Womens Asia Cup 2026 ఫైనల్ అనంతరం హై డ్రామా.. ట్రోఫీ అందుకోని భారత్!
మహిళల ఆసియా కప్ 2026 టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు ఓటమెరుగని జట్టుగా అద్వితీయమైన ప్రదర్శనతో 8వ టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. ఆదివారం దుబాయ్ వేదికగా శ్రీలంకతో జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన భారత్ 72 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. భారత ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ విధ్వంసానికి తోడుగా తెలుగు తేజం శ్రీచరణి(4/20) సత్తా చాటడంతో శ్రీలంక తేలిపోయింది.
ఈ ఫైనల్ అనంతరం మైదానంలో హైడ్రామా చోటు చేసుకుంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) చీఫ్ హోదాలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోహ్‌సిన్ నఖ్వీ ఈ ఫైనల్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యాడు. విజేతగా నిలిచిన భారత జట్టుకు టైటిల్ అందించేందుకు సిద్దమయ్యాడు. కానీ అతని చేతుల మీదుగా టైటిల్ అందుకునేందుకు భారత్ నిరాకరించింది. దాంతో అక్కడ హైడ్రామా చోటు చేసుకుంది. చివరకు టైటిల్ లేకుండానే భారత్ సెలెబ్రేషన్స్ చేసుకుంది.

అది బీసీసీఐ నిర్ణయం..
ఈ వ్యవహారంపై భారత మహిళల టీమ్ హెడ్ కోచ్ అమోల్ మజుందార్ స్పందించాడు. నఖ్వీ చేతుల మీదుగా టైటిల్ తీసుకోకూడదనేది బీసీసీఐ నిర్ణయమని, దానికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపాడు. 'భారత్ జట్టు ఆసియా కప్ ఛాంపియన్. బోర్డుపై పెద్ద అక్షరాలతో అందరికీ ఆ విషయం కనిపించింది. మాకు అది చాలు. మా జట్టు ఛాంపియన్‌గా నిలిచినందుకు సంతోషంగా ఉంది. ట్రోఫీ తీసుకున్నా తీసుకోకపోయినా మాకు పట్టింపు లేదు. నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోకూడదనేది బీసీసీఐ నిర్ణయం'అని మజుందార్ తెలిపాడు.
గతేడాది పురుషుల ఆసియా కప్ 2025 ఫైనల్ అనంతరం కూడా ఇలానే జరిగిన సంగతి తెలిసిందే. ఆ టోర్నీలో విజేతగా నిలిచిన భారత్.. నఖ్వీ చేతుల మీదుగా టైటిల్ స్వీకరించేందుకు నిరాకరించింది. దాంతో నఖ్వీ ట్రోఫీని తన వెంట తీసుకెళ్లిపోయాడు. భారత ఆటగాళ్లు ట్రోఫీ లేకుండా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇప్పటి వరకు ఆ ట్రోఫీ భారత్‌కు ఇవ్వలేదు. మహిళల ప్రపంచకప్ ఫైనల్ అనంతరం కూడా అదే దృశ్యం పునరావృతమైంది.
స్మృతి, షెఫాలీ ఊచకోత..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్మృతి మంధాన(39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59), షెఫాలీ వర్మ(39 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. శ్రీలంక బౌలర్లలో మిథాలి అయోధ్య, చమరి ఆటపట్టు, చముడి ప్రబోదా తలో వికెట్ తీసారు.
అనంతరం శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 111 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కెప్టెన్ చమరి ఆటపట్టు(32 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36), నిలాక్షిక సిల్వా(16 బంతుల్లో ఫోర్‌తో 22) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలరల్లో తెలుగు తేజం శ్రీచరణి(4/20) నాలుగు వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించగా..దీప్తి శర్మ(3/19) మూడు వికెట్లు పడగొట్టింది. క్రాంతి గాడ్, షెఫాలీ వర్మ, ప్రేమ రావత్‌కు తలో వికెట్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


