న్యూయార్క్: ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సందడి చేశాడు. వరల్డ్ నంబర్ వన్ కార్లోస్ అల్కరాజ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కు ధోనీ తన స్నేహితులతో కలిసి హాజరయ్యాడు. ఓ సాధారణ ప్రేక్షకుడిగా మ్యాచ్‌ను ఆస్వాదించాడు. ఆట మధ్యలో అల్కరాజ్ కాసేపు విశ్రాంతి తీసుకుని డ్రింక్స్ తాగుతుండగా అతని వెనుకవైపు ప్రేక్షకుల సీట్లలో కూర్చుని ఉన్న ధోనీ తన ఫ్రెండ్స్‌తో ముచ్చటిస్తూ కనిపించాడు.
ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గురువారం జరిగిన పురుషుల క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ అల్కరాజ్ 6-3, 6-2, 6-4 తేడాతో 12వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను మట్టి కరిపించాడు. ఈ విజయంతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. 2 గంటల 30 నిమిషాలపాటు సాగిన ఈ పోరులో అల్కరాజ్ ఆరంభం నుంచే ఆధిపత్యం చెలాయించి వరుస సెట్లలో విజయం సాధించాడు.

గతేడాది యూఎస్ ఓపెన్ టైటిల్ గెలిచిన అల్కారజ్.. ఈ సారి అదే జోరును కొనసాగిస్తున్నాడు. అయితే ఈ సారి అతనికి నోవాక్ జకోవిచ్ నుంచి గట్టి పోటీ ఎదురు కానుంది. కరోనా వ్యాక్సిన్ వేయించుకోని కారణంగా గతేడాది నోవాక్ జకోవిచ్‌ను ఈ టోర్నీ ఆడేందుకు అనుమతించలేదు. అతని గైర్హాజరీలో అల్కరాజ్ ఛాంపియన్‌గా నిలిచాడు.
సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ కూడా సెమీఫైనల్ చేరాడు. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 2 గంటల 35 నిమిషాల్లో 6-1, 6-4, 6-4తో తొమ్మిదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై గెలుపొందాడు.
ఫ్రిట్జ్‌తో గతంలో ఆడిన ఏడుసార్లూ గెలుపొందిన జొకోవిచ్ ఎనిమిదోసారి కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేశాడు. ఏడు ఏస్‌లు సంధించిన జొకోవిచ్ ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. ఆరుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఈ సెర్బియా స్టార్ నెట్ వద్దకు 17 సార్లు దూసుకొచ్చి 13 సార్లు పాయింట్లు గెలిచాడు. 2016 వింబుల్డన్ టోర్నీ మూడో రౌండ్‌లో సామ్ క్వెరీ (అమెరికా) చేతిలో ఓడిన జొకోవిచ్ ఆ తర్వాత అమెరికా ఆటగాళ్లతో 30 సార్లు తలపడినా ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు.
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ.. ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా కొనసాగుతున్నాడు. ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్‌ను విజేతగా నిలిపాడు. అనంతరం మోకాలికి శస్త్రచికిత్స చేయించుకుని కోలుకున్నాడు. ప్రస్తుతం తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో ఖాళీ సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు.