KKR vs SRH: ఈ ఘోర తప్పిదాలే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమికి కారణమా?

అబుదాబి: భారీ సిక్సర్లు లేవు.. వరుస బౌండరీలు లేవు.. కళ్లు చెదిరే క్యాచ్‌లు లేవు.. బౌలింగ్ మయాజాలం లేదు. అంతా చప్పగా సాగిపోయిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణంగా ఓడింది. సరైన టార్గెట్ నిర్దేశించలేక ఆరెంజ్ ఆర్మీ చేతులెత్తేసింది. మనీశ్ పాండే(38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38) పర్వాలేదనిపించినా.. ఇతర ఆటగాళ్లు తడబడటంతో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది.
మరోవైపు ప్రణాళిక ప్రకారం రాణించిన కోల్‌కతా నైట్ రైడర్స్ 7 వికెట్లతో గెలిచి ఎట్టకేలకు బోణీ చేసింది. యువ క్రికెటర్ శుభమన్ గిల్(62 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 నాటౌట్, ) క్లాస్ ఇన్నింగ్స్‌తో కేకేఆర్‌కు గెలుపు జీవం పోయగా.. ఇయాన్ మోర్గాన్(29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 నాటౌట్) అండగా నిలిచాడు. ఈ మ్యాచ్ ఆసాంతం కేకేఆర్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలుత కట్టుదిట్టమైన బౌలింగ్.. ఆ తర్వాత ప్రణాళికబద్దమైన బ్యాటింగ్‌తో ఆ జట్టు అద్భుత విజయాన్నందుకుంది. వన్‌సైడెడ్‌గా జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ఓటమికి ప్రధాన కారణం ఆ జట్టు బ్యాటింగ్ వైఫల్యం.
తొలి మ్యాచ్‌లో ఎదురైన ఓటమి నుంచి పాఠం నేర్చుకోని జట్టు మరోసారి పేలవ బ్యాటింగ్‌తో చతికిలపడింది. వృద్ధిమాన్ సాహా బంతులను స్వాహా చేయడం.. భారీ షాట్లు ఆడగల ఆటగాళ్లు జట్టులో లేకపోవడం, బెయిర్ స్టో, డేవిడ్ వార్నర్‌లపైనే పూర్తిగా బ్యాటింగ్ ఆర్డర్ ఆధారపడటం.. వారు విఫలమైతే రాణించడానికి ప్లాన్ బి లేకపోవడం.. అతి ముఖ్యంగా 35-40 బంతులను డాట్ చేయడం హైదరాబాద్ దారుణ ఓటమికి కారణమయ్యాయి.

సాహా.. బంతులన్నీ స్వాహా..
హైదరాబాద్ బ్యాటింగ్ బలం డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో అని భావించిన కేకేఆర్ దినేశ్ కార్తీక్ దానికి తగ్గట్లు బౌలింగ్ వేయించాడు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో నిప్పులు చెలరేగిన కమిన్స్‌తో ఆరంభంలోనే మూడు ఓవర్లు వేయించాడు. అలాగే మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీకి బంతిని ఇచ్చి ఫలితాన్ని రాబట్టాడు. అతని బంతిని తప్పుగా అంచనా వేసిన వార్నర్ మూల్యం చెల్లించుకున్నాడు. ఈ వికెట్ హైదరాబాద్ పతనానికి తెరదీసింది. అనంతరం విజయ్ శంకర్ గాయంతో జట్టులోకి వచ్చిన వృద్ధీమాన్ సాహా.. మనీష్ పాండేకు అండగా నిలిచాడు. కానీ టీ20 ఫార్మాట్‌కు కావాల్సిన మెరుపులను మెరిపించలేకపోయాడు. 31 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌తో 30 పరుగులు మాత్రమే చేశాడు. సింగిల్స్ తీసాడే తప్పా భారీ షాట్లకు ప్రయత్నించలేదు. మరోవైపు మనీష్ పాండే హాఫ్ సెంచరీ చేసినా.. అందులో భారీ షాట్లు లేవు. 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 బంతుల్లో 51 పరుగులు చేశాడు. అంతేకాకుండా హిట్ చేస్తాడనుకున్న సమయంలో రస్సెల్ వేసిన బంతికి అయోమయానికి గురైన పాండే.. చీప్‌గా వికెట్ చేజార్చుకున్నాడు. ఇది కూడా హైదరాబాద్ బ్యాటింగ్ వైఫల్యానికి కారణమైంది.

టీమ్‌మేనేజ్‌మెంట్ వైఫల్యం..
తొలి మ్యాచ్ ఓటమి నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌మేనేజ్‌మెంట్ నేర్చుకోకపోవడం.. సరైన ప్రణాళికలు, హోమ్ వర్క్ లేకుండా బరిలోకి దిగడం ఆరెంజ్ ఆర్మీ కొంప ముంచింది. అతిగా ఆధారపడుతున్న వార్నర్, బెయిర్ స్టో విఫలమైతే పరిస్థితి ఏందని ఆలోచించకపోవడం.. దానికి తగ్గ ప్లాన్ బి రూపొందించకపోవడం హైదరాబాద్ బ్యాటింగ్ వైఫల్యానికి కారణమయ్యాయి. టీ20 క్రికెట్‌లో భారీ షాట్లు ఆడగలిగే బ్యాట్స్‌మెన్‌ను మిడిల్ ఓవర్లలో పంపించకుండా సాహాను పంపించడం కూడా విమర్శలకు దారితీసింది. అతని స్థానంలో మహ్మద్ నబీని పంపించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.

రషీద్‌పైనే ఆధారపడటం..
142 పరుగుల లక్ష్యమే అయినా సన్‌రైజర్స్ బౌలర్లు మంచి శుభారంభం అందించారు. తొలి 7 ఓవర్లలోనే మూడు వికెట్లు తీసారు. కానీ శుభమన్ గిల్, ఇయాన్ మోర్గాన్ స్మార్ట్‌గా ఆడటంతో ఏం చేయలేకపోయారు. ఈ ఇద్దరు రషీద్ బౌలింగ్ ఓపికపట్టి మిగతా వారి ఓవర్లను ఆడుకున్నారు. రషీద్‌లా ఇతరులు రాణించకపోవడం సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ బలహీనతలను బయటపెట్టింది. వికెట్లు రాకపోవడం.. బౌలింగ్ విభాగం రషీద్‌పైనే అతిగా ఆధారపడుతుందనే సంకేతాలనిచ్చింది.

కోల్‌కతా సూపర్ విక్టరీ
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రైజర్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. మనీశ్ పాండే (38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 51) అర్ధ సెంచరీ నమోదు చేయగా, డేవిడ్ వార్నర్ (30 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 36 ), వృద్ధిమాన్ సాహా (31 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ 30) మోస్తరుగా ఆడారు. కోల్‌కతా బౌలర్లలో కమిన్స్, వరున్, రస్సెల్ తలో వికెట్ తీశారు. అనంతరం కోల్‌కతా 18 ఓవర్లలో 3 వికెట్లకు 145 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' శుబ్‌మన్ గిల్ (62 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు 70 నాటౌట్), మోర్గాన్ (29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 నాటౌట్) కలిసి జట్టును గెలిపించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 70 బంతుల్లో 92 పరుగులు జోడించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, నటరాజన్, రషీద్ ఖాన్ చెరొక వికెట్ దక్కించుకున్నారు.
సీఎస్‌కే బ్యాట్స్‌మన్‌కు గ్లూకోజ్ ఎక్కించాలి.. వీరేంద్ర సెహ్వాగ్ సెటైర్స్!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications