ఇంత చెత్త మేనేజ్‌మెంట్‌ను ఎప్పుడూ చూడలేదు: మహమ్మద్ కైఫ్
గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమిండియా మేనేజ్‌మెంట్‌పై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ఘాటు విమర్శలు గుప్పించాడు. ఇంత చెత్త మేనేజ్‌మెంట్‌ను తాను ఎప్పుడూ చూడలేదని మండిపడ్డాడు. టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ, టీ20 వరల్డ్ కప్ హీరో సంజూ శాంసన్ విషయంలో మేనేజ్‌మెంట్ వ్యవహరించిన తీరు సరిగ్గా లేదన్నాడు.
ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా 0-4తో కోల్పోయింది. ఈ సిరీస్‌లోని రెండో మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ తీవ్రంగా నిరాశపర్చాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో 14, 13, 15 విఫలమైన అతను జట్టులో చోటు కోల్పోయాడు. తొలి టీ20, ఆఖరి మ్యాచ్ ఆడిన సంజూ శాంసన్ కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.
ఇంత గందరగోళమా..?
ఈ సిరీస్ పరాజయంపై ఎక్స్ వేదికగా స్పందించిన మహమ్మద్ కైఫ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించాడు. 'ఇంత గందరగోళంలో ఉన్న టీమిండియా మేనేజ్‌మెంట్‌ను నేనెప్పుడూ చూడలేదు. వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్ విషయంలో మేనేజ్‌మెంట్ వ్యవహరించిన తీరు ఏ మాత్రం ప్రొఫెషనల్‌గా లేదు.
ఒకరు ప్రపంచ స్థాయి ప్రతిభ ఉన్న ఆటగాడు. మరొకరు ప్రపంచకప్ విజేత. ఇద్దరికి ఆత్మవిశ్వాసం ఇవ్వాలి కానీ, వారి మనస్సులో సందేహాలు నింపకూడదు'అని కైఫ్ ట్వీట్ చేశాడు.

ఐపీఎల్ చూసి ఎంపిక చేస్తే ఇలానే అవుతోంది..
మరో మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కూడా సెలెక్టర్లపై విమర్శలు గుప్పించాడు. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా టీమిండియాలోకి ఎంపిక చేయవద్దని సూచించాడు. 'ఐపీఎల్ అనేది భారత ఆటగాళ్లకు వేసే హెవీ మేకప్ లాంటిది. విదేశాల్లో రాణించే సత్తా ఉన్న ఆటగాళ్లను గుర్తించాలి. ఎందుకంటే సొంతగడ్డపై సరదాగా పరుగులు చేసే రోజులు ముగిసాయి.'అని సంజయ్ మంజ్రేకర్ విమర్శలు గుప్పించాడు.
టీ20 సిరీస్‌లో చిత్తుగా ఓడిన టీమిండియా వన్డే సిరీస్‌కు సిద్దమైంది. టీమిండియా సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ ఈ సిరీస్ ఆడుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టుకు ఎదురైన ఘోర పరాజయానికి ప్రతీకారం తీర్చుకునేందుకు శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా సిద్దమైంది.
కోహ్లీ, రోహిత్, బుమ్రా రీఎంట్రీ..
మంగళవారం బర్మింగ్‌హామ్ వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో ఈ మూడు వన్డేల సిరీస్‌కు తెరలేవనుంది. వన్డే ప్రపంచకప్ 2027 సన్నాహకాల్లో ఉన్న ఇరు జట్లు ఈ సిరీస్‌ను గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, శుభ్‌మన్ గిల్ జట్టులో ఉండటం భారత్‌కు కొండంత బలాన్ని ఇస్తుంది. గాయాలతో చివరి నిమిషంలో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తీలు దూరం కాగా.. వారి స్థానాల్లో ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్‌లకు అవకాశం దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

