
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ నుంచి మహిళల సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్, రొమెనియా టెన్నిస్ స్టార్ సిమోనా హలెప్ తప్పుకుంది. ఈ విషయాన్ని ఆమె ప్రకటించింది. కాలి గాయంతో బాధపడుతున్న హలెప్ ఈ నిర్ణయం తీసుకుంది. రోమ్ వేదికగా మేలో జరిగిన డబ్ల్యూటీఏ ఈవెంట్లో గాయం కారణంగా హలెప్ ఆట మధ్యలోనే తప్పుకొంది. అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉన్న ఆమె.. ఇటీవల ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ పాల్గొనలేదు.
'కాలిపిక్క గాయం కారణంగా వింబుల్డన్‌లో పాల్గొనట్లేదు. దురదృష్టవశాత్తూ నా శరీరం సహకరించట్లేదు. గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా కలత చెందా. ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్‌తో పాటు ప్రస్తుత టోర్నీకి కూడా దూరం అవ్వడం బాధాకరం. దీని నుంచి తేరుకోవడానికి నేను మానసికంగా, భౌతికంగా దృఢంగా తయారవ్వాల్సిన అవసరం ఉంది.'అని సిమోనా హెలెప్ చెప్పుకొచ్చింది.
జపాన్ స్డార్ నవోమీ ఒసాకా సైతం వింబుల్డన్ టోర్నీ నుంచి తప్పుకొంటున్నట్లు తెలిపింది. ఒలింపిక్స్ సన్నద్ధత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇటీవల జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ నుంచి కూడా ఒసాకా అనూహ్యంగా వైదొలిగింది. మొదటి రౌండ్ గెలిచాక ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హాజరు కాలేకపోవడం వల్ల ఆమెకు అధికారులు జరిమానా విధించారు. దీంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రపంచ ఐదో సీడ్ ఆటగాడు డొమినిక్ థీమ్ కూడా వింబుల్డన్‌కు దూరమయ్యాడు. కుడిచేతి గాయంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. మల్లోర్కా ఛాంపియన్‌షిప్స్‌లో ఆడుతున్న థీమ్ కుడిచేతి మణికట్టుకు గాయమైంది. 20సార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ సైతం వింబుల్డన్ చాంపియన్‌షిప్ 2021, టోక్యో ఒలింపిక్స్ గేమ్స్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, మరికొన్నేళ్ల పాటు కెరీర్‌ను కొనసాగించడంపై దృష్టిపెట్టాలనుకుంటున్నట్లు రఫా పేర్కొన్నాడు. తన టీంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు.
'అందరికీ హాయ్. ఈ ఏడాది జరిగే వింబుల్డన్ ఛాంపియన్‌షిప్, టోక్యో వేదిగా నిర్వహించే ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాను. ఇది అంత తేలికైన నిర్ణయం ఏమీ కాదు. కానీ నా శరీరం సహకరిస్తున్న తీరును పరిగణనలోకి తీసుకొని నా బృందంతో చర్చించిన తర్వాత ఇదే సరైన నిర్ణయమని భావించా' అని టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ ట్వీట్ చేశాడు. నాదల్ 2008, 2010లో రెండుసార్లు వింబుల్డన్ టైటిల్ నెగ్గాడు. ఈ నెల 28 నుంచి వింబుల్డన్ టోర్నీ ప్రారంభం కానుంది.