ఐసీసీతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు జరుపుతున్న పోరు మరింత ముదిరింది. టీ20 ప్రపంచ కప్ ఆతిథ్య వేదికల విషయంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌లో అడుగుపెట్టే ప్రసక్తే లేదని, అవసరమైతే ప్రపంచకప్‌నే బహిష్కరిస్తామని తేల్చిచెప్పింది. భారత్ వేదికగా జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనేది లేదని స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో తమ ఆటగాళ్లను భారత్‌కు పంపడం క్షేమకరం కాదని, వేదికలను మార్చకపోతే టోర్నమెంట్ నుంచే తప్పుకుంటామని బంగ్లా భీష్మించుకు కూర్చుంది.
ఐసీసీ నిర్ణయంపై ఆగ్రహం
బుధవారం జరిగిన సమావేశంలో ఐసీసీ.. బంగ్లాదేశ్ అభ్యర్థనను తోసిపుచ్చింది. షెడ్యూల్ ఇప్పటికే ఖరారైందని, మ్యాచ్ వేదికలను మార్చడం కుదరదని తేల్చిచెప్పింది. దీనిపై బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ తీవ్రంగా స్పందించారు. "ఐసీసీ మాకు న్యాయం చేయలేదు. మేము ఎవరికీ తలవంచం. బంగ్లాదేశ్ ప్రపంచకప్ ఆడకపోతే దాని పరిణామాలు ఎలా ఉంటాయో అందరూ అర్థం చేసుకోవాలి. ఏ పరిస్థితుల్లోనూ మా ఆటగాళ్ల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు" అని ఆయన హెచ్చరించారు.

ఆటగాళ్ల భద్రతే ముఖ్యం
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారులతో పాటు జాతీయ జట్టు ఆటగాళ్లు కూడా ఈ నిర్ణయానికి మద్దతుగా నిలిచారు. బంగ్లాదేశ్ ఆడే మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రతిపాదించింది. అయితే దీనిని ఐసీసీ తిరస్కరించింది భారత్‌కు వెళ్లే విషయంలో తమకు అసౌకర్యంగా ఉందని, భద్రతా పరమైన ఆందోళనలు ఉన్నాయని ఆటగాళ్లు బోర్డుకు వివరించారు. దీంతో బోర్డు తన పట్టును మరింత బిగించింది.
పరిణామాలు ఏంటి?
ఒకవేళ బంగ్లాదేశ్ ప్రపంచకప్ నుంచి తప్పుకుంటే.. అది ఆ దేశ క్రికెట్‌పై ఆర్థికంగా మరియు క్రీడాపరంగా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఐసీసీ నుంచి ఆంక్షలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ ఆటగాళ్ల ప్రాణాల కంటే ఏదీ ఎక్కువ కాదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. ప్రస్తుతానికి బంగ్లాదేశ్ తన మొండి పట్టు వీడటం లేదు. ఐసీసీ తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే, బంగ్లాదేశ్ లేని టీ20 ప్రపంచకప్‌ను మనం చూడాల్సి రావచ్చు.