ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీ నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ).. మెగా టోర్నీకి ప్రతీకారంగా ఫ్రాంచైజీ తరహా టీ20 టోర్నీ నిర్వహించేందుకు సిద్దమైంది. టీ20 ప్రపంచకప్ మిస్ అవుతున్న తమ ఆటగాళ్లు, ప్రేక్షకుల కోసం బీసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ టోర్నీకి ఒడొమ్మో బంగ్లాదేశ్(ODOMMO BANGLADESH) పేరు పెట్టింది.
భారత్‌లో తమ ఆటగాళ్ల భద్రతకు ముప్పు పొంచి ఉందని, తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చేసిన విజ్ఞప్తిని ఐసీసీ తోసిపుచ్చింది. టోర్నీకి సమయం దగ్గరపడిన నేపథ్యంలో మ్యాచ్ వేదికలను మార్చడం కుదురదని, భారత్‌లో బంగ్లా ఆటగాళ్ల భద్రతకు ముప్పులేదని ఐసీసీ స్పష్టం చేసింది. దాంతో బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకోగా.. స్కాట్లాండ్‌ను ఐసీసీ ఎంపిక చేసింది. ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ క్రమంలోనే బీసీబీ ఒడొమ్మో బంగ్లాదేశ్ పేరుతో సరికొత్త టీ20 లీగ్‌ను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రపంచకప్ ఆడలేకపోతున్న తమ దేశ ఆటగాళ్లకు ప్రాక్టీస్ కల్పించడం, నిరాశలో ఉన్న ప్రేక్షకులను అలరించడానికి ఈ లీగ్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ ముందుకొచ్చింది. ఒడొమ్మో బంగ్లాదేశ్ అంటే అణచలేని, అజేయమైన బంగ్లాదేశ్ అని అర్థం.
తేల్చిసిన బంగ్లాదేశ్.. టీ20 వరల్డ్ కప్‌పై కీలక నిర్ణయం!
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ జరిగే సమయంలోనే ఈ లీగ్ జరగనుంది. బంగ్లాదేశ్ జాతీయ జట్టు ఆటగాళ్లతో పాటు దేశవాళీ ప్లేయర్లతో ఈ లీగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్ ఆటగాళ్లను మూడు జట్లుగా విభజించారు. ఈ టోర్నీ కోసం మొత్తం 2.5 కోట్ల టాకాలు (బంగ్లాదేశ్ కరెన్సీ) ప్రైజ్ మనీ, ప్లేయర్ ఫీజుల రూపంలో కేటాయించారు. అన్ని మ్యాచ్‌లు మీర్పూర్‌లోని షేర్-ఏ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఫ్లడ్ లైట్ల వెలుతురులో జరుగుతాయి. ఫిబ్రవరి 5, 6 మరియు 7 తేదీల్లో లీగ్ మ్యాచ్‌లు జరగనుండగా.. ఫిబ్రవరి 9న నిర్వహించనున్నారు.
వరల్డ్ కప్ సమయంలోనే ప్రత్యామ్నాయ లీగ్ నిర్వహించడం ద్వారా ఐసీసీ నిర్ణయంపై తమ నిరసనను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని బంగ్లా క్రికెట్ బోర్డు భావిస్తోంది. వరల్డ్ కప్ ద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోయిన బోర్డుకు, ఈ లీగ్ ద్వారా స్పాన్సర్‌షిప్, బ్రాడ్‌కాస్టింగ్ రూపంలో ఆదాయం సమకూరనుంది. ఈ టోర్నీ ద్వారా జాతీయ ఆటగాళ్లు ఖాళీగా ఉండకుండా, పోటీతత్వంతో కూడిన క్రికెట్ ఆడేలా చూడటం బంగ్లాదే శ్ క్రికెట్ బోర్డు ప్రధాన లక్ష్యం.
బంగ్లాదేశ్ తప్పుకోవడం.. భారత్‌తో మ్యాచ్‌ను పాకిస్థాన్ బహిష్కరించడం వంటి పరిణామాలతో ఐసీసీకి భారీ నష్టం వాటిల్లనుంది. ముఖ్యంగా భారత్, పాక్ మ్యాచ్ జరగకపోతే.. రూ. 4500 కోట్ల వ్యాపారం ప్రభావితం అవుతుందని బిజినెస్ ఎక్స్‌పర్ట్స్ అంచనా.