రైనాకు విజయ గర్వం తలకెక్కింది.. అతని నిష్క్రమణతో మాకు వచ్చే నష్టమేం లేదు: శ్రీనివాసన్

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ నుంచి టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా తప్పుకున్న విషయం తెలిసిందే. కరోనా భయం, కుటుంబంపై బెంగ, సన్నిహితుల మరణం... రైనా నిష్క్రమణకు కారణాలనే ప్రచారం జరుగుతుంది. అయితే 2008నుంచి నిషేధం ఎదుర్కొన్న రెండు సీజన్లు మినహా చెన్నై సూపర్ కింగ్స్‌కే ప్రాతినిధ్యం వహించిన రైనా ఇలా కీలక సమయంలో తప్పుకోవడంపై ఆ జట్టు యజమాని ఎన్ శ్రీనివాసన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైనా తప్పుకోవడం వల్ల తమ జట్టుకు వచ్చే నష్టమేం లేదని, కోట్ల రూపాయాలు చేజార్చుకొని అతనే పశ్చాత్తాపానికి గురవుతాడని తెలిపాడు. తాను చేసిన తప్పు తెలుసుకొని రైనానే జట్టులోకి వస్తాడని ఔట్‌లుక్ ఇండియాతో మాట్లాడుతూ చెప్పాడు.

మాకు ధోనీ ఉన్నాడు..
‘క్రికెటర్లు కూడా పాత తరం సినిమాల్లాగే తమ గురించి తాము బాగా గొప్పగా ఊహించుకుంటారు. చెన్నై టీమ్‌లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని లేకుండా అంతా కుటుంబంలా ఉంటారు. నిజంగా నీకు అసంతృప్తి ఉంటే వెళ్లిపోవచ్చు. ఎవరినీ నేను బలవంత పెట్టను. కొన్ని సార్లు విజయం తలకెక్కడం సహజం. నాకు ధోని రూపంలో బలమైన కెప్టెన్ ఉన్నాడు. అతనితో నేను మాట్లాడా. పరిస్థితి అంతా నియంత్రణలోనే ఉంది.

భయపడాల్సిన పనిలేదు..
ఒక వేళ మా జట్టులో కరోనా కేసులు పెరిగినా భయపడనవసరం లేదని చెప్పాడు. మా వద్ద ప్రతిభకు కొదవ లేదు. రైనా స్థానంలో సత్తా చాటేందుకు రుతురాజ్‌కు ఇది మంచి అవకాశం. అయినా ఇంకా ఐపీఎల్ మొదలే కాలేదు. భారీ డబ్బు (రూ. 11 కోట్లు)తో సహా తాను ఏం కోల్పోయాడో రైనా తర్వాత తెలుసుకుంటాడు' అని శ్రీనివాసన్ అన్నారు. అయితే అతని మాటలను బట్టి చూస్తే రైనా ఫ్రాంచైజీతో నెలకొన్న విభేదాలతోనే ఐపీఎల్ వీడినట్లు తెలుస్తోంది.

హోటల్ గది విషయంలో..
దుబాయ్‌లో తనకు కేటాయించిన హోటల్ గది పట్ల రైనాలో కలిగిన అసంతృప్తే చివరకు ఇలా హఠాత్తుగా వెళ్లిపోవడానికి కారణమైందని తెలిసింది. బయో బబుల్ వాతావరణంలో కఠిన నిబంధనలు పాటిస్తూ హోటల్‌లోనే ఆటగాళ్లు ఐసోలేషన్‌లో ఉండాల్సిన స్థితిలో తనకు ఇచ్చిన గది మొదటి రోజే రైనాకు నచ్చలేదు. కనీసం దానికి సరైన బాల్కనీ కూడా లేదని అతను అన్నట్లు తెలిసింది.
చివరకు సరిగ్గా ధోనికిచ్చిన తరహా గది తనకు కావాలంటూ అతను కోరాడు. అయితే తగిన స్పందన రాకపోవడంతో చివరకు ధోనికే విషయం చెప్పాడు. ఈ విషయంలో తానేమీ చేయలేనన్న ధోని... రైనా ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం చేయలేదు. దాంతో ధోనిపై కూడా అసహనం కనబరుస్తూ రైనా ‘వ్యక్తిగత కారణాలు' అంటూ స్వదేశం బయల్దేరిపోయాడని ప్రచారం జరుగుతుంది.

పిల్లల కంటే ఏదీ ముఖ్యం కాదు..
ఇక జట్టులో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో రైనా భయాందోళనకు గురైనట్లు మరో విధంగా ప్రచారం జరుగుతుంది. ‘పిల్లల కంటే ఏదీ ముఖ్యం కాదు అని రైనా సహచరులతో అన్నాడు. అందుకే లీగ్ నుంచి వైదొలిగాడు' అని జాతీయ మీడియా పేర్కొంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
ధోనీ రిటైర్మెంట్‌కు అదే కారణం: ఆర్పీ సింగ్