
ముంబై: టీమిండియా హెడ్ కోచ్ అభ్యర్థుల ఇంటర్వ్యూలు ఈ నెల రెండో వారంలో నిర్వహించబడతాయి. టామ్ మూడీ, గ్యారీ కిర్‌స్టన్ లాంటి హేమాహేమీలు బరిలో ఉన్నా.. ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి తన పదవిని తిరిగి పొందనున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా రవిశాస్త్రికి అనుకూలంగా ఉండడంతో క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) కెప్టెన్ కోరికకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. కెప్టెన్, కోచ్ మధ్య మంచి అవగాహన విజయానికి బాటలు వేస్తుందని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, ఎంసీసీ ప్రపంచ క్రికెట్ కమిటీ ఛైర్మన్ మైక్ గట్టింగ్ పేర్కొన్నాడు.
విండీస్‌తో తొలి వన్డే.. మైదానంలోనే కోహ్లీ స్టెప్పులు (వీడియో)
ముంబైలో గురువారం జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మైక్ గట్టింగ్ మీడియాతో మాట్లాడుతూ... 'ఎప్పుడూ కెప్టెన్, కోచ్ మధ్య మంచి అవగాహన ఉండాలి. కెప్టెన్, కోచ్ చాలా కాలం కలిసి పనిచేయాలని కోరుకుంటా. మిక్కీ స్టీవర్ట్‌తో నా ప్రయాణ అనుభవంతో చెపుతున్నా.. మిక్కీ ఇంగ్లాండ్ మేనేజర్‌గా మొదటిసారి వచ్చినప్పుడు అతనితో బాగా ఉన్నాం. అప్పుడు ఎవరైనా నాకు వేరే విషయం చెప్పాలని కోరుకున్నా. కొన్ని సార్లు కోచ్ నాణెం యొక్క అవతలి వైపును కూడా చూడాలి. కోచ్ ఇలా ఆలోచించినంతకాలం కెప్టెన్ విజయవంతమవుతాడు. కెప్టెన్‌తో ఎప్పుడూ అంగీకరించని కోచ్ అవసరం' అని గట్టింగ్ పేర్కొన్నాడు.
నిషేధిత జింబాబ్వే అభ్యర్థనను అంగీకరించిన బంగ్లా.. ట్రై-సిరీస్‌కు ఆతిథ్యం
'ప్రస్తుత తరంలో విరాట్ కోహ్లీయే అత్యుత్తమ బ్యాట్స్‌మన్, అందులో ఎలాంటి సందేహం లేదు. కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్‌లు కూడా ఇటీవల అద్భుతంగా ఆడుతున్నారు. మూడు ఫార్మాట్లలో నిలకడగా ఆడటం కోహ్లీ ఒక్కడికే సాధ్యం. అందుకే కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా నిలుస్తున్నాడు. మూడు ఫార్మాట్లలో కోహ్లీ తప్ప మరే ఇతర ఆటగాడు రాణించలేదు. యాషెస్ సిరీస్ తొలి టెస్టులో స్మిత్ బాగా ఆడాడు. తర్వాతి మ్యాచ్‌ల్లో స్మిత్‌ను ఔట్ చేయడమే ఇంగ్లాండ్ జట్టుకు సవాల్‌గా మారనుంది' గట్టింగ్ తెలిపాడు.