
లండన్: కెరీర్‌లో 20వ గ్రాండ్ స్లామ్ కైవసం చేసుకొని టెన్నిస్ దిగ్గజాలు రోజర్ ఫెడరర్, రఫెల్ నాదల్ సరసన నిలిచేందుకు సెర్బియా గ్రేట్ నొవాక్ జొకోవిచ్ అడుగు దూరంలో నిలిచాడు. అంచనాలను అందుకుంటూ వింబుల్డన్ ఫైనల్‌కు దూసుకెళ్లిన వరల్డ్ నెంబర్ వన్ జొకో ఫస్ట్ గ్రాండ్ స్లామ్‌పై కన్నేసిన ఏడో సీడ్ ఇటలీ ప్లేయర్ మాటియో బెరెటినితో అమీతుమీకి రెడీ అయ్యాడు. ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమయ్యే పురుషుల సింగిల్స్ టైటిల్ ఫైట్‌లో బెరెటిని పని పట్టి తన టార్గెట్‌ను పూర్తి చేసుకోవాలని చూస్తున్నాడు.
అనుభవం, ప్రస్తుత ఫామ్ ప్రకారం ఈ పోరులో 34 ఏళ్ల నొవాక్ హాట్ ఫేవరేట్. ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాన్ ఓపెన్, గత నెలలో ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గి ఫుల్ జోష్‌లో ఉన్నాడు. వింబుల్డన్‌లో 2018 నుంచి ఆడిన 20 మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన జొకో.. ఈసారి ఫైనల్ చేరే క్రమంలో చివరి 18 సెట్లూ గెలిచాడు. పైగా నొవాక్‌కు ఇది 30వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్, ఇటీవలె యంగ్‌స్టర్ బెరెటిని ఫస్ట్ టైమ్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్నాడు. పాతికేళ్ల ఈ టాలెంటెడ్ ప్లేయర్ అంత ఈజీగా తలొగ్గేరకం కాదు. భారీ సర్వీసులతో ఎలాంటి ప్రత్యర్థికైనా సవాల్ విసురుతాడు. పైగా గ్రాస్ కోర్టులో బెరెటిని వరుసగా 11 మ్యాచ్‌ల విజయం సాధించాడు. ఈ క్రమంలో గత నెలలో క్వీన్స్ ట్రోఫీ కైవసం చేసుకున్నాడు. ఇప్పుడు అదే జోరుతో తొలి గ్రాండ్‌స్లామ్ నెగ్గాలని చూస్తున్నాడు. మరి జొకో జోరును అతను అడ్డుకుంటాడో లేదో చూడాలి.
జొకోవిచ్-బెరెటిని మధ్య జరిగే టైటిల్ ఫైట్‌కు 43 ఏళ్ల మరిజా సిసాక్(క్రొయేషియా) చైర్ అంపైర్‌గా వ్యవహరించనుంది. వింబుల్డన్ పురుషుల ఫైనల్‌కు చైర్ అంపైర్‌గా పని చేసిన తొలి మహిళగా మరిజా రికార్డులకెక్కనుంది. 1877లో మొదలైనప్పటి నుంచి మెన్స్ ఫైనల్‌కు మహిళ అంపైర్‌గా పని చేయలేదు. కానీ, సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ ఆల్ ఇంగ్లండ్ క్లబ్ సెలెక్షన్ కమిటీ ఈసారి మరిజాకు చాన్స్ ఇచ్చింది.