క్రికెట్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పద మ్యాచ్.. గ్లౌజులో బంతి పెట్టుకుని..

హైదరాబాద్: క్రికెట్ చరిత్రలోనే అత్యంత వివాదస్పదంగా ముగిసిన ప్రపంచకప్ మ్యాచ్ ఏదైనా ఉందంటే అది 2007 ప్రపంచకప్ ఫైనల్.! అవును సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇదే రోజు (2007 ఏప్రిల్ 28) బ్రిడ్జ్ టౌన్ వేదికగా ఆస్ట్రేలియా-శ్రీలంక మధ్య జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ అత్యంత నాటకీయంగా జరిగింది. 1996 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత 11 ఏళ్లకు మళ్లీ ఈ జట్లే ఫైనల్లో తలపడితే... అంపైర్ల తప్పిదం.. ప్రతికూల వాతావరణం మధ్య ఆస్ట్రేలియా విశ్వవిజేతగా నిలిచింది.

ఆదరణలేని ప్రపంచకప్..
ఇప్పటి వరకు జరిగిన అన్ని మెగాటోర్నీల్లో 2007 ప్రపంచకప్‌కే ప్రేక్షకాదరణ లభించలేదు. స్లో పిచ్‌లు, భారీస్థాయిలో టికెట్ల ధరలు.. భారత్, పాక్ వంటి మేటీ జట్లు లీగ్ స్టేజీలోనే నిష్క్రమించడం.. బంగ్లాదేశ్, ఐర్లాండ్ వంటి చిన్న దేశాలు సూపర్-8కు చేరి గట్టి పోటీనివ్వకపోవడంతో.. ఈ టోర్నీ అంచనాలను అందుకోలేక చప్పగా సాగింది. ఇక ఎక్కువ రోజులు ఈ టోర్నీ నిర్వహించడంపై కూడా అప్పట్లో విమర్శలు వచ్చాయి.

వర్షం అంతరాయం..
అయితే ఫైనల్ మ్యాచ్‌లో అంపైర్ల తప్పిదం.. అనుకూలించని వాతావరణం, గిల్‌క్రిస్ట్ వివాదస్పద బ్యాటింగ్ మాత్రం అభిమానుల మదిలో ఈ టోర్నీని మరిచిపోకుండా చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆట మధ్యలో వర్షం అంతరాయ కలిగించడంతో మ్యాచ్‌ను 38 ఓవర్లకు కుదించారు. ఆస్ట్రేలియా నిర్ణీత 38 ఓవర్లలో 4 వికెట్లకు 281 పరుగులు చేసింది. గిల్‌క్రిస్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 104 బంతులు ఎదుర్కొన్నఈ ఆస్ట్రేలియా వికెట్ కీపర్ 8 సిక్సర్లు, 13 ఫోర్లతో 149 పరుగులు చేసి ప్రపంచకప్ ఫైనల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు.

విధ్వంసం వెనుక రహస్యం..
ఆ మ్యాచ్‌లో గిల్‌క్రిస్ట్ ఇలా విరుచుకుపడడం వెనక ఓ రహస్యం కూడా ఉంది. ఆ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. సెంచరీ పూర్తి చేసిన అనంతరం డ్రెస్సింగ్ రూమ్ వైపు చూసి అభివాదం చేస్తూ తన గ్లోవ్స్‌లో ఉన్న బంతిని చూపించాడు. గ్రిప్ కోసం గ్లౌజులో స్క్వాష్ బంతిని పెట్టుకున్నట్టు చెప్పాడు. ఇలా గ్లౌజ్‌లో బంతి పెట్టుకుని బ్యాటింగ్ చేయడం వివాదాస్పదమైంది. క్రికెట్ స్ఫూర్తిని గిల్ క్రిస్ట్ దెబ్బ తీశాడని శ్రీలంక ఆరోపించింది. నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించిన గిల్‌క్రిస్ట్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. చీటర్ అంటూ శ్రీలంక ఫ్యాన్స్ మండిపడ్డారు.

అంపైర్ల ఘోర తప్పిదం..
ఇక 282 పరుగుల లక్ష్యంతో శ్రీలంక బరిలోకి దిగగా.. మరోసారి వర్షం అంతరాయం కలిగించడంతో టార్గెట్‌ను 36 ఓవర్లలో 269 పరుగులుగా నిర్దారించారు. అయితే 33 ఓవర్లలో శ్రీలంక 206/7 స్కోర్ చేయగా.. మైదానంలో వెలుతురు మందగించింది. దీంతో అంపైర్లు ఆటను నిలిపివేయడంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం తాము గెలిచామని ఆసీస్ అభిమానులు, ఆటగాళ్లు సంబరాలు మొదలు పెట్టారు. కానీ నాటి మ్యాచ్ అఫిషియల్స్ రిజర్వ్ డే రోజు ఆ మిగిలిన ఓవర్లు ఆడవచ్చనే విషయాన్ని మర్చిపోయారు. అంతేకాకుండా ఆ చీకటిలోనే ఇద్దరి కెప్టెన్ల అంగీకారంతో మిగిలిన మూడు ఓవర్ల మ్యాచ్‌ను నిర్వహించారు. మరో 9 పరుగులు మాత్రమే చేసిన శ్రీలంక 215/8కే పరిమితమై ఓటమిపాలైంది. అయితే అంపైర్ల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో నాటి మ్యాచ్ అఫిషియల్స్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంటూ 2007 టీ20 ప్రపంచకప్ నుంచి బహిష్కరించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
యూవీ పా.. ఈ వివాదస్పద ప్రశ్నలేంది.. నేను చెప్పను పో: బుమ్రా