గంభీర్.. కుర్రాళ్ల జీవితం నాశనం చేస్తున్నావ్: మహమ్మద్ కైఫ్
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశాడు. కుర్రాళ్ల జీవితాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డాడు. ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో యువ పేసర్ అకీబ్ నబీకి వరుసగా అవకాశాలు ఇవ్వకపోవడాన్ని కైఫ్ తప్పుబట్టాడు.
ఈ మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-1తో గెలుచుకున్నా.. జట్టు బౌలింగ్ బలహీనతలు బయటపడ్డాయి. మూడో వన్డేలో 352 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. రెండో వన్డేతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన అకీబ్ నబీ.. 8.5 ఓవర్లలో 84 పరుగులు ఇచ్చుకున్నాడు. దాంతో అతన్ని మూడో వన్డే నుంచి తప్పించిన టీమ్ మేనేజ్‌మెంట్.. అరంగేట్ర ప్లేయర్ అన్షుల్ కాంబోజ్‌కు అవకాశం ఇచ్చింది. అతను కూడా 10 ఓవర్లు వేసి 82 పరుగులిచ్చుకున్నాడు.
కుర్రాళ్ల కెరీర్ నాశనం..
ఇదే విషయాన్ని తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ప్రస్తావించిన కైప్.. గంభీర్ నేతృత్వంలోని మేనేజ్‌మెంట్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. యువ బౌలింగ్ దళం.. కెప్టన్ శుభ్‌మన్ గిల్‌కు నష్టం చేస్తుందని, ఎందుకంటే అతను కూడా యువ కెప్టెన్ అని కైఫ్ పేర్కొన్నాడు.

'కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంటున్నారు. కానీ వాళ్లకు తగిన మద్దతు ఇవ్వడం లేదు. ఒకసారి అవకాశం ఇచ్చాక వాళ్లకు మరికొన్ని మ్యాచ్‌లు ఆడటానికి అవకాశం ఇవ్వాలి. అసలు అకీబ్ నబీని ఒక్క మ్యాచ్‌కే ఎందుకు పక్కనపెట్టారు? అతని స్థానంలో ఆడిన అన్షుల్ కాంబోజ్ కూడా పరుగులిచ్చాడు కదా? ఇలా చేయడం వల్ల కుర్రాళ్ల కెరీర్ నాశనమవుతుంది.
ఇదే ప్లాన్ అంటే కష్టం..
అకీబ్ నబీ మళ్లీ వైట్ బాల్ క్రికెట్ ఎప్పుడు ఆడతాడో.. అసలు ఆడతాడో లేదో కూడా తెలీదు. ఇది చాలా తప్పు. టీమిండియాకు సరైన బ్యాకప్ బౌర్లు లేరు. ఇదే రకమైన ప్లానింగ్ కొనసాగితే ముందుముందు జట్టుకు చాలా నష్టం జరుగుతుంది. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు అనుభవం తక్కువ. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాడు.
కెప్టెన్‌గా సెట్ అవ్వడానికి అతనికి టైమ్ పడుతుంది. యువ కెప్టెన్ అయిన శుభ్‌మన్ గిల్.. అనుభవం లేని బౌలింగ్ టీమ్‌ను నడిపించడమే అతనికి పెద్ద మైనస్ అవుతుంది. ప్రపంచకప్‌కు చాలా తక్కువ సమయం ఉంది. అతను కంగారుపడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది.
అకీబ్ నబీకి ఒక్క మ్యాచ్‌లో అవకాశం ఇచ్చి వెంటనే పక్కనపెట్టారు. నితీష్ రెడ్డికి ఒక మ్యాచ్‌లో మాత్రమే కొత్త బంతితో బౌలింగ్ చేయించి, మరుసటి మ్యాచ్‌కు ప్లాన్ మార్చేశారు. ఆ తర్వాత కాంబోజ్‌ని జట్టులోకి తెచ్చారు. భారత్ ఓడిపోవడానికి మరో కారణం స్లో ఓవర్ రేట్. ఈ తప్పిదం కారణంగా ఫీల్డర్లను సర్కిల్ లోపలికి తెచ్చుకోవాల్సి వచ్చింది. ప్రత్యర్థి బ్యాటర్లు పరుగుల మోత మోగిస్తుంటే.. కెప్టెన్‌గా ఏం చేయాలో తోచక చాలా టైమ్‌ను కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వృథా చేశాడు.
సిరీస్‌తో నష్టమే ఎక్కువ..
నా అభిప్రాయం ప్రకారం ఈ సిరీస్ వల్ల భారత జట్టుకు ఏ మాత్రం ఫాయిదా లేదు. కోహ్లీ, రోహిత్, గిల్, కేఎల్ రాహుల్ సెంచరీలు కొట్టడం పెద్ద విషయమేమీ కాదు. వాళ్లు ఎప్పుడూ కొడుతూనే ఉంటారు. దానివల్ల కొత్తగా సాధించిందేమీ లేదు. సాధారణంగా ఏదైనా సిరీస్ ఆడుతున్నప్పుడు మన బలహీనతలను సరిదిద్దుకుని ముందుకు సాగాలి. కుల్దీప్ యాదవ్ వికెట్లు తీశాడు కానీ.. ఈ సిరీస్‌కు ముందు అతనికి తగిన అవకాశాలు ఇవ్వలేదు.
ఈ సిరీస్ వల్ల జట్టుకు ఒరిగింది ఏమీ లేదు.. ఇంకా నష్టమే జరిగింది. ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింది. కెప్టెన్‌గా గిల్‌కు కూడా తనపై తనకే సందేహాలు మొదలై ఉండొచ్చు. ఈ సిరీస్ ఎలా ఉందంటే.. ఉన్నవాడు ఇంకా ధనవంతుడు అవ్వడం, లేనివాడు మరింత పేదవాడు అవ్వడం లాగా ఉంది. ఈ సిరీస్ నుంచి భారత్‌కు సానుకూల అంశం లభించలేదు.'అని కైఫ్ అభిప్రాయపడ్డాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

