"ఇప్పుడు నేను సంతోషంగా చనిపోగలను": జపాన్‌లో జెండా పాతిన భారత వీరనారి!
Asian Games 2026: అదే తన చివరి పోరాటమని భావిస్తూ ఆమె బరిలోకి దిగింది.. కానీ జపాన్‌లో చరిత్ర సృష్టించింది. 36 ఏళ్ల సుచిక తరియల్ ఆసియా క్రీడల్లో ఇండియాకు మొట్టమొదటి మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ పతకాన్ని గెలిపించినప్పుడు ఆమె కళ్లలో కేవలం విజయపు మెరుపు మాత్రమే కాకుండా ఆ క్రీడకు ఆమె అంకితం చేసిన సంవత్సరాల కథ కూడా నిండి ఉంది. హర్యానాలోని రోహ్‌తక్ జిల్లా కిలోయ్ గ్రామానికి చెందిన సుచిక, మహిళల సాంప్రదాయ 60 కేజీల ఎంఎంఏ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. సింగపూర్‌కు చెందిన హుయ్ హూన్ టియోతో జరిగిన సెమీఫైనల్ బౌట్ హోరాహోరీగా సాగింది. ఇరుపక్షాలు సమంగా నిలిచాయి. తక్కువ బరువున్న వారికి అనుకూలంగా నిర్ణయం రావడంతో సుచిక ఫైనల్‌కు చేరే అవకాశం కోల్పోయింది. కానీ ఆమెకు ఈ కాంస్యం బంగారంతో సమానం.పతకం గెలిచిన తర్వాత సుచికా మాట్లాడుతూ, "ఇది నా జీవితం కంటే ముఖ్యం. జపాన్‌కు వచ్చి నా దేశం కోసం పతకం గెలిచిన విషయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. ఇప్పుడు నేను సంతోషంగా చనిపోగలను" అని అన్నారు.
ఇది కేవలం భావోద్వేగంతో చెప్పిన మాట కాదు. సుచిక కెరీర్‌లో సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ పతకం లభించింది. "నేను రెండు రౌండ్లలోనూ గెలిచాను, మరి బరువును ఎందుకు ప్రాతిపదికగా తీసుకున్నారు?" అని సుచికా ప్రశ్నించారు. 2026 ఆసియా క్రీడల్లో 60 కేజీల మహిళల సాంప్రదాయ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ విభాగంలో కాంస్య పతకం గెలుచుకున్న భారత క్రీడాకారిణి సుచిక తరియల్ సెమీఫైనల్ నిర్ణయాన్ని ప్రశ్నించారు. సింగపూర్‌కు చెందిన హుయ్ హూన్ టియోతో జరిగిన బౌట్‌లో ఓడిపోయిన తర్వాత పతకం రంగును మార్చడానికి తాను శాయశక్తులా ప్రయత్నించానని, కానీ నిర్ణయం తనకు అనుకూలంగా రాలేదని సుచిక అన్నారు. "పతకం రంగును మార్చడానికి నేను నా వంతు ప్రయత్నం చేశాను, కానీ కొన్ని పరిస్థితుల వల్ల అలా చేయలేకపోయాను. బహుశా నేను విఫలమయ్యానో లేదా నిర్ణయం నాకు అనుకూలంగా లేదో. ఆ నిర్ణయంతో నేను ఏకీభవించను కూడా." అని సుచిక పేర్కొన్నారు.

పోటీని చూసిన చాలా మంది కూడా తన ప్రదర్శన బాగుందని చెప్పారని ఆమె అన్నారు. బరువు నియమం గురించి ప్రస్తావిస్తూ.. తనకు ఆ నియమాల గురించి తెలుసని, ఒకవేళ తాను అధిక బరువుతో ఉంటే పోటీ నుండి వైదొలగాల్సి ఉంటుందని (ఫోర్ఫిట్ రూల్) తెలుసని.. అయితే మొత్తం పోటీని కేవలం బరువు ఆధారంగా మాత్రమే అంచనా వేయకూడదని సుచిక అన్నారు. "మ్యాచ్ చూస్తే, నేనే గెలుస్తున్నాను. నేను ప్రత్యర్థిని కింద పడేస్తున్నాను. ఆమె నన్ను ఒక్కసారి కూడా కింద పడవేయలేదు. ఆమె కేవలం గాలిలో గుద్దుతూనే ఉంది." అని సుచిక తన ఆటగురించి చెప్పుకొచ్చారు. ఆ పోటీ కేవలం బరువు వ్యత్యాసానికే పరిమితం కాకూడదని ఆమె వాదించింది. ప్రదర్శన ఆధారంగా కాకుండా బరువు ఆధారంగానే ఆ పోటీని నిర్ణయించారని సుచిక పేర్కొంది.
సుచిక 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో జూడోలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఆమె కాంస్య పతకం కోసం జరిగిన పోరుకు చేరుకున్నప్పటికీ, పతకాన్ని కోల్పోయింది. ఆ తర్వాత ఆమె ఆసియా గేమ్స్‌లో కురాష్‌లో పోటీపడింది, కానీ అక్కడ కూడా పతకం సాధించడంలో విఫలమైంది. అప్పుడు మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఆమెకు మరో అవకాశాన్ని అందించింది, ఈసారి ఆమె దానిని చేజార్చుకోలేదు."ప్రజలకు నా గురించి తెలియడం కోసం నా దేశానికి పతకం గెలవాలనుకున్నాను. నేను జియు-జిట్సులో ప్రపంచ ఛాంపియన్‌ను కూడా. నేను ఆసియా క్రీడల్లో కురాష్‌లో పోటీపడ్డాను, కానీ అక్కడ పతకం గెలవలేదు. ఆ తర్వాత ఇక్కడ నన్ను నేను నిరూపించుకోవడానికి నాకు రెండో అవకాశం లభించింది. దాని కోసం నేను చాలా కష్టపడ్డాను" అని సుచికా అన్నారు.
ఆర్థిక ఇబ్బందులతో పోరాడి.. ఇప్పుడు దేశం తరఫున కూడా పోరాడింది!
సుచిక కథ కేవలం క్రీడా విజయాల గురించే కాదు, తన కలలను సాకారం చేసుకోవడానికి ఓ క్రీడాకారిణి ఆర్థిక ఇబ్బందులతో పోరాడవలసి వచ్చిన వైనం గురించి కూడా తెలియజేస్తుంది. ఆమె తండ్రి పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగి, తల్లి గృహిణి. ప్రస్తుతం ఆమె సీఐఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తోంది. తన వృత్తి జీవితం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు ఎంత తీవ్రంగా ఉండేవంటే ఆమె శిక్షణ కోసం తన శాఖ నుంచి జీతం లేని సెలవు తీసుకోవలసి వచ్చింది. అలాంటి సమయంలో ఆమె భర్త ఆమెకు ఆర్థికంగా అండగా నిలిచాడు.
మేరీ కోమ్‌ను ఆదర్శంగా తీసుకుని..
ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్, ఒలింపిక్ కాంస్య పతక విజేత అయిన బాక్సర్ మేరీ కోమ్ ఆమె ఆదర్శం. భోపాల్‌లో జరిగిన జాతీయ జూడో శిబిరంలో సుచిక ఆమెను మొదటిసారి చూసింది. "నేను చిన్నప్పటి నుంచి మేరీ కోమ్ దీదీని ఆరాధిస్తున్నాను. బహుశా 2009-10లో నేను భోపాల్‌లో జరిగిన జాతీయ జూడో శిబిరానికి వెళ్లాను. ఆమె వేసుకున్న దుస్తుల్లోనూ, ఆమె ప్రవర్తించే తీరులోనూ అద్భుతంగా కనిపించారు. ఆమె నా ఆదర్శం. నేను ఆమెతో ఎప్పుడూ ముఖాముఖిగా మాట్లాడలేదు. అవకాశం వస్తే తప్పకుండా మాట్లాడాలనుకుంటున్నాను."ఒకప్పుడు తాను దూరం నుండి చూసి ఆరాధించిన క్రీడాకారిణి లాగే, క్రీడలలో ఏ కలకైనా వయసు అంతిమ గమ్యం కాదని నమ్మే క్రీడాకారులకు సుచిక ఇప్పుడు స్ఫూర్తిగా నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


