
విమర్శలతో కొత్త రూల్
ఈ నిబంధనపై యావత్ క్రికెట్ ప్రపంచం భగ్గుమంది. ఇంగ్లండ్ తొండాట ఆడిందని మండిపడింది. న్యూజిలాండ్ విశ్వవిజేతని కొనియాడింది. ఈ బౌండరీల నిబంధనను మార్చాలనే డిమాండ్ వ్యక్తమైంది. దాంతో ఐసీసీ ఈ నిబంధనను మారుస్తూ ఫలితం తేలేవరకు మళ్లీ మళ్లీ సూపర్ ఓవర్ నిర్వహించాలనే రూల్ తీసుకొచ్చింది. ఆ ప్రకారమే నిన్నటి ఐపీఎల్ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ టై అయినా.. మరో సూపర్ ఓవర్ ఆడేలా చేసింది.

ముంబై గెలిచేది...
అయితే ఈ బౌండరీల నిబంధనను ఇక్కడ కూడా ఉపయోగిస్తే ముంబై ఇండియన్సే విజేతగా నిలిచేది. ఎందుకంటే రోహిత్ సేననే 15 ఫోర్లు, 9 సిక్స్‌లతో 24 బౌండరీలు కొట్టింది. కింగ్స్ పంజాబ్ మాత్రం 14 ఫోర్లు, 8 సిక్స్‌లతో 22 బౌండరీలకే పరిమితమైంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇరు జట్లు ఫస్ట్ సూపర్ ఓవర్‌లో బౌండరీ కొట్టలేకపోయాయి. ఒకవేళ కొట్టిఉంటే అవి కూడా కౌంట్‌లోకి వచ్చేవి. ఏదేమైనా సూపర్ ఓవర్ నిబంధన మార్చడం తమ జట్టు విజయానికి కలిసొచ్చిందని కింగ్స్ పంజాబ్ అభిమానులు సంతోషపడుతుంటే.. ముంబై ఇండియా ఫ్యాన్స్ మాత్రం నిట్టూరుస్తున్నారు.

హోరాహోరీ పోరు..
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 రన్స్ చేసింది. క్వింటన్ డికాక్(43 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53)హాఫ్ సెంచరీకి తోడు చివర్లో కీరన్ పొలార్డ్(12 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లతో 34 నాటౌట్), కౌల్టర్ నీల్ (12 బంతుల్లో 4 ఫోర్లతో 24 నాటౌట్) మెరుపులు మెరిపించారు. పంజాబ్ బౌలర్లలో షమీ, అర్ష్‌దీప్ సింగ్ రెండేసి వికెట్లు తీయగా.. క్రిస్ జోర్డాన్, రవి బిష్ణోయ్ చెరొక వికెట్ పడగొట్టారు. అనంతరం కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 176 పరుగులే చేసింది. కేఎల్ రాహుల్ (51 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 77) హాఫ్ సెంచరీతో రాణించాడు.

సండే స్పెషల్.. ట్రిపుల్ ధమాకా
ఇక సూపర్ ఓవర్‌లో బుమ్రా సూపర్ బౌలింగ్‌కు రాహుల్, పూరన్ చేతులెత్తేయడంతో పంజాబ్ 5 పరుగులే సింది. అనంతరం ముంబై కూడా షమీ అద్భుత యార్కర్లకు 5 పరుగులే చేసింది. విజయానందించడంలో రోహిత్, డికాక్ విఫలమయ్యారు. నిబంధనల ప్రకారం తొలి సూపర్ ఓవర్ ఆడిన బ్యాట్స్‌మన్, బౌలర్లకు మళ్లీ ఆడే అవకాశం లేకపోవడంతో పొలార్డ్, పాండ్యా సెకండ్ సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్‌కు దిగగా..పంజాబ్ తరఫున క్రిస్ జోర్డాన్ బంతిని అందుకున్నాడు.
రెండో సూపర్ ఓవర్‌లో అతను రెండు వైడ్లు, ఒక ఫోర్, మూడు సింగిల్స్, ఒక డబుల్‌తో కలిపి 11 పరుగులు వచ్చాయి. హర్దిక్ పాండ్యా రనౌట్ కాగా.. ఆఖరి బంతికి పొలార్డ్ భారీ షాట్ ఆడగా మయాంక్ అగర్వాల్ సూపర్ ఫీల్డింగ్‌తో నాలుగు పరుగులు సేవ్ చేశాడు. అనంతరం బౌల్ట్ బౌలింగ్‌లో గేల్ భారీ సిక్సర్ కొట్టగా.. మయాంక్ రెండు ఫోర్లు కొట్టి నాలుగు బంతుల్లోనే విజయాన్నందించారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఐపీఎల్ వీకెండ్ స్పెషల్ డబుల్ హెడర్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్ కూడా సూపర్ ఓవర్‌కు దారితీసింది. హైదరాబాద్ పై కోల్‌కతా సూపర్ ఓవర్‌లోనే విజయం అందుకుంది. దాంతో ఒకే రోజు మూడు సూపర్ ఓవర్లు జరగడంతో అభిమానులు ఉక్కిరి బిక్కిరయ్యారు.


Click it and Unblock the Notifications

SRH vs KKR: సన్‌రైజర్స్ హైదరాబాద్ కొంపముంచిన తప్పిదాలు!










