భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న తన ప్రొఫెషనల్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రెండు దశాబ్దాల పాటు భారత టెన్నిస్‌పై చెరగని ముద్రవేసిన బోపన్న 45 ఏళ్ల వయసులో ఆటకు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని అతనే శనివారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. సుదీర్ఘ పోస్ట్‌లో ఇది కేవలం వీడ్కోలు మాత్రమేనని, టెన్నిస్‌తో తన ప్రయాణం కొనసాగుతుందని స్పష్టం చేశాడు. 20 ఏళ్ల పాటు దేశానికి ప్రాతినిథ్యం వహించడం గర్వంగా ఉందని పేర్కొన్నాడు. భారత్‌లో ప్రతిభ కలిగిన టెన్నిస్ క్రీడాకారులు వెలికి తీసేందుకు, టెన్నిస్ అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించాడు.
పారిస్ మాస్టర్స్ 100లో అలెంగ్జాండర్ బుబ్లిక్‌తో కలిసి బోపన్న తన చివరి డబుల్స్ మ్యాచ్ ఆడాడు. 2003లో ప్రొఫెషనల్ టెన్నిస్‌లోకి అరంగేట్రం చేసిన బోపన్న 22 ఏళ్ల పాటు భారత్‌కు సేవలందించాడు. గాయాలు బాధించినా.. రెండు మోకాళ్లలోని కార్టిలేజ్(గుజ్జు) అరిగిపోయి ఇబ్బంది పడ్డా.. వరుస పరాజయాలు ఎదురైనా తనకు నచ్చిన ఆటను వదిలేయలేదు. మరింత పట్టుదల కనబర్చి విజయాలు అందుకున్నాడు.

2019లో పెయిన్ కిల్లర్స్ సాయంతో ఆటను కొనసాగించాడు. మోకాలి నొప్పుల నుంచి బయటపడేందుకు బోపన్న యోగాను ఆశ్రయించాడు. కరోనా సమయంలో యోగా మొదలు పెట్టిన బోపన్న.. వారంలో నాలుగు సార్లు 90 నిమిషాల చొప్పున యోగా చేసేవాడు. దీంతో అతని మోకాలి నొప్పి నయమైంది.
43 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియా ఓపెన్ డబుల్స్ విజేతగా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ విజయంతో కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకున్నాడు. అదిపెద్ద వయసులో గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్ నెగ్గిన ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. డబుల్స్‌లో నంబర్ వన్ ర్యాంక్ అందుకున్న అతిపెద్ద వయస్కుడు కూడా బోపన్ననే కావడం గమనార్హం. 2010, 2023 యూఎస్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన బోపన్న 2017 ఫ్రెంచ్ ఓపెన్‌లో గాబ్రియల్ డబ్రోస్కీ(కెనడా)తో కలిసి డబుల్స్ టైటిల్ అందుకున్నాడు. తన కెరీర్‌లో 26 టూర్ స్థాయి టైటిళ్లు, 6 ఏటీపీ మాస్టర్స్ 100 టైటిళ్లు గెలిచాడు.
2018 ఆసియా క్రీడల్లో పురుషుల డబుల్స్‌లో స్వర్ణ పతకం సాధించాడు. పాకిస్థాన్‌కు చెందిన ఐసమ్-ఉల్-హక్ ఖురేషీతో కలిసి బోపన్న సుదీర్ఘ కాలం ఆడాడు. ఈ జోడీని 'ఇండో-పాక్ ఎక్స్‌ప్రెస్' అని ముద్దుగా పిలిచేవారు. ఈ జోడీ 2010 యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు చేరుకొని తృటిలో టైటిల్ కోల్పోయింది. అతని సేవలకు గానూ భారత ప్రభుత్వం 2019లో అర్జున అవార్డు, 2024లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.