
బాసెల్: స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం, 20 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ విజేత రోజర్ ఫెడరర్ టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనడం లేదని ప్రకటించాడు. మోకాలి గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విటర్ వేదికగా తెలిపాడు. వింబుల్డన్‌లో మోకాలి గాయానికి గురయ్యానని, ఇప్పటికే రిహాబిలిటేషన్ ప్రారంభించానని పేర్కొన్నాడు. 'గ్రాస్ కోర్ట్ సీజన్ సందర్భంగా దురదృష్టవశాత్తు నా మోకాలికి గాయం మళ్లీ తిరగబెట్టింది. దాంతో ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది నన్ను తీవ్రంగా బాధించింది. ఇప్పటికే నేను రిహాబిలిటేషన్ ప్రారంభించాను. ఈ ఏడాది సమ్మర్‌లో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తాననే నమ్మకం ఉంది. ఒలింపిక్స్ బరిలోకి దిగే స్విట్జర్లాండ్ టీమ్‌కు బెస్టాఫ్ లక్'అని ఫెడరర్ ట్వీట్ చేశాడు.
39 ఏళ్ల ఫెడరర్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో డబుల్స్‌లో స్వర్ణం... 2012 లండన్ ఒలింపిక్స్‌లో సింగిల్స్‌లో రజతం సాధించాడు. ఇటీవల ముగిసిన వింబుల్డన్ టోర్నీలో ఫెడరర్ క్వార్టర్ ఫైనల్లోనే తన పోరాటాన్ని ముగించాడు. మోకాలి గాయం కారణంగా ఫ్రెంచ్ ఓపెన్‌కు కూడా ఫెడరర్ దూరంగా ఉన్నాడు. కాగా, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ఈ ఒలింపిక్స్‌లో ఆడటం లేదని ఇదివరకే ప్రకటించాడు. వరల్డ్ నెంబర్ వన్, సెర్బియా స్టార్ జొకోవిచ్ కూడా బరిలోకి దిగేది అనుమానంగానే ఉందన్నాడు. 'టోక్యో గేమ్స్ బరిలో దిగడం గురించి నేను ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నేనెప్పుడూ ఒలింపిక్స్‌లో ఆడాలనే అనుకుంటా. కానీ, ఇప్పుడు మాత్రం నాకు క్లారిటీ లేదు.
ఈ రెండు మూడు రోజులుగా జరిగిన పరిమాణాలు చూస్తే నేను టోక్యో వెళ్లే అవకాశాలు 50-50గా ఉండొచ్చని చెప్పవచ్చు'అని జొకోవిచ్ చెప్పుకొచ్చాడు. టోక్యో గేమ్స్‌లో ఫ్యాన్స్‌కు ఎంట్రీ లేదన్న వార్త తనను నిరాశ పరిచిందన్నాడు. జొకో కూడా తప్పుకుంటే స్టార్ ప్లేయర్స్ లేకుండానే ఒలింపిక్స్‌లో టెన్నిస్ పోటీలు జరగనున్నాయి. ఒకవేళ జొకో బరిలోకి దిగితే మాత్రం గోల్డెన్ స్లామ్ గెలుచుకునేందుకు సువర్ణావకశం. ఇప్పటికే ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచిన జొకో.. యూఎస్ ఓపెన్, గోల్డ్ మెడిల్ గెలిస్తే ఎవరికీ సాధ్యం కాని ఘనతను అందుకున్నట్లే.