భారత్ దెబ్బకు వెనక్కి తగ్గిన ఐసీసీ.. ఛాంపియన్స్ లీగ్ రీఎంట్రీ లేనట్టే!
ఛాంపియన్స్ లీగ్ తరహా గ్లోబల్ ఫ్రాంచైజీ టీ20 టోర్నీ ప్రణాళికలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఆలోచనను క్రికెట్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన బిగ్ 3 దేశాలైన భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులు తీవ్రంగా వ్యతిరేకించాయి. ద్వైపాక్షిక సిరీస్‌లు, ఐపీఎల్, బిగ్ బాష్ వంటి సొంత ఫ్రాంచైజీ షెడ్యూల్స్ మధ్య ఈ గ్లోబల్ ఫ్రాంచైజీని నిర్వహించడం అసాధ్యమని ఈ మూడు బోర్డులు తెగేసి చెప్పాయి.
ఇప్పటికే కిక్కిరిసిన షెడ్యూల్‌తో ఆటగాళ్లకు తగిన విశ్రాంతి లేకుండా పోతుందని, అదనపు టోర్నీలకు క్యాలెండర్‌లో ఏమాత్రం చోటు ఇవ్వలేమని బీసీసీఐతో సహా ఈసీబీ, క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేశాయి. దాంతో ఐసీసీ తమ నిర్ణయాన్ని మార్చుకుంది. 2031 వరకు ఎలాంటి గ్లోబల్ ఫ్రాంచైజీ టోర్నీలను నిర్వహించోమని స్పష్టం చేసినట్లు బ్రిటీష్ దినపత్రిక ది గార్డియన్ వెల్లడించింది.

ఐసీసీకి ఆదాయం లేదు..
ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్ ద్వారా ఆయా క్రికెట్ బోర్డులు వందల కోట్ల డాలర్ల ఆదాయం ఆర్జిస్తున్నప్పటికీ ఐసీసీకి ఒక్క రూపాయి దక్కడం లేదు. కొత్త మీడియా హక్కుల విషయంలోనూ ఐసీసీ ఆదాయం భారీగా తగ్గే ప్రమాదం ఉంది. ఈ క్రమంలోనే ఫుట్‌బాల్ క్లబ్ వరల్డ్ కప్ తరహాలో ఆదాయ వనరును సృష్టించుకోవాలని ఐసీసీ భావించింది. ద్వైపాక్షిక సిరీస్‌ల మధ్యలో నాలుగు దేశాల టీ20 టోర్నీలు నిర్వహించాలని కూడా నిర్ణయించింది.
కానీ ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న బీసీసీఐ.. క్రికెట్ ఆస్ట్రేలియా, ఈసీబీ బోర్డులు ఈ నిర్ణయాలను వ్యతిరేకించాయి. ఐసీసీ ఒకవేళ కొత్త టోర్నీ తీసుకురావాలనుకుంటే ప్రస్తుతం ఉన్న వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రధాన ఈవెంట్లను కుదించాలని షరతు పెట్టాయి. దాంతో ఐసీసీ తమ ప్రతిపాదనలను పూర్తిగా ఉపసంహరించుకుంది.
దాంతో ముందస్తు ప్రణాళికల ప్రకారమే 2027 నుంచి 2031 వరకు షెడ్యూల్ కొనసాగనుంది. ఇందులో కేవలం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పరిధిని కాస్త విస్తరించడం మినహా కొత్త టోర్నీలకు అవకాశం లేదు. ఐసీసీని బిగ్ 3 క్రికెట్ నేషన్స్ శాసిస్తున్నాయనే విషయం స్పష్టమవుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


