న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో సెర్బియా టెన్నిస్టార్ నొవాక్ జకోవిచ్ శుభారంభం చేశాడు. ఏడాది తర్వాత యుఎస్ ఓపెన్ బరిలోకి దిగిన రెండో సీడ్ జకోవిచ్ 6-0, 6-2, 6-3తో ముల్లర్ (ఫ్రాన్స్)ను ఓడించాడు. తొలి సెట్లో ఫ్రాన్స్ ఆటగాడికి ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా గెలిచిన జకోవిచ్‌కు.. రెండు, మూడు సెట్లలో కాస్త ప్రతిఘటన ఎదురైంది.
అయినా జకోవిచ్ సునాయసంగానే విజయాన్ని అందుకున్నాడు. ఈ క్రమంలో జకోవిచ్ 6 ఏస్‌లు, 32 విన్నర్లు కొట్టాడు. ఈ విజయంతో జకోవిచ్ మళ్లీ నంబర్‌వన్ ర్యాంకును కూడా దక్కించుకోనున్నాడు. కరోనా వ్యాక్సిన్ వేసుకోకపోవడంతో జకోవిచ్‌ను గతేడాది యుఎస్ ఓపెన్ ఆడేందుకు అనుమతించని విషయం తెలిసిందే. కానీ ఈసారి నిబంధనలను సడలించడంతో అతనికి అవకాశం దక్కింది.

మరోవైపు రష్యా స్టార్ డానియల్ మెద్వెదెవ్ 6-1, 6-1, 6-0తో బలాజ్స్ (హంగేరీ)ను ఓడించాడు. ఏడోసీడ్ సిట్సిపాస్ (గ్రీస్) కూడా శుభారంభం చేశాడు. సిట్సిపాస్ 6-2, 6-3, 6-4తో రోనిచ్ (కెనడా)పై విజయం సాధించాడు. నాలుగో సీడ్ రూన్ (డెన్మార్క్) మాత్రం ఓడిపోయాడు.
కార్‌బెల్లాస్ (స్పెయిన్) 6-3, 4-6, 6-3, 6-2తో రూన్‌కు షాకిచ్చాడు. టియాఫో (అమెరికా), మనారియో (ఫ్రాన్స్), డేవిడోవిచ్ (స్పెయిన్), ఫ్రిట్జ్ (అమెరికా) కూడా ముందంజ వేసారు.
మహిళల సింగిల్స్‌లో ట్యూనీసియా స్టార్ ఆన్స్ జాబెర్ శుభారంభం చేసింది. తొలి రౌండ్లో అయిదోసీడ్ జాబెర్ 7-5, 7-6 (7-4)తో కమిలా ఒసోరియో (కొలంబియా)ను ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో బౌల్టర్ (బ్రిటన్) 6-4, 6-0తో పారీ (ఫ్రాన్స్)ను ఓడించగా.. ఆరోసీడ్ కొకో గాఫ్ (అమెరికా) 3-6, 6-2, 6-4తో సిగ్మాండ్ (జర్మనీ)పై నెగ్గింది.
ఈ మ్యాచ్‌లో ఏడు ఏస్‌లు సంధించిన గాఫ్... 34 విన్నర్లు కొట్టింది. వోజ్నియాకి (డెన్మార్క్), క్విటోవా (చెక్), ఒస్టాపెంకో (లాత్వియా) కూడా ముందంజ వేసారు. వోజ్నియాకి 6-3, 6-2తో ప్రొజొరోవా (రష్యా)పై, ఒస్టాపెంకో 6-4, 4-6, 6-1తో పోలిని (ఇటలీ)పై, క్విటోవా 6-1, 7-6 (7-5)తో బుసా (స్పెయిన్)పై విజయం సాధించారు.