అసలు వాళ్లు మన రేంజా అస్సలు కాదు.. ఇకనైనా పోలికలు ఆపేయండి సామీ!
IND vs PAK: దాయాదులైన భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అనగానే ఎప్పుడూ తీవ్ర ఉత్కంఠ, ఉద్వేగాలు నిండి ఉంటాయి. కానీ స్టేడియంలో ఆట తీరును బట్టి చూస్తే రెండు జట్ల మధ్య అసలు పోలికే లేదని మరోసారి నిరూపితమైంది. 2026 ఆసియా క్రీడల పురుషుల క్రికెట్ ఫైనల్లో పాకిస్తాన్‌ను 19 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత జట్టు చారిత్రాత్మక స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ అద్భుత విజయంపై 1983 ప్రపంచ కప్ విజేత, మాజీ దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందిస్తూ.. టీమిండియాపై ప్రశంసల జల్లు కురిపించారు. భారత్ ఎల్లప్పుడూ పాకిస్తాన్ కంటే ఎంతో మెరుగైన జట్టు అని, రెండు జట్ల మధ్య అసలు పోలికే లేదని ఆయన ఘాటుగా స్పష్టం చేశారు.
ఆసియా క్రీడల క్రికెట్లో భారత్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు శ్రీలంకను 147 పరుగుల భారీ తేడాతో ఓడించి తొలి స్వర్ణాన్ని అందించగా.. ఇప్పుడు పురుషుల జట్టు కూడా గోల్డ్ మెడల్ సాధించి డబుల్ గోల్డ్ రికార్డును నమోదు చేసింది. ఈ రెండు పతకాలతో కలిపి 2026 ఆసియా క్రీడల్లో భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 81కి చేరింది. ఇందులో 19 స్వర్ణాలు, 26 రజతాలు, 36 కాంస్య పతకాలు ఉండటం విశేషం.

ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు విస్పోటక ఆరంభాన్ని ఇచ్చారు. పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. టీ20లలో పాకిస్తాన్ జట్టుపై భారత్‌కు ఇదే అత్యధిక పవర్‌ప్లే స్కోరు కావడం గమనార్హం. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని.. మొత్తంగా 28 బంతుల్లో 7 సిక్సర్లతో 61 పరుగులు చేసి పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత తిలక్ వర్మ కూడా అదే ఊపును కొనసాగిస్తూ 21 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. 22 బంతుల్లో 4 సిక్సర్లతో 51 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా.. శివమ్ దూబే(27) కీలక రన్స్ జోడించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 211 పరుగుల భారీ స్కోరు సాధించింది.
212 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌కు భారత్ స్పిన్నర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఆరంభంలోనే గట్టి షాకిచ్చారు. కేవలం 39 పరుగులకే 3 కీలక వికెట్లు తీసి పాక్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారు. అయితే మిడిలార్డర్‌లో హసన్ నవాజ్ అద్భుతం పోరాటం చేసి మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లాడు. హసన్ నవాజ్ 51 బంతుల్లో 7 సిక్సర్లతో 96 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసినప్పటికీ.. భారత బౌలర్లు కట్టడి చేశారు.
ఆఖరి ఓవర్లలో వాషింగ్టన్ సుందర్(2/29), అక్షర్ పటేల్(2/25), శివమ్ దూబే(2/33) కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ తో బౌలింగ్ చేయడంతో పాకిస్తాన్ 20 ఓవర్లలో192/6 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 19 పరుగుల తేడాతో విజయం సాధించి బంగారు పతకాన్ని ముద్దాడింది. టీమిండియా ప్రదర్శనపై పూర్తి నమ్మకం ఉందని, ఆటగాళ్లు క్రమశిక్షణతో ఆడి దేశానికి గర్వకారణంగా నిలిచారని కపిల్ దేవ్ కొనియాడారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


