India vs England: ఒక్కో ప్లేస్‌కు ఇద్దరేసి ప్లేయర్లు.. టీ20 సిరీస్ ముందు మేనేజ్‌మెంట్‌కు తలనొప్పి!

అహ్మదాబాద్: ఇంగ్లండ్‌ను చిత్తు చేసి వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్‌తో పాటు నంబర్ వన్ ర్యాంక్ అందుకొని ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియా ఇప్పుడు అదే టీమ్‌తో టీ20 సిరీస్‌కు సిద్దమవుతోంది. టెస్టుల మాదిరిగానే ఈ టీ20 వార్‌లో కోహ్లీసేన ముందు రెండు లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి సిరీస్ అందుకోవడం.. రెండోది ఈ ఏడాది స్వదేశంలో జరిగే టీ20 వరల్డ్‌కప్‌నకు పక్కా టీమ్‌ను రెడీ చేసుకోవడం. టీ20 మెగా టోర్నీకి భారత్ ఈ సిరీస్‌తోనే సన్నాహకాలు ప్రారంభించనుంది. కానీ, ఈ సిరీస్‌లో ఫైనల్ ఎలెవన్ సెలెక్షన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఒక్కో ప్లేస్‌కు ఇద్దరేసి ప్లేయర్లు పోటీ పడుతున్నారు. ఇది మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది. తొలుత సెటిల్ కాంబినేషన్‌తో వెళ్లి సిరీస్ నెగ్గిన తర్వాత ప్రయోగాలు చేస్తారా? లేదా దూరదృష్టితో ఆలోచించి మొత్తం యంగ్‌స్టర్స్‌ను దించి వారి సత్తాను పరీక్షిస్తారా? అన్నది చూడాలి.

రాహుల్ X ధావన్..
టెస్టుల్లో అదరగొట్టడంతో రిషభ్ పంత్‌ను టీ20లోకి తీసుకున్నారు. దాంతో షార్ట్ ఫార్మాట్‌లో మొన్నటిదాకా ఫస్ట్ చాయిస్ కీపర్‌గా ఉన్న కేఎల్ రాహుల్ ఇప్పుడు కీపింగ్ బాధ్యతలు పంత్‌కే అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైట్‌బాల్ ఫార్మాట్‌లో శిఖర్ ధావన్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా కుదురుకున్నప్పటికీ షార్ట్ ఫార్మాట్‌లో స్పెషలిస్ట్‌గా రాహుల్ మంచి పేరు తెచ్చుకోవడంతో ఓపెనింగ్ స్లాట్ రేసు రసవత్తరంగా మారింది. ఓ ఓపెనర్‌గా రోహిత్ ఉండడం పక్కా. దాని గురించి చర్చే అనవసరం. కానీ, ఇంకో స్లాట్ కోసం ధావన్‌కు రాహుల్‌కు మధ్య గట్టి పోటీ నెలకొంది. ధావన్ ఆట మిడిలార్డర్‌కు సూట్ కాదు కాబట్టి లోకేశ్‌ను మిడిలార్డర్‌కు పంపిస్తారా? అన్నది తేల్చుకోవాల్సి ఉంది.

మిడిలార్డర్‌లోనూ పోటీ..
ఓపెనింగ్ కాంబినేషన్‌పై స్పష్టత వస్తే నాలుగో నంబర్‌పై చర్చ మొదలవుతుంది. కెప్టెన్ కోహ్లీ మూడో నంబర్‌లో దిగుతాడు. ఇద్దరు గేమ్ చేంజర్స్ అయిన కీపర్ పంత్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా లను ఐదు, ఆరో నంబర్‌లో ఆడిస్తే రాహుల్‌కు నాలుగో నంబర్‌లో మాత్రమే అవకాశం ఉంటుంది. కానీ, ఆ ప్లేస్ కోసం ఇప్పటికే శ్రేయస్ అయ్యర్, కొత్తగా టీమ్‌లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ మధ్య గట్టి పోటీ ఉంది. కానీ కర్నాటక బ్యాట్స్‌మన్‌కే అవకాశం దక్కవచ్చు. ఎందుకంటే ముంబై ప్లేయర్లు అయ్యర్, సూర్య కంటే లోకేశ్ మంచి స్ట్రోక్స్ ఆడగలడు. కాబట్టి ధావన్‌ను ఓపెనర్‌గానే కంటిన్యూ చేస్తే.. అయ్యర్, సూర్యను కాదని రాహుల్‌ను నాలుగో నెంబర్‌లో పంపించవచ్చు.

భువీకి అంత ఈజీ కాదు
నాలుగో నంబర్ మాదిరిగానే బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో భువనేశ్వర్, దీపక్ చహర్, శార్దూల్ ఠాకూర్ మధ్య పోటీ ఏర్పడింది. ఒకప్పుడు వైట్‌బాల్‌లో భారత బెస్ట్‌పేసర్‌గా పేరు తెచ్చుకున్న భువీ గాయాల కారణంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. గత ఐపీఎల్‌లో గాయపడిన భువీ కోలుకున్నాడు. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ టీమ్‌లోకి వచ్చాడు. అయితే, తుదిజట్టులో అతనికి చోటు అంత సులభంగా దక్కేలా లేదు. యంగ్ పేసర్లు దీపక్ చహర్, శార్దూల్ ఠాకూర్ నుంచి పోటీ ఎదుర్కోక తప్పడం లేదు. సెకండ్ పేసర్ కోసం యంగ్ సెన్సేషన్ తంగరసు నటరాజన్, నవదీప్ సైనీ పోటీ పడుతున్నారు. వైవిధ్యమైన యార్కర్స్‌తో బ్యాట్స్‌మెన్‌కు సవాల్ విసిరే సత్తా ఉన్న నట్టూనే ఫేవరెట్‌గా కనిపిస్తున్నాడు. స్టార్టింగ్ మ్యాచ్‌లో సైనీ కంటే నట్టూ వైపే మేనేజ్‌మెంట్ మొగ్గు చూపొచ్చు.

ఎవరైనా గాయపడితేనే..
స్పిన్‌కు అనుకూలించే మొతెరా ట్రాక్‌పై ముగ్గురు స్పిన్నర్లుగా యజ్వేంద్ర చహల్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ తుది జట్టులో ఉండడం ఖాయమే. టీ20 టీమ్ నుంచి తొలిసారి పిలుపు అందుకున్న ఇషాన్ కిషన్, రాహుల్ తెవాటియా ప్రస్తుతానికి ఫైనల్ ఎలెవన్‌లో ఎక్కడా ఫిట్ అయ్యే సూచనలు కనిపించడం లేదు. ఎవరైనా గాయపడితేనో, ఎవరికైనా రెస్ట్ ఇస్తేనో తప్ప తుది జట్టులో ఈ ఇద్దరికీ అవకాశం రావడం కష్టం. ఇక, ముగ్గురు సీనియర్, టాలెంటెడ్ ప్లేయర్లు ఈ సిరీస్‌లో లేరు. మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా గాయాల నుంచి కోలుకుంటుండగా, జస్‌ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చారు. ఈ ముగ్గురూ తిరిగొస్తే ఫైనల్ ఎలెవన్ ఎంపిక మేనేజ్‌మెంట్‌కు మరింత తలనొప్పి కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
రెండుగా విడిపోనున్న టీమిండియా.!