
వర్షం ఆటంకం:
గురువారం ప్రావిడెన్స్ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దైంది. ఉదయం నుంచి వర్షం కురుస్తుండటంతో దాదాపు టాస్ గంటన్నర ఆలస్యమైంది. దీంతో మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించారు. వెస్టిండీస్ ఇన్నింగ్స్ 5.4 ఓవర్ల పాటు సాగిన అనంతరం మరోమారు వరణుడు పలకరించడంతో ఇన్నింగ్స్ సాగటం కష్టంగా మారింది. దాదాపు గంటసేపు మ్యాచ్ ఆగిపోయింది. దీంతో మ్యాచ్‌ను 34 ఓవర్లకు కుదించారు. విండీస్ 13 ఓవర్లకు వికెట్ నష్టానికి 54 పరుగులు చేసిన సమయంలో మరోసారి వర్షం పలకరించింది. సమయం వృథా కావడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు.
డీజే పాటలకు స్టెప్పులు:
ఓ వైపు మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగిస్తుంటే.. మైదానంలో కోహ్లీ మాత్రం అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేశాడు. విరామం అనంతరం మైదానంలోకి వచ్చిన కోహ్లీ డీజే పాటలకు స్టెప్పులు వేసాడు. డీజేకు అనుగుణంగా సహచర ఆటగాళ్లతో డాన్స్ చేసాడు. క్రిస్ గేల్ కూడా తనదైన శైలిలో కోహ్లీతో కలిసి డాన్స్ చేసాడు. అనంతరం మైదాన సిబ్బందితో సైతం సరదాగా గడిపాడు. కోహ్లీ స్టెప్పులు వేయడంతో మైదానంలోని అభిమానులు ఆనందించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్ అయింది. కోహ్లీ అభిమానులు ఈ వీడియోను తెగ లైక్ చేస్తున్నారు.

చిరాకు తెప్పిస్తుంది:
మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ... 'మ్యాచ్ జరుగుతున్నప్పుడు మాటిమాటికి వర్షం అంతరాయం కలిగించడం చిరాకు తెప్పిస్తుంది. ఆట జరిగేటప్పుడు పూర్తిగా వర్షమైనా పడాలి లేదా పూర్తి ఆటైనా కొనసాగాలి. ఇలా దోబూచులాడితే ఇబ్బందిగా ఉంటుంది. కరీబియన్ దీవుల్లో కొన్ని స్టేడియాలు ఆటగాళ్లను పరీక్షిస్తాయి. మరికొన్ని స్టేడియాలు పేస్, బౌన్సింగ్‌కు అనుకూలిస్తాయి. పరిస్థితులను అర్థం చేసుకొని ఆడిన జట్టే విజయాలు సాధిస్తుంది' అని కోహ్లీ అన్నాడు.
మరో 8 పరుగులు చేస్తే:
బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై భారత పేసర్లు సత్తా చాటడంతో క్రిస్ గేల్ తడబడ్డాడు. గేల్ (4; 34బంతుల్లో) తడబడుతూ చివరకు కుల్దీప్ వేసిన 11వ ఓవర్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 4 పరుగులకే గేల్ వెనుతిరగడంతో విండీస్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్రియాన్ లారా (10,405) రికార్డును చేరుకోలేకపోయాడు. ఈ రికార్డును బద్దలు కొట్టాలంటే గేల్ మరో 8 పరుగులు చేయాలి. భారత్, విండీస్ జట్ల మధ్య ఆదివారం రెండో వన్డే జరగనుంది.


Click it and Unblock the Notifications
