IND vs NZ: ఆ తప్పిదాలతో పాటు ఆ ముగ్గురు మా కొంపముంచారు: మిచెల్ సాంట్నర్
ఫీల్డింగ్‌లో చేసిన చిన్న చిన్న పొరపాట్లతో పాటు తిలక్ వర్మ, నమన్ ధీర్, నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన బ్యాటింగ్ తమ ఓటమిని శాసించిందని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ అన్నాడు. తిలక్, నితీష్ భాగస్వామ్యాన్ని విడదీసి ఉంటే ఈ మ్యాచ్ గెలిచేవాళ్లమని అభిప్రాయపడ్డాడు.
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా క్రైస్ట్‌చర్చ్ వేదికగా శనివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన మిచెల్ సాంట్నర్.. భారత లోయరార్డర్ బ్యాటర్లపై ప్రశంసల జల్లు కురిపించాడు.
ఒక్క వికెట్ తీస్తే గెలిచేవాళ్లం..
'బలమైన జట్టుతో ఆడుతున్నప్పుడు మ్యాచ్‌లు ఇలాగే ఆఖరి వరకు ఉత్కంఠగా సాగుతాయి. తిలక్ వర్మ, నమన్ ధీర్, చివర్లో నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా ఆడారు. తిలక్, నితీష్ రెడ్డి భాగస్వామ్యాన్ని విడదీసి ఉంటే మ్యాచ్ మా చేతుల్లోకి వచ్చేది. కానీ వాళ్లు ఛేజింగ్ అద్భుతంగా హ్యాండిల్ చేశారు. దాంతో చివర్లో మేం కొన్ని తప్పులు చేయాల్సి వచ్చింది.

మా బౌలింగ్ సమయంలో నా మదిలో చాలా ఆలోచనలు మెదిలాయి. మా బౌలర్లు మ్యాచ్‌ను అద్భుతంగా ప్రారంభించారు. 180 పరుగుల లక్ష్య ఛేదనలో ప్రత్యర్థి పవర్‌ప్లేలో గట్టిగా పుంజుకుంటే ఆ తర్వాత మ్యాచ్‌ను కంట్రోల్ చేయడం కష్టం. కానీ మేం మిడిల్ ఓవర్లలో పుంజుకున్నాం.
ఫీల్డింగ్ తప్పిదాలే కొంపముంచాయి..
ముఖ్యంగా బ్రేస్‌వెల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. వికెట్లు పడటం కూడా మాకు కలిసొచ్చింది. కానీ నో బాల్‌కి వికెట్ పడటం లాంటి పొరపాట్లు మా విజయవకాశాలను దెబ్బతీసాయి. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడినా.. నైపుణ్యాల పరంగా మేం బాగానే ఆడుతున్నాం. కానీ ఫీల్డింగ్‌లో చేసిన చిన్న చిన్న పొరపాట్లే మా కొంపముంచాయి.'అని మిచెల్ సాంట్నర్ చెప్పుకొచ్చాడు.
ఉత్కంఠ పోరులో భారత్ విజయం
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. గ్లేన్ ఫిలిప్స్(43 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 70), బెవాన్ జాకోబ్స్(46 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 58) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(2/33) రెండు వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్(1/50), ప్రిన్స్ యాదవ్(1/30), నితీష్ కుమార్ రెడ్డి(1/31)తలో వికెట్ తీసారు. స్పిన్నర్లు నమన్ ధీర్, అక్షర్ పటేల్ వికెట్లు తీయకపోయినా.. కట్టడిగా బౌలింగ్ చేశారు.
అనంతరం భారత్ 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 181 పరుగులు చేసి గెలుపొందింది. తెలుగు తేజాలు తిలక్ వర్మ(26 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 51 నాటౌట్), నితీష్ కుమార్ రెడ్డి(13 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 26 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో అదిరిపోయే విజయాన్ని అందించారు. ఓటమి ఖాయమనుకున్న ఈ మ్యాచ్‌లో 69 పరుగుల అజేయ భాగస్వామ్యంతో గట్టెక్కించారు.
నమన్ ధీర్(17 బంతుల్లో ఫోర్లు, 2 సిక్స్‌లతో 31) దూకుడుగా ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్(4/21) నాలుగు వికెట్లు తీయగా.. జాకోబ్ డఫీ, నాథన్ స్మిత్ తలో వికెట్ తీసారు. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 మంగళవారం జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


