గంభీర్‌పై మరోసారి నోరుపారేసుకున్న షాహిద్ అఫ్రిది!

కరాచీ : పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మరోసారి భారత్ ఆటగాళ్లపై తన అక్కసును వెళ్లగక్కాడు. భారత్ అంటేనే అణువణువునా విద్వేషం పెంచుకున్న ఈ పాక్ మాజీ క్రికెటర్ అవకాశం వచ్చిన ప్రతీసారి విషం చిమ్ముతూనే ఉంటాడు. పాక్ చేతిలో చిత్తుగా ఓడిన ప్రతీసారి భారత ఆటగాళ్లు తమపై దయచూపమని కోరేవారని ఆ మధ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అఫ్రిది.. అక్తర్‌ను చూసి దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ వణికేవాడని కూడా కామెంట్ చేశాడు. ఇక టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌తో సోషల్ మీడియా వేదికగా తరుచూ వాగ్వాదానికి దిగే ఈ పాక్ మాజీ కెప్టెన్.. తాజాగా అతనిపై మరోసారి నోరుపారేసుకున్నాడు.

క్రికెటర్‌గా ఓకే కానీ మనిషిగానే..
క్రికెటర్‌గా గంభీర్ అంటే తనకు ఇష్టమేనని, కానీ మనిషిగా మాత్రం అతని మనస్తత్వాన్ని అంగీకరించలేనన్నాడు. గంభీర్‌లో మానసికంగా ఏదో లోపం ఉందన్నాడు. పాక్ జర్నలిస్ట్ జైనాబ్ అబ్బాస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఫ్రిది.. గంభీర్ గురించి మాట్లాడుతూ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. గంభీర్ ఎప్పుడూ అభద్రతా భావంతో ఉండేవాడని భారత మాజీ మెంటల్ కడీషనింగ్ కోచ్ ప్యాడీ ఆప్టన్ తన పుస్తకంలో రాసిన వ్యాఖ్యలను అఫ్రిది ఇక్కడ ప్రస్తావించాడు.
‘ఓ క్రికెటర్‌గా, బ్యాట్స్‌మన్‌గా గంభీర్‌ను నేనెప్పుడూ ఇష్టపడుతాను. కానీ ఓ మనిషిగా మాత్రం అతనంటే నాకు నచ్చదు. అతను మాట్లాడే మాటలు, చేసే పనులు చూస్తే అతనికి ఏవో మానసిక సమస్యలున్నట్లు అనిపిస్తుంది. ఈ విషయాన్ని గంభీర్ మానసిక నిపుణుడు(ప్యాడీ ఆప్టన్) కూడా చెప్పాడు'అని అఫ్రిది తెలిపాడు.

సెంచరీ బాదినా..
ఇక ఆప్టన్ తన పుస్తకం 'ది బేర్‌ఫుట్ కోచ్'లో గంభీర్‌కు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించాడు. ఏ విషయంలోనూ అతడు సంతృప్తి చెందేవాడు కాదని, నిరాశావాదిగా కనిపించేవాడన్నాడు. మ్యాచ్‌లో సెంచరీ బాదినా కూడా అతడి ముఖంలో సంతోషం కనిపించేది కాదని తన పుస్తకంలో రాసుకొచ్చాడు. పదేపదే తన తప్పులను గుర్తుచేసుకుంటూ బాధపడేవాడని పేర్కొన్నాడు.
'గంభీర్ మానసిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు చాలా ప్రయత్నించా. అందులో కొంతవరకు విజయం సాధించా. దీంట్లో భాగంగానే అతడు 2009లో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా కూడా నిలిచాడు. కానీ నేను అతడిపై మరింత దృష్టి సారించి ఉంటే ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిగా మారేవాడు' అని తన పుస్తకంలో వివరించాడు.

గంభీర్ కౌంటర్..
తాను నిరాశవాది, అభద్రతా భావంతో ఉండేవాడినైతే తీవ్ర ఒత్తిడి మధ్య 2011 వరల్డ్‌కప్ ఫైనల్లో ఎలా రాణించానని గౌతీ ప్రశ్నించాడు. ప్యాడీ మాటలపై తనకు కోపం లేదన్న గంభీర్ .. పరిస్థితిని తాను చూసే విధానం వేరన్నాడు. తాను గొప్ప ఆటగాడిగా, టీమిండియా ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుగా ఎదగాలనే తపన తనలో ఉండేదని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఆ తపన వల్లే సెంచరీ చేసినా సరే డబుల్ సెంచరీ చేయలేకపోయానే అని బాధపడేవాడినని గౌతీ తెలిపాడు. కెరీర్‌లో చిన్నప్పుడు నుంచే ఎన్నోసార్లు తిరస్కరణకు గురైనా, మానసికంగా బలంగా ఉండడం వల్లే జాతీయ జట్టుకు సేవలందించానని అప్పట్లో గౌతమ్ కౌంటరిచ్చాడు.

గంభీర్ vs అఫ్రిది..
ఇక గంభీర్, అఫ్రిది మధ్య మాటల యుద్దం కొత్తేం కాదు. క్రికెట్ మైదానం నుంచి కొనసాగుతూనే ఉంది. ఆటను వదిలినా.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న ప్రతీసారి చెరోమాట అనుకోవడం సర్వసాధారణమైపోయింది. ఆ మధ్య భారత ప్రధానిపై అఫ్రిది అనుచిత వ్యాఖ్యలు చేయగా.. గంభీర్ తిప్పికొట్టాడు. ఇప్పటికి పాకిస్థాన్ అన్నా.. ఒంటి కాలుపై లేస్తుంటాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
హార్దిక్ ఒడిలో నటాషా.. శునకంతో పాండ్యా ముద్దులాట!