వింబుల్డన్: వరల్డ్ నెంబర్ వన్, టాప్ సీడ్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్ వింబుల్డన్‌లో దుమ్మురేపాడు. వరుసగా రెండో ఏడాది ఈ స్పెయిన్ కెరటం మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో టాప్ సీడ్ అల్కరాజ్ 6-4, 7-6 (7-2), 6-3తో ముల్లర్ (ఫ్రాన్స్)ను ఓడించాడు.
రెండున్నర గంటల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనా.. అద్భుత ఆట తీరుతో అల్కరాజ్ మూడు సెట్లలోనే మ్యాచ్‌ను ముగించాడు. ఈ మ్యాచ్‌లో 5 ఏస్‌లు సంధించిన అల్కరాజ్.. 32 విన్నర్లు కూడా కొట్టాడు.

ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో 8వ సీడ్ సిన్నర్ (ఇటలీ) 3-6, 6-2, 6-3, 6-4తో హాలిస్ (ఫ్రాన్స్)పై విజయం సాధించగా.. హుర్కాజ్ (పోలెండ్) 7-6 (4), 6-4, 6-4తో 14వ సీడ్ ముసేటి (ఇటలీ)ని కంగుతినిపించాడు. మరో మ్యాచ్‌లో బబ్లిక్ (కజకిస్థాన్) 64, 61, 76 (4)తో మార్టెరర్ (జర్మనీ)పై నెగ్గి ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు.
అయిదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) కష్టంగా రెండో రౌండ్ దాటాడు. హోరాహోరీ పోరులో అతను 7-6 (7-3), 6-7 (2-7), 4-6, 7-6 (7-3), 6-4తో మాజీ ఛాంపియన్ ఆండీ ముర్రే (బ్రిటన్)పై గెలిచాడు.
మహిళల సింగిల్స్‌లో బెలారస్ స్టార్ విక్టోరియా అజరెంకా తన జోరు కొనసాగిస్తోంది. అద్వితీయమైన ప్రదర్శనతో ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. మూడో రౌండ్ మ్యాచ్‌లో అజరెంకా 6-2, 6-4తో కసకీనా (రష్యా)ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఐసార్లు ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసిన అజరెంకా.. 18 విన్నర్లు కొట్టింది.
ఇతర మ్యాచ్‌ల్లో వోండ్రుసోవా (చెక్), తుర్సెంకో (ఉక్రెయిన్), పెగులా (అమెరికా) కూడా ప్రిక్వార్టర్స్ చేరారు. తుర్సెంకో 4-6, 6-3, 7-6 (20-18)తో బోగ్డాన్ (రొమేనియా)ను ఓడించగా.. వోండ్రుసోవా 6-1, 7-5తో వికిచ్ (క్రొయేషియా)పై, పెగులా 6-4, 6-0తో ఎలిసాబెటా (ఇటలీ)పై విజయం సాధించారు. తొమ్మిదో సీడ్ క్విటోవా (చెక్), ఆండ్రెస్క్యూ (కెనడా) కూడా ముందంజ వేశారు.
వింబుల్డన్‌లో మొదటి రెండు రోజులు వర్షం అంతరాయం కలిగించడంతో తొలి రౌండ్ మ్యాచ్‌లు మూడో రోజు వరకు కొనసాగడం విశేషం.