ఐసీసీ ఆల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో సౌతాఫ్రికా దిగ్గజం

దుబాయ్: సౌతాఫ్రికా దిగ్గజ ఆల్‌రౌండర్ జాక్వస్ కల్లీస్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) హాల్ ఆఫ్ ఫేమ్-2020లో ఈ దిగ్గజ ఆటగాడికి చోటు దక్కింది. అతనితో పాటు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జహీర్ అబ్బాస్, ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ లిసా స్టాలేకర్ ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. కరోనా నేపథ్యంలో ఆదివారం వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో ఈ ముగ్గురు ఆటగాళ్లకు ఈ అరుదైన జాబితాలో అవకాశం కల్పిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఈ వర్చువల్ మీటింగ్‌కు మాజీ క్రికెటర్లు షాన్ పొలాక్, సునీల్ గవాస్కర్, వసీం అక్రమ్‌లతో పాటు ఇతర ఆటగాళ్లు హాజరయ్యారు.

10వేలకు పైగా రన్స్..
టెస్టులు, వన్డేల్లో 10,000 పైగా పరుగులు, 250కు పైగా వికెట్లు తీసిన జాక్వస్ కల్లీస్.. సంప్రదాయక ఫార్మాట్‌లో రికార్డు స్థాయిలో 23 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. సౌతాఫ్రికా తరఫున టెస్టులు, వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. 166 టెస్ట్‌ల్లో 13,289 రన్స్ చేసిన ఈ దిగ్గజ ప్లేయర్.. 292 వికెట్లు తీశాడు. 328 వన్డేల్లో 11,579 పరుగులతో పాటు 273 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా 62 సెంచరీలు చేశాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా జట్టుకు సహాయక కోచ్ సేవలందిస్తున్నాడు.

గర్వంగా ఉంది..
ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కడంపై కల్లిస్ సంతోషం వ్యక్తం చేసాడు. ‘ఐసీసీ ఆల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కడం చాలా గౌరవంగా భావిస్తున్నా. నా కెరీర్ ప్రారంభంలో ఇలాంటి ఘనతలు అందుకుంటానని అస్సలు ఊహించలేదు. నేను కూడా పేరు ప్రఖ్యాతల కోసం ఏనాడు ఆడలేదు. కేవలం జట్టు విజయం కోసమే ఆడేవాడిని. కానీ ఆటగాళ్ల కష్టాన్ని గుర్తిస్తూ ఇలాంటి పురస్కారాలు అందించడం గొప్ప విషయం. ఈ ఘనతను అందుకొని దిగ్గజ ఆటగాళ్ల సరసన చేరడం గర్వంగా ఉంది'అని కల్లీస్ చెప్పుకొచ్చాడు.

ఆరో ఆటగాడు..
ఆసియా బ్రాడ్‌మన్‌గా గుర్తింపు పొందిన జహీర్ అబ్బాస్.. 78 టెస్ట్‌ల్లో 5062 రన్స్ చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోనైతే ఏకంగా 34,483 పరుగులు చేశాడు. ఈ ఘనత దక్కడంపై అబ్బాస్ ఆనందం వ్యక్తం చేశాడు. ‘ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ 2020 జాబితాలో చోటు దక్కడం చాలా గౌరవంగా భావిస్తున్నా. దిగ్గజాల సరసన చేరడం చాలా సంతోషంగా ఉంది'అని అబ్బాస్ తెలిపాడు. ఇక పాకిస్థాన్ తరఫున ఈ ఘనతను అందుకున్న ఆరో క్రికెటర్‌గా అబ్బాస్ నిలిచాడు. ఆసియాలో 100 ఫస్ట్ క్లాస్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు అబ్బాస్. ఇక వన్డేల్లో వరుసగా మూడు సెంచరీలు చేసిన ఘనత కూడా అతనిదే.

నాకు దక్కిన గొప్ప గౌరవం..
నాలుగు ప్రపంచకప్‌ల విజేత లిసా స్టాలేకర్.. ఆసీస్ తరఫున 125 వన్డేల్లో 2728 రన్స్‌తో పాటు 128 వికెట్లు తీసింది. 54 టీ20ల్లో 769 రన్స్‌తో 60 వికెట్లు పడగొట్టింది. 2013 ప్రపంచకప్ ఫైనల్లో ఆఖరి మ్యాచ్ ఆడింది. ఇక ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కడం తనకు దక్కిన గొప్ప గౌరవమని లిసా చెప్పుకొచ్చింది. ‘నాకు దక్కిన అత్యంత గొప్ప గౌరవం. అసలు ఇలాంటి జాబితాలో నాకు చోటు దక్కుతుందని కలలో కూడా ఊహించలేదు. ఆస్ట్రేలియా జట్టు తరఫున ఆడి ఈ గౌరవాన్ని అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. నా సక్సెస్‌లో భాగమైన సహచరులు ధన్యవాదాలు.'అని తెలిపింది.
హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 90 మంది ఆటగాళ్లు చోటు దక్కించుకోగా.. ఇందులో ఇంగ్లాండ్‌కి చెందిన ఆటగాళ్లే 28 మంది ఉండటం కొసమెరుపు. ఇక పాకిస్థాన్, భారత్ నుంచి ఆరుగురు ఆటగాళ్లున్నారు.
కోహ్లీ ఎవడైతే నాకేంటి.. ఎవడు నాపై ఆధిపత్యం చెలాయించవద్దు: విండీస్ పేసర్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications