అందుబాటులో ఉంటా. నాకెలాంటి డబ్బులు కూడా అవసరం లేదు. కానీ ప్రజలకు సాయం చేసేందుకు బియ్యాన్ని అందజేయండి' అని అఫ్రిది ఆ వీడియోలో విజ్ఞప్తి చేశాడు.

అఫ్రిది సేవకు యూవీ, భజ్జీ ఫిదా..
కరోనా వైరస్ కట్టడి కోసం అఫ్రిది ఫౌండేషన్ చేస్తున్న కృషిని భారత వెటరన్ క్రికెటర్లు హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ మెచ్చుకున్న విషయం తెలిసిందే.
అన్నింటికంటే మానవత్వం గొప్పదంటా కొనియాడారు. అంతేకాకుండా అఫ్రిదికి మద్దతు తెలుపుతూ అతని ఫౌండేషన్‌కు విరాళాలు ఇవ్వాలని కూడా ఇద్దరు వేర్వేరుగా ఓ వీడియోను ట్వీట్ చేశారు. 'ప్రతీ ఒక్కరికి ఇది చాలా కఠినమైన సమయం. ముఖ్యంగా అభాగ్యుల కష్టాలు చెప్పలేనివి. వారికి వీలైనంత సాయం చేద్దాం. షాహిద్ అఫ్రిదీ, అఫ్రిదీ ఫౌండేషన్‌కు నా మద్దతు ఉంటుంది. కోవిడ్-19 కట్టడికి అతను ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయం. దయచేసి ఆ సంస్ధకు విరాళాలు ఇవ్వండి'అని యూవీ, భజ్జీ అప్పట్లో విజ్ఞప్తి చేశారు. ఇక పాకిస్థాన్‌లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఆ దేశంలో ఇప్పటికి వరకు 34 వేల మందికి పైగా ఈ మహమ్మారి భారిన పడ్డారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో కొంత కట్టడి చేయగలిగింది. అయితే దేశ ఆర్థిక వ్యవస్థ అతలా కుతలమవ్వడంతో త్వరలోనే లాక్‌డౌన్ ఎత్తేస్తామని ప్రకటించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
యూవీ.. నీకు మతిపోయిందా.. పాక్‌కు సాయం చేయమంటావ్?