Wimbledon 2021 Day 4: ఫెడరర్, బార్టీ, జ్వెరెవ్ ముందంజ.. స్వితోలినా ఔట్

లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు. టాప్ సీడ్ ఆష్లే బార్టీ, రష్యన్ ఆటగాడు డానిల్ మెద్వెదెవ్, నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్, ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ బార్బరా క్రెజికొవా కూడా ముందంజ వేశారు. మహిళల డబుల్స్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా శుభారంభం చేయగా.. సింగిల్స్‌లో మూడో సీడ్, ఉక్రెయిన్ స్టా ఎలినా స్వితోలినాకు చుక్కెదురైంది.
పోలెండ్‌కు చెందిన లినెట్టె రెండో రౌండ్లో 6-3, 6-4తో స్వితిలోనాకు షాకిచ్చింది. దాంతో ఓటములు, విత్ డ్రా లేదా గాయాల వల్ల డబ్ల్యూటీఏ టాప్-11 క్రీడాకారుణుల్లో ఇప్పటికి ఎనిమిది మంది టోర్నీకి దూరమయ్యారు. లినెట్టె 28 విన్నర్లు కొట్టగా.. స్వితోలినా కేవలం ఎనిమిది విన్నర్లే కొట్టింది.

మూడో రౌండ్‌కు క్రెజికోవా, బార్టీ..
గురువారం జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ బార్బరా క్రెజికోవా (చెక్), టాప్ సీడ్ బార్టీ (ఆస్ట్రేలియా) మూడో రౌండ్లో అడుగుపెట్టారు. రెండో రౌండ్లో క్రెజికోవా 7-5, 6-4తో పెట్కోవిచ్ (జర్మనీ)పై విజయం సాధించింది. బార్టీ 6-4, 6-3తో బ్లికోవా (రష్యా)ను ఇంటిముఖం పట్టించింది. 16వ సీడ్ పవ్లిచెంకోవా (రష్యా) 7-5, 6-4తో ప్లిస్కోవా (చెక్)పై నెగ్గగా.. షెల్బీ రోజర్స్ (అమెరికా) 7-5, 6-4తో మరియా సకారి (గ్రీస్)ని ఓడించింది. అమెరికా టీనేజ్ సెన్సేషన్, 20వ సీడ్ గాఫ్ 6-4, 6-3తో వెస్నినా (రష్యా)పై, ఒస్తాపెంకో (లాత్వియా) 6-1, 3-6, 8-6తో కసట్కినా (రష్యా)పై గెలిచారు. సెవత్సొవా (ఉక్రెయిన్), బదోసా (స్పెయిన్), ముచోవా (చెక్), జియోర్జి (ఇటలీ) తర్వాతి రౌండ్ చేరుకున్నారు.

మెద్వెదెవ్ ముందంజ
పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ఫెడరర్ 7-6 (7-1), 6-1, 6-4తో గాస్కెట్ (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు. మ్యాచ్‌లో ఫెడరర్ 9 ఏస్‌లు, 49 విన్నర్లు కొట్టాడు. మెద్వెదెవ్ 6-4, 6-1, 6-2తో అక్లారెజ్ (స్పెయిన్)పై, జ్వెరెవ్ 7-5, 6-2, 6-3తో సాండ్‌గ్రెన్ (అమెరికా)ను గెలిచారు. ఎనిమిదో సీడ్ బటిస్టా అగట్ (స్పెయిన్) కష్టంగా ముందంజ వేశాడు. అయిదుసెట్ల పాటు సాగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో అతడు 6-3, 6-3, 6-7 (3-7), 3-6, 6-3తో కెమనోవిచ్ (సెర్బియా)పై నెగ్గాడు.

సానియా జోడీ సంచలనం..
మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా, బెథానీ మాటెక్ జోడీ రెండో రౌండ్లో ప్రవేశించింది. మొదటి రౌండ్లో ఈ జంట 7-5, 6-3తో ఆరో సీడ్ జోడీ దెసైరే క్రాజిక్ (అమెరికా), అలెక్సా గౌరాచి (చిలీ)లను ఓడించింది. ఆరంభంలో కాస్త ఇబ్బంది పడ్డ సానియా-మాటెక్ ద్వయం లయను అందుకున్నాక పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మరోవైపు పురుషుల డబుల్స్‌లో బోపన్న-దివిజ్ శరణ్ జోడీ 6-7 (6-7), 4-6తో కొంటినెన్ (ఫిన్లాండ్), రోజర్-వాసెలిన్ (ఫ్రాన్స్) జంట చేతిలో ఓడింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications