ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ 2025లో సంచలన ఫలితాలు నమోదయ్యాయి. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్, పోలాండ్ స్టార్ ఇగా స్వైటెక్, 11వ సీడ్, చెక్ రిపబ్లిక్ ప్లేయర్ కరోలినా మచోవాకు చుక్కెదురైంది. ఈ టాప్ సీడ్ ఆటగాళ్లను ఓడించిన అమెరికా స్టార్ అమాండా అనిసిమోవా, జపాన్ దిగ్గజం నవోమి ఒసాకా సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. గురువారం తెల్లవారుజామున జరిగిన క్వార్టర్ ఫైనల్లో అమెరికా స్టార్, 8వ సీడ్ అమాండా అనిసిమోవా 6-4, 6-3 తేడా ఇగా స్వైటెక్‌ను ఓడించింది.
గంటా 36 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో అమెరికా ప్లేయర్ అమాండా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి సెట్‌లో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. 4-4తో సమంగా ఉన్న సమయంలో అనిసిమోవా తన దూకుడు ఆటతో స్వైటెక్ సర్వీసును బ్రేక్ చేసి వరుస పాయింట్స్‌తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అదే జోరులో 6-4తో తొలి సెట్‌ను గెలుచుకుంది. రెండో సెట్ ఆరంభంలోనూ స్వైటెక్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. కానీ, అనిసిమోవా బలంగా పుంజుకుని వరుసగా బ్రేక్ పాయింట్స్ సాధించి 5-3తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ పరిస్థితుల్లో స్వైటెక్ సర్వీసులో ఆమె చేసిన డబుల్ ఫాల్ట్‌తో అనిసిమోవాకు మ్యాచ్ పాయింట్ లభించింది.

ఈ మ్యాచ్‌లో అమాండా అనిసిమోవా ఒక ఏస్‌తో పాటు 23 విన్నర్స్ కొట్టింది. 12 అనవసర తప్పిదాలు చేసిన అమెరికా స్టార్.. 2 డబుల్ ఫాల్ట్స్‌తో పాటు 4 బ్రేక్ పాయింట్స్ సాధించింది. మరోవైపు 2 ఏస్‌లు, 13 విన్నర్స్ కొట్టిన ఇగా స్వైటెక్.. 18 అనవసర తప్పిదాలతో పాటు 3 డబుల్ ఫాల్ట్స్‌తో మూల్యం చెల్లించుకుంది. 5 బ్రేక్ పాయింట్ అవకాశాలు రాగా రెండింటిని మాత్రమే గెలుచుకుంది. ఇది కూడా ఆమె ఓటమిని శాసించింది.
మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో నవోమి ఒసాకా (జపాన్), 6-4, 7-6 (3) తేడాతో కరోలినా ముచోవా (చెక్ రిపబ్లిక్)ను ఓడించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. 2 గంటల 4 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో జపాన్ స్టార్ అసాధారణ ప్రదర్శన కనబర్చింది. తనదైన దూకుడు, పవర్‌ఫుల్ గేమ్‌తో ఒసాకా తొలి సెట్‌ను సునాయసంగా గెలుచుకుంది. ముచోవా ప్రతిఘటించినప్పటికీ ఒసాకా తన సర్వీస్ గేమ్‌లో పటిష్టంగా ఉండి తొలి సెట్‌ను కైవసం చేసుకుంది.
రెండో సెట్‌లో ఇద్దరు ప్లేయర్స్ హోరాహోరీగా తలపడ్డారు. దాంతో ఫలితం ఉత్కంఠగా మారింది. తమ సర్వీసులను నిలుపుకునేందుకు ఇద్దరు తీవ్రంగా పోరాడారు. స్కోర్ 6-6తో సమం కాగా.. టై-బ్రేక్‌కు దారి తీసింది. టై బ్రేక్‌లో ఒసాకి తన అనుభవాన్ని ఉపయోగించి 7-3తో గెలుచుకుంది.
ఈ మ్యాచ్‌లో 8 ఏస్‌లు, 28 విన్నర్స్ కొట్టిన ఒసాకా 4 డబుల్ ఫాల్ట్స్‌తో పాటు 22 అనవసర తప్పిదాలు చేసింది. 10 బ్రేక్ పాయింట్ అవకాశాల్లో 3 గెలుచుకుంది. మరోవైపు ముచోవా 4 ఏస్‌లు, 24 విన్నర్లు కొట్టింది. 28 అనవసరం తప్పిదాలతో పాటు 5 డబుల్ ఫాల్ట్స్ చేసింది. 8 బ్రేక్ పాయింట్ అవకాశాల్లో 2 గెలుచుకుంది. ఒసాకా 71 పాయింట్స్‌తో పాటు 13 గేమ్స్ గెలవగా.. ముచోవా 64 పాయింట్స్‌తో పాటు 10 గేమ్స్ గెలిచింది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో అమెరికా స్టార్ అమాండా అనిసిమోవాతో ఒసాకా తలపడనుంది.
పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్, ఇటాలియన్ స్టార్ జానిక్ సిన్నర్ 6-1, 6-4, 6-2 తేడాతో ఇటలీకే చెందిన 10వ సీడ్ లోరెంజో ముసెట్టిని ఓడించాడు. తొలి సెట్‌ను జానిక్ సిన్నర్ పూర్తి ఆధిపత్యం చెలాయించి సునాయస విజయాన్నందుకున్నాడు. రెండో సెట్‌లో లోరెంజో ప్రతిఘటించినా.. జానిక్ సిన్నర్ తన అనుభవంతో మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో జానిక్ సిన్నర్ 10 ఏస్‌లు కొట్టాడు. 5 బ్రేక్ పాయింట్స్ సాధించిన అతను 28 పాయింట్స్ గెలుచుకున్నాడు. మరోవైపు 2 ఏస్‌లు మాత్రమే కొట్టిన లోరెంజో ఒక్క బ్రేక్ పాయింట్ కూడా గెలవలేదు. శనివారం జరిగే సెమీఫైనల్లో జానిక్ సిన్నర్.. కెనడా ప్లేయర్ ఫెలిక్స్ అగర్‌తో తలపడుతాడు.