
ఇంతకేం జరిగిందంటే..
టీమిండియా ఇన్నింగ్స్ సందర్భంగా.. నాలుగో ఓవర్లో ఓపెనర్ శిఖర్ ధావన్ ఆడిన షాట్‌ను ఆపబోయిన డేవిడ్ వార్నర్ కింద పడిపోయాడు. ఈ క్రమంలో తొడ కండరాలు పట్టేయడంతో కుప్పకూలాడు. తీవ్ర నొప్పితో విలవిలలాడిన ఈ ఆసీస్ ఓపెనర్.. తిరిగి పైకి లేవడానికి ఇబ్బంది పడ్డాడు. చివరకు ఫిజియో, గ్లేన్ మ్యాక్స్‌వెల్ సాయంతో కుంటుతూ మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత ఎక్స్‌రే తీయించడం కోసం వార్నర్‌ను కార్‌లో స్టేడియం నుంచి హాస్పిటల్‌కు తీసుకొని వెళ్లారు. వాహనం ఎక్కడానికి వెళ్తున్నప్పుడు కూడా వార్నర్ కుంటుతూనే నడిచాడు.

గజ్జలో గాయం..
ఇక డేవిడ్ వార్నర్‌కు గజ్జ గాయం(గ్రోయిన్ ఇంజ్యూరీ) అయిందని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక ప్రతినిధి మీడియాకు తెలిపారు. అతనికి అన్నీ పరీక్షలు చేయించామన్నారు. స్కానింగ్ రిపోర్ట్స్‌లో సానుకూలంగా వస్తుందని ఆశిస్తున్నామని తెలిపాడు. ఇక గ్రోయిన్ స్ట్రెయిన్ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని కామెంటేటర్ గిల్‌క్రిస్ట్ వ్యాఖ్యానించాడు. కనీసం 6 వారాల సమయం పడుతుందన్నాడు. దాంతో వార్నర్ టీ20 సిరీస్‌తో పాటు టెస్టు సిరీస్‌కు కూడా దూరమయ్యే అవకాశం ఉంది.

ఆసీస్‌కు కష్టమే..
వన్డే సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉండగా.. మూడు టీ20ల సిరీస్, నాలుగు టెస్టుల సిరీస్‌కు కొద్ది రోజుల ముందు వార్నర్ గాయపడటం ఆస్ట్రేలియాకు పెద్ద దెబ్బగానే భావించొచ్చు. తొలి వన్డేలో హాఫ్ సెంచరీ చేసిన వార్నర్.. రెండో వన్డేలో 83 పరుగులు చేశాడు. ఫించ్‌తో కలిసి రెండు మ్యాచ్‌ల్లోనూ తొలి వికెట్‌కు వరుసగా 156, 142 చొప్పున భాగస్వామ్యాలు నెలకొల్పాడు. వన్డే, టీ20ల్లో ప్రత్యామ్నయ ఓపెనర్లు ఉన్నా టెస్ట్‌ల్లో లేరు. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో మరో ఆటగాడిని జట్టుతో చేర్చడం ఆసీస్‌కు తలనొప్పి వ్యవహారం. టెస్ట్ సిరీస్‌లో ఆసీస్ ఆధిపత్యం చెలాయించాలంటే వార్నర్ ఉండాల్సిందే. డిసెంబర్ 27 నుంచి ఫస్ట్ టెస్ట్ మొదలుకానుంది. మార్కస్ స్టోయినిస్ కూడా గాయంతో జట్టులో చోటు కోల్పోయిన విషయం తెలిసిందే.

సూపర్ విక్టరీ..
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 389 రన్స్ చేసింది. స్టీవ్ స్మిత్ (104; 64 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సులు) మరోసారి మెరుపు సెంచరీతో రాణించగా.. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (83; 77 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులు), ఆరోన్ ఫించ్ (60; 69 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. చివర్లో మార్నస్ లబుషేన్ (70; 61 బంతుల్లో 5 ఫోర్లు) , గ్లెన్ మ్యాక్స్‌వెల్ (63; 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులు) పరుగుల విధ్వంసం సృష్టించారు. ఆసీస్ బ్యాట్స్‌మెన్ ధాటికి భారత బౌలర్లు మరోసారి భారీగా పరుగులు సమర్పించుకున్నారు. జస్‌ప్రీత్ బుమ్రా (1/79), షమీ (1/73), చహల్ (0/71), సైనీ (0/70), జడేజా(0/60) దారుణంగా విఫలమయ్యారు. పాండ్యా(1/24) ఒక్కడే ఫర్వాలేదనిపించాడు. అనంతరం భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 338 పరుగులకే పరిమితమైంది. విరాట్ కోహ్లీ(89), కేఎల్ రాహుల్(76) పోరాడినా ఫలితం లేకపోయింది.
India vs Australia, 2nd ODI మ్యాచ్ టర్నింగ్ పాయింటే అదే.. కొంపముంచిన కోహ్లీ నిర్ణయాలు!


Click it and Unblock the Notifications
