ఆ ఒక్క కారణంతోనే ఆస్ట్రేలియా టూర్‌కు రోహిత్ శర్మను ఎంపిక చేయలేదు: బీసీసీఐ

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయకపోవడంపై తీవ్ర దుమారం రేగుతుంది. కరోనా బ్రేక్ తర్వాత టీమిండియా ఆడే తొలి అంతర్జాతీయ సిరీస్ అయిన ఈ ఆసీస్ టూర్‌కు బీసీసీఐ సోమవారం జట్లను ప్రకటించిన విషయం తెలిసిందే. రెండు నెలలకు పైగా సాగే ఈ టూర్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. సునీల్ జోషీ ఆధ్వర్యంలోని కొత్త సెలెక్షన్ కమిటీ వర్చువల్‌గా సమావేశమై.. ఈ సిరీస్‌ల కోసం వేర్వేరుగా జట్లను ఎంపిక చేసింది. అయితే తొడ కండరాల సమస్యతో బాధపడుతున్న రోహిత్ శర్మను ఒక్క ఫార్మాట్‌కు కూడా ఎంపిక చేయకపోవడం అందరిని షాక్‌కు గురిచేసింది.

గాయంపై క్లారిటీ ఇవ్వకుండా..
అయితే రోహిత్ గాయం తీవ్రత గురించి తెలియజేయకుండా మూడు ఫార్మాట్లకు పక్కనపెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇదేదో కుట్ర అనే చర్చ ఊపందుకుంది. గాయపడ్డ మయాంక్ అగర్వాల్, నవ్‌దీప్ సైనీలకు అవకాశం కల్పించి రోహిత్ పక్కన పెట్టడంపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. దీనికి తోడు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తమ కెప్టెన్ గాయం నుంచి కోలుకుంటున్నాడని, నెట్స్‌లో ప్రాక్టీస్ కూడా చేశాడని ఓ వీడియోను షేర్ చేసింది. దాంతో అభిమానులు, మాజీ క్రికెటర్లు బీసీసీఐ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తొడ కండరాల గాయంతో ఉన్న ఆటగాడు నెట్స్‌లో ప్రాక్టీస్ ఎలా చేయగలడని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశ్నించడంతో ఈ వ్యవహారంపై తీవ్ర దుమారం రేగింది.

ఫిజియో రిపోర్ట్ కారణంగానే..
దాంతో బీసీసీఐ దిద్దుబాటు చర్యలకు దిగింది. టీమిండియా ఫిజియోథెరపిస్ట్ నితిన్ పటేల్ ఇచ్చిన రిపోర్ట్ కారణంగానే భారత సెలక్టర్లు రోహిత్ ఎంపిక చేయలేదని బీసీసీఐకి చెందిన ఓ అధికారి స్పష్టం చేశారు. టీమ్‌ని ఎంపిక చేసే ముందు ఆటగాళ్ల ఫిట్‌నెస్ రిపోర్ట్‌లను ఇవ్వాల్సిందిగా భారత సెలెక్షన్ కమిటీ.. నితిన్ పటేల్‌ను ఆదేశించిందని, అతను రోహిత్ శర్మ ఫిట్‌నెస్ రిపోర్ట్‌లో కనీసం 2-3 వారాల విశ్రాంతి అవసరమని పేర్కొన్నాడని తెలిపారు. దాంతోనే రోహిత్ శర్మ పేరుని సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదని చెప్పుకొచ్చారు.

వైద్యులు కూడా..
‘నితిన్ పటేల్ టీమిండియా ఆటగాళ్ల ఫిట్‌నెస్ గురించి సెలక్టర్లకి పూర్తి స్థాయి రిపోర్ట్ సమర్పించాడు. సాధారణంగా టీమ్ ఎంపికకు ముందు బీసీసీఐ, సెలక్టర్లకు ఫిజియో ఈ రిపోర్ట్ ఇస్తుంటాడు. తాజాగా రోహిత్ శర్మ గాయంపై ఇద్దరు డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికెట్‌ని ఫిజియో సమర్పించగా.. అందులో ఇద్దరూ వైద్యులు రోహిత్ శర్మకు 2-3 వారాలు విశ్రాంతి అవసరమని సూచించారు. దాంతో.. రోహిత్‌ను టీమ్‌లోకి సెలక్టర్లు ఎంపిక చేయలేదు'అని వెల్లడించారు.
#ThankYouMSDhoni: ఆస్ట్రేలియా పర్యటన వేళ.. ధోనీపై గౌరవాన్ని చాటుకున్న బీసీసీఐ!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications