
కరెనో బుస్టా ఔట్..
మరోవైపు 11వ సీడ్ పాబ్లో కరెనో బుస్టా (స్పెయిన్), 12వ సీడ్ కాస్పెర్ రూడ్ (నార్వే) తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. సామ్ క్వెరీ (అమెరికా) 7-6 (8/6), 6-4, 7-5తో కరెనో బుస్టాను... జోర్డాన్ థాంప్సన్ (ఆస్ట్రేలియా) 7-6 (8/6), 7-6 (7/3), 2-6, 2-6, 6-2తో రూడ్‌ను ఓడించారు. స్పెయిన్ ఆటగాడు పాబ్లో అండుజర్‌తో పోరులో 10వ సీడ్ షపోవలోవ్‌కు వాకోవర్ లభించింది. తొలిరౌండ్ మ్యాచ్‌ల్లో 7వ సీడ్ బెరెట్టిని 6-4, 3-6, 6-4, 6-0తో గ్యూడో పెల్లాపై, నిషికొరి 6-4, 6-4, 6-4తో అలెక్సీ పాపిరిన్‌పై గెలిచారు. 18వ సీడ్ దిమిత్రోవ్ 3-6, 6-3, 6-4, 6-4తో వెర్డాస్కోను, శామ్ క్వెర్రీ 7-6(6), 6-4, 7-5తో 11వ సీడ్ పాబ్లో కర్రెనో బుస్టాను, కిర్గియోస్ 6-4, 4-6, 3-6, 6-1, 9-7తో యుగో హంబర్ట్‌ను ఓడించారు.

సబలెంకా ముందంజ
మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ సబలెంకా (బెలారస్) మూడో రౌండ్‌లోకి ప్రవేశించగా... నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) రెండో రౌండ్‌లో... ఐదో సీడ్ బియాంక ఆండ్రెస్కూ (కెనడా), తొమ్మిదో సీడ్ బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్) తొలి రౌండ్‌లో ఇంటిముఖం పట్టారు. రెండో రౌండ్‌లో సబలెంకా 4-6, 6-3, 6-3తో కేటీ బౌల్టర్ (బ్రిటన్)పై గెలిచింది. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో అలీజె కార్నె (ఫ్రాన్స్) 6-2, 6-1తో ఆండ్రెస్కూపై, కాయా యువాన్ (స్లొవేనియా) 6-3, 6-3తో బెన్‌చిచ్‌పై సంచలన విజయం సాధించారు. రెండో రౌండ్ మ్యాచ్‌లో మాడిసన్ బ్రెంగల్ (అమెరికా) 6-2, 6-4తో సోఫియా కెనిన్‌ను బోల్తా కొట్టించింది.

ఇవేం కోర్టులు?
వరుసగా ఆటగాళ్లు గాయపడుతుండడంతో వింబుల్డన్ గ్రాస్ కోర్టులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొలిరౌండ్ మ్యాచ్‌లో సెరెనా విలియమ్స్ కోర్టులోనే జారిపడి అనూహ్యంగా రిటైర్డ్ హర్ట్ అయింది. ఫెడరర్‌తో మ్యాచ్‌లో ఫ్రాన్స్ ఆటగాడు అడ్రియన్ మన్నారినో కూడా ఇలాగే జారిపడ్డాడు. మోకీలు బెణకడంతో అతడు ఐదో సెట్ ఆడకుండా రోజర్‌కు వాకోవర్ ఇచ్చాడు. ముఖ్యంగా మెగా మ్యాచ్‌లు జరిగే సెంటర్ కోర్టులో గడ్డి జారుతున్నదనే ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. కప్పు మూసి ఉంచడం వల్ల గడ్డిలో తేమ కారణంగా ఇలా జరుగుతున్నదని భావిస్తున్నారు. అయితే, ఇంతకుముందు తరహాలోనే కోర్టులను తయారు చేశామని నిర్వాహకులు తెలిపారు. జొకోవిచ్ కూడా తొలి మ్యాచ్ సందర్భంగా రెండుసార్లు జారిపడ్డాడు.


Click it and Unblock the Notifications












