
దుబాయ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్ ముగిసిన తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటించాడు. అయితే తన చివరి ఐపీఎల్ మ్యాచ్ వరకు ఆర్‌సీబీకే ఆడుతానని స్పష్టం చేశాడు. ఇన్నాళ్లు తనకు అండగా నిలిచిన ప్రతీ ఆర్‌సీబీ అభిమానికి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ మేరకు విరాట్ కోహ్లీ మాట్లాడిన వీడియోను ఆర్‌సీబీ ట్వీట్ చేసింది.
'ఆర్‌సీబీ కెప్టెన్‌గా నాకు ఇదే చివరి ఐపీఎల్ సీజన్. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా ఆటగాడిగా ఆర్‌సీబీలోనే ఉంటా. నా కెరీర్ చివరి ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆర్‌సీబీ తరఫునే ఆడుతా. నాపై నమ్మకం ఉంచి అండగా నిలిచిన ఆర్‌సీబీ అభిమానులకు కృతజ్ఞతలు'అని విరాట్ కోహ్లీ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. ఇక కెప్టెన్‌గా జట్టుకు కోహ్లీ చేస్తున్న సేవలను ఆ జట్టు డైరెక్టర్, హెడ్ కోచ్ మైక్ హెస్సెన్ కొనియాడాడు. కోహ్లీ తన నిర్ణయాన్ని వెల్లడించిన వెంటనే అతను ట్విటర్ వేదికగా స్పందించాడు. అతని సారథ్యానికి ఘనమైన ముగింపు పలికేందుకు ఆర్‌సీబీ ఆటగాళ్లంతా సిద్దంగా ఉన్నారని తెలిపాడు.
'ఆర్‌సీబీ టీమ్‌తో ఉన్నది చాలా తక్కువ సమయమే అయినా.. కమిట్‌మెంట్ కలిగిన కెప్టెన్‌గా, టీమ్ మ్యాన్‌గా, కోహ్లీ జట్టు చేసినదానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక టైటిల్ గెలిచి కోహ్లీ సారథ్యానికి ఘనమైన ముగింపు పలికేందుకు కుర్రాళ్లంతా సిద్దంగా ఉన్నారని నాకు తెలుసు'అని మైక్ హెస్సెన్ ట్వీట్ చేశాడు.
ఇప్పటికే దుబాయ్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ తర్వాత భారత టీ20 సారథ్య బాధ్యతలను వదులుకుంటానని కోహ్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. మూడు ఫార్మాట్ల కెప్టెన్‌గా తనపై పడుతున్న పని భారాన్ని తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నానని , వన్డే, టెస్ట్‌ల్లో కెప్టెన్‌గా కొనసాగుతానని స్పష్టం చేశాడు. సన్నిహితులు, లీడర్ గ్రూప్‌లో కీలకమైన రవిశాస్త్రి, రోహిత్ శర్మతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు.
అయితే కోహ్లీ అనూహ్య నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరూ అతనిది సాహసోపేత నిర్ణయమని కొనియాడగా.. మరికొందరేమో పలు అనుమానాలు రేకెత్తించారు. ఈ క్రమంలోనే అనేక కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఆర్‌సీబీ కెప్టెన్సీ నుంచి తప్పుకోకుండా టీమిండియా టీ20 ఫార్మాట్ సారథ్య బాధ్యతలను వదులుకోవడం ఏంటనే ప్రశ్నలు కూడా తలెత్తాయి. తాజాగా అతను ఐపీఎల్ కెప్టెన్సీని కూడా వదులుకుంటానని చెప్పడంతో.. బ్యాటింగ్‌పై కోహ్లీ సీరియస్‌గా దృష్టిపెట్టనున్నట్లు స్పష్టమవుతోంది.