Virat Kohli టీ20 కెప్టెన్సీ వదలుకోవడానికి అసలు కారణం ఇదే!

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని ఇటీవల ప్రకటించిన విరాట్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీకి కూడా గుడ్‌బై చెప్పాడు. యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగే ఆర్‌సీబీ కెప్టెన్‌గా తనకు చివరిదని, ఆ తర్వాత ఆటగాడిగానే జట్టులో కొనసాగుతానని ఆదివారం వెల్లడించాడు. వరుసగా కోహ్లీ తీసుకుంటున్న అనూహ్య నిర్ణయాల పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనేక సందేహాలు రేకెత్తుతున్నాయి.
వర్క్ లోడ్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని విరాట్ చెప్పినా..అనేక కథనాలు వెలువడ్డాయి. బీసీసీఐతో సత్సంబంధాలు సరిగ్గా లేవని, రోహిత్ శర్మతో తెచ్చే పోలికే కోహ్లీని చిరాకుకు గురిచేసిందని, బ్యాటింగ్‌పై మరింత దృష్టిపెట్టి ఎక్కువ కాలం క్రికెట్ ఆడాలనే లక్ష్యంతోనే తప్పుకున్నాడని ప్రచారం జరిగింది.

ఫ్యామిలీతో గడిపే తీరిక లేక..
తాజాగా ఈ ఊహాగానాలకు తెరదించుతూ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ అసలు కారణాన్ని వెల్లడించాడు. 'ఖేల్‌నీతీ' యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకునే విషయంపై కోహ్లీ తనతో చర్చించాడని, ఇప్పుడే వద్దని తాను వారించినట్లు చెప్పుకొచ్చాడు.
'టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని విరాట్ కోహ్లీ చాలా కాలంగా అనుకుంటున్నాడు. కానీ నేను తొందరపాటు వద్దని వారించాను. కానీ తనపై పనిభారం ఎక్కువైందని, కుటుంబంతో కూడా గడపలేకపోతున్నానని చెప్పాడు. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని తెలిపాడు.

గౌరవంగా తప్పుకోవాలని
అంతేకాకుండా దురదృష్టవశాత్తు యూఏఈ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలవకపోతే.. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతుందని, టీ20 ప్రపంచకప్ తర్వాత తప్పుకుంటానని ముందుగానే చెబితే గౌరవంగా తప్పుకున్నట్లుంటుందని చెప్పాడు. ఈ ఒక్క కారణంతోనే ముందుగా వెల్లడిస్తున్నానని కోహ్లీ నాతో అన్నాడు.
టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నా టెస్ట్, వన్డేల్లో సారథిగా కొనసాగాలని కోహ్లీ అనుకుంటున్నాడు. అంతేకాకుండా 2023 వన్డే ప్రపంచకప్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.'అని రాజ్‌కుమార్ శర్మ చెప్పుకొచ్చాడు.
IPL 2021: విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం.. ఆర్‌సీబీ కెప్టెన్సీకి గుడ్‌బై !

ఇదే నా చివరి ఐపీఎల్..
ఇక ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో కోహ్లీ మాట్లాడుతూ.. 'ఆర్‌సీబీ కెప్టెన్‌గా నాకు ఇదే చివరి ఐపీఎల్. ఎంతో ఆలోచించి టీమ్ అందరితో మాట్లాడిన తర్వాతే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నా. గతంలో చెప్పినట్లుగానే నా చివరి ఐపీఎల్ మ్యాచ్ వరకు ఆర్‌సీబీలో ప్లేయర్‌గా కొనసాగుతా. చాలామంది టాలెంటెడ్ ప్లేయర్లున్న ఆర్‌సీబీ జట్టును కెప్టెన్‌గా నడిపించిన నా ప్రయాణం చాలా గొప్పగా సాగింది. ఈ అవకాశం నాకిచ్చిన ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్, ప్లేయర్లందరికి ధన్యవాదాలు. నాపై నమ్మకంతో నాకు మద్దతుగా నిలిచిన ఆర్‌సీబీ అభిమానులకు కృతజ్ఞతలు'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

ఒక్క టైటిల్ లేదు..
ఇక 2013లో ఆర్‌సీబీ పగ్గాలు అందుకున్న విరాట్ కోహ్లీ.. ఇప్పటి దాకా 132 మ్యాచ్‌ల్లో జట్టును నడిపించాడు. ఇందులో 65 మ్యాచ్‌ల్లోనే జట్టును గెలిపించగలిగాడు. కాగా, విరాట్ నాయకత్వంలోని ఆర్‌సీబీ ఇప్పటిదాకా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. 2016 సీజన్‌లో ఫైనల్ చేరినా చాంపియన్‌గా నిలవలేకపోయింది. అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడైన విరాట్ కోహ్లీ.. ఆర్‌సీబీకి గొప్ప ఆస్తని ఆ ఫ్రాంచైజీ చైర్మన్ ప్రథమేశ్ మిశ్రా అన్నారు. విరాట్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ అతన్నిసపోర్ట్ చేస్తున్నామని తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications