అప్పులు తీర్చాలంటే ఆటంబాంబు అమ్ముకోవాలి: పాకిస్థాన్ మాజీ క్రికెటర్

కరాచీ: కరోనా వైరస్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ ప్రాణాంతక వైరస్‌ను అరికట్టేందుకు చాలా దేశాలు లాక్‌డౌన్ పాటించాయి. దీంతో సంపన్న దేశాలు సైతం గాడితప్పిన ఆర్థిక వ్యవస్థతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఓవైపు కరోనా మహమ్మారి.. మరో వైపు దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థతో ప్రపంచం పెనుసవాల్‌ను ఎదుర్కొంటుంది.

సాయం చేయండి..
దాయాదీ పాకిస్థాన్ పరిస్థితి కూడా ఇదే. ఇలానే కొనసాగితే ఆ దేశంలో కరోనా చావుల కన్నా ఆకలి చావులే ఎక్కువగా సంభవించేలా ఉన్నాయి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ దేశ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ సాయం కోరాడు. పాక్ పౌరులు, ఎన్నారైలు, దేశాన్ని దోచుకున్న దొంగలు ముందుకురావాలని పిలుపునిచ్చాడు. నెలనెలా 1 నుంచి 100 డాలర్లు తోచిన సాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. దీనికోసం ఇంటర్నేషనల్ అకౌంట్ కూడా తీసినట్లు ఓ వీడియోను ట్వీట్ చేశాడు.
ఆర్థికంగా చితికిపోయిన దేశాన్ని ఆదుకోకపోతే న్యూక్లియర్ హోదాను కూడా కోల్పోతామని, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) అప్పు తీర్చడానికి ఆటంబాంబును కూడా అమ్ముకోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. ఇప్పటికే దేశం పీకల్లోతు అప్పుల్లో ఉందని, మరింత అప్పుకోసం ఐఎంఎఫ్‌ను సంప్రదిస్తే ఆటంబాంబును ఇచ్చేయమంటారని తెలిపాడు.

ఐఎమ్‌ఎఫ్ అప్పు తీర్చడమే నా లక్ష్యం..
‘నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్‌లో ఖాతా తెరిచా. ఇది అంతర్జాతీయ అకౌంట్. ఆ ఖాతా నాపేరు మీదనే ఉంది. మరే వ్యక్తి కూడా దాన్ని ముట్టుకోలేడు. నా ముఖ్య ఉద్దేశం ఈ విరాళల ద్వారా వచ్చిన డబ్బుతో ఐఎమ్ఎఫ్ మనదేశానికి ఇచ్చిన అప్పును తీర్చడమే.
ఈ కఠిన పరిస్థితుల్లో దేశానికి అండగా ఉండాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాకిస్థానీయులను కోరుతున్నా. ఒక్కసారి మాత్రమే విరాళం ఇవ్వమనడం లేదు. నెల నెలా 1 నుంచి 100 డాలర్ల వరకు తోచిన సాయం చేయాలంటున్నా. ఇది దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది. మనం ఐక్యంగా నిలబడాల్సిన సమయం వచ్చింది.

ఆటంబాంబు ఇచ్చేయమంటారు..?
మన దగ్గర ఆటంబాంబు అనే ముఖ్యమైన సంపద ఉంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మనం ఐఎమ్‌ఎఫ్‌ను అప్పు అడిగితే.. న్యూక్లియర్ స్టేటస్‌ను వదులుకోవాలంటారు. ఆటంబాంబును ఇచ్చేయమంటారు. అలా చేస్తేనే మనకు అప్పుపుడుతుంది. లేకుంటే ఏ ఒక్కరు సాయం చేయరు.'అని మియాందాద్ ఆ దేశ పౌరులను హెచ్చరించాడు.

దోచుకున్న దొంగలు..
అలాగే దేశాన్ని దోచుకున్న వారిపై మియాందాద్ మండిపడ్డాడు. అనేక స్కాంలతో అవినీతికి పాల్పడి దేశ సంపదను దోచుకున్న దొంగలు క్లిష్ట స్థితిలో ఉన్న దేశాన్ని ఆదుకోవాలన్నాడు. ‘చాలా మంది దేశ సంపదను దోచుకున్నారు. వాళ్లు ఆ సొమ్మును ఇప్పుడు ఇచ్చేయాల్సిందే. నేను వారిని కూడా నా ఈ ప్రణాళికలో పాలుపంచుకోమని కోరుతున్నా. దోచుకున్న సంపదను తిరిగిచ్చేయాలని చేతులు చాచి అడుగుతున్నా. విదేశాల్లో నివసించే పాక్ పౌరులు సైతం సాయం చేయాలని కోరుతున్నా. నా కోసం నేను చేతులు చాచి అడుక్కోవడం లేదు. దేశం కోసం ఇదంతా చేస్తున్నా. దీన్ని ఓ చారిటీలా పరిగణించండి' అని మియాందాద్ విజ్ఞప్తి చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
ఈ సారి రాములో రాములాతో దుమ్ములేపిన వార్నర్!