పశ్చాత్తాపపడేది ఏదైనా ఉందంటే.. గంగూలీ రిటైర్మెంట్ తర్వాత అవకాశం రావడమే: యువరాజ్ సింగ్

న్యూఢిల్లీ: తన 17 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో పశ్చాత్తాపపడేది ఏదైనా ఉందంటే టెస్ట్ క్రికెట్ ఎక్కువగా ఆడకపోవడమేనని భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తెలిపాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో తనకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదని ఈ సిక్సర్ల సింగ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుత పరిస్థితులతో పోలిస్తే సచిన్, సౌరవ్,లక్ష్మణ్, ద్రవిడ్‌లతో కూడిన నాటి జట్టులో చాన్స్ రావడం కష్టంగా ఉండేదన్నాడు. అయితే దాదా రిటైర్మెంట్ తర్వాత తనకు అవకాశం వచ్చిందని కానీ అప్పటికే క్యాన్సర్ బారిన పడిన తాను ఆ చాన్స్‌ను అందుకోలేకపోయానన్నాడు.

ప్రతీది అనుభవమే..
తాజాగా టైమ్స్ నౌకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘జీవితంలో మంచి, చెడులన్నీ అనుభవాలే. ఇవన్నీ ఎదుగుదలలో ఓ భాగం మాత్రమే. నా కెరీర్ ప్రారంభ రోజుల నుంచి 2011 ప్రపంచకప్ విజయం, క్యాన్సర్‌తో పోరాటం, మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టడం వరకు ఎన్నో మైళురాళ్లు అందుకున్నా. మరెన్నో సవాళ్లు ఎదుర్కొన్నా. ఈ అనుభవాలే నన్ను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టాయి. నా కుటుంబ సభ్యులు, సహచర ఆటగాళ్లు, అభిమానులు నా ప్రతి అడుగులో నన్ను వెన్నంటి ప్రోత్సహించారు. వారందరికి నా కృతజ్ఞతలు.

టెస్ట్ క్రికెట్ ఆడాల్సింది..
నా సుదీర్ఘ కెరీర్‌లో పశ్చాతాపపడేది ఏదైనా ఉందా అంటే టెస్ట్ క్రికెట్ ఎక్కువగా ఆడకపోవడమే. సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, సెహ్వాగ్, గంగూలీ వంటి దిగ్గజాలతో నిండిపోయిన జట్టులో అవకాశం రావడం చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడైతే ఒక్కో ఆటగాడికి పది వరకు అవకాశాలు దక్కుతున్నాయి. కానీ మా రోజుల్లో ఒకటి, రెండు చాన్స్‌లు రావడమే మహా ఎక్కువ. గంగూలీ రిటైర్మెంట్ తర్వాత నాకు అవకాశం వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు నేను క్యాన్సర్ బారిన పడి చికిత్స తీసుకోవడంతో నా జీవితం మొత్తం మలుపు తిరిగింది. ఇది మినహా నా క్రికెట్ జర్నీ పట్ల సంతోషంగా ఫీలవుతా.. నా దేశం తరఫున నేను చేసిన పరుగులకు గర్వపడుతా'అని యువరాజ్ చెప్పుకొచ్చాడు.

ధోనీ నా భవిష్యత్తును కళ్లకు కట్టాడు:
అంతకుముందు న్యూస్ 18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువీ మాట్లాడుతూ... మహమ్మారి క్యాన్సర్‌ను జయించి తిరిగి జట్టులోకి వచ్చిన తర్వాత తన క్రికెట్ భవిష్యత్ ఏమిటో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కళ్లకు కట్టినట్లు చూపించాడన్నాడు. 'నేను తిరిగి జట్టులోకి వచ్చినపుడు విరాట్ కోహ్లీ నాకు ఎంతో మద్దతుగా నిలిచాడు. కానీ ఎంఎస్ ధోనీ నా నిజమైన భవిష్యత్‌ను చూపించాడు. 2019 ప్రపంచకప్ జట్టు ఎంపికలో సెలక్టర్లు నన్ను పరిగణలోకి తీసుకోరని చెప్పాడు. 2011 ప్రపంచకప్ వరకూ నాపై ధోనీకి చాలా విశ్వాసం ఉండేది. నేనే తన ప్రధాన ఆటగాడినని చెబుతుండేవాడు. కానీ క్యాన్సర్ తర్వాత తిరిగి జట్టులోకి వచ్చినపుడు మొత్తం మారిపోయింది' అని తెలిపాడు.

హాఠాత్తుగా రిటైర్మెంట్:
గతేడాది వన్డే ప్రపంచకప్‌లో చోటు దక్కకపోవడంతో యువీ.. ఆ టోర్నీ జరుగుతుండగానే రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్ తరఫున మొత్తం 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలతో 1900 పరుగులు చేసిన ఈ సిక్సర్ల సింగ్.. 304 వన్డే మ్యాచ్‌ల్లో 8701 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 58 టీ20 మ్యాచ్‌లు ఆడిన యువీ.. 1177 పరుగులు చేశాడు. 8 ఆఫ్ సెంచరీలు నమోదు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
IPL 2020: క్యా‘కరోనా'.. ఒక్కో ఫ్రాంచైజీకి 80 కోట్ల నష్టం!