
హోబర్ట్ : భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకుంది. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత రాకెట్ పట్టుకున్న ఈ మాజీ నంబర్ వన్ ప్లేయర్.. బరిలోకి దిగిన తొలి టోర్నీ టైటిల్‌నే గెలుచుకొని ఔరా అనిపించింది.
బిడ్డకు జన్మనిచ్చి సుదీర్ఘ విరామం తీసుకున్నా.. తన సత్తా ఏ మాత్రం తగ్గలేదని ఈ గెలుపుతో ప్రత్యర్థులకు చాటిచెప్పింది. హోబర్ట్ ఇంటర్నేషనల్ మహిళల టెన్నిస్ టోర్నమెంట్ ద్వారా టెన్నిస్‌లో రీఎంట్రీ ఇచ్చిన ఈ హైదరాబాద్ స్టార్, నదియా కిచెనోక్(ఉక్రెయిన్)తో జతకట్టింది.
శుక్రవారం జరిగిన ఫైనల్లో సానియా-నదియా కిచెనోక్ (ఉక్రెయిన్) ద్వయం 6-4, 6-4 తేడాతో జాంగ్ షువై-పెంగ్ షువై(చైనా) జోడీని ఓడించి టైటిల్ అందుకుంది. గంటా 21 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో ఆద్యంతం సానియా జోడినే ఆదిపత్యం కనబర్చింది. 2007 తర్వాత సానియా గెలిచిన తొలి టైటిల్ ఇదే కాగా.. ఓవరాల్‌గా ఆమెకిది 42వ డబ్ల్యూటీఏ టైటిల్. ఇక 2017లో చైనా ఓపెన్‌లో చివరిసారిగా సానియా రాకెట్ పట్టింది.
పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లాడిన సానియాకు ఇజహాన్ అనే కుమారుడు ఉన్న విషయం తెలిసిందే. ఇక రీఎంట్రీ కోసం సానియా తీవ్రంగా కష్టపడింది. దీనికోసం నాలుగు నెలల్లో ఏకంగా 26 కేజీల బరువు తగ్గింది.
నెక్ట్స్ ఆస్ట్రేలియా ఓపెన్
ఈ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో కూడా సానియా బరిలోకి దిగనుంది. ఈ టోర్నీ మహిళల డబుల్స్‌లో నాదియా కిచనోక్ (ఉక్రెయిన్)తో, మిక్స్‌డ్ డబుల్స్‌లో బోపన్నతో జోడి కట్టనుంది. సానియా- రోహన్ బోపన్న జోడీ చివరిసారిగా 2016 ఒలింపిక్స్‌లో ఆడింది. ముందుగా రాజీవ్ రామ్ (అమెరికా)తో కలిసి ఆడాలనుకున్నా.. అతను గాయంతో తప్పుకోవడంతో బోపన్నతో బరిలోకి దిగనుంది.