
హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా క్రీడా టోర్నీలన్నీ నిలిచిపోవడంతో ప్లేయర్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సోషల్ మీడియా కాలక్షేపం చేస్తూ ఈ క్వారంటైన్ సమయాన్ని కుటుంబాలతో ఆస్వాదిస్తున్నారు. ఇన్‌స్టా లైవ్ సెషన్స్ నిర్వహిస్తూ ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. అంతేకాకుండా టిక్‌టాక్ చేస్తూ ఎంటర్‌టైన్ చేస్తున్నారు.
తాజాగా భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన పేరుతో ఉన్న ఓ ఫన్నీ టిక్ టాక్ వీడియోను ట్వీట్ చేసింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందకు ఈ మధ్యకాలంలో అందరూ శానిటైజర్లు వాడుతున్న విషయం తెలిసిందే. ఒక షాప్‌లో చిత్రీకరించిన ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది. ఒక కస్టమర్ దుకాణదారు వద్దకు వెళ్లి, ఒక చీటిని చూపించి తనకో వస్తువు కావాలని అడుగుతాడు. అయితే అందులో శానిటైజర్‌కి బదులుగా 'సానియా ట్రౌజర్' అని రాసి ఉంటుంది. దీంతో ఆ దుకాణదారుడు.. మీ నాన్న ఏం చేస్తుంటాడు అని అడగ్గా.. అతను 'ఎమ్మెల్యే' అని చెబుతాడు. వెంటనే దుకాణదారుడు 'అది సానియా ట్రౌజర్ కాదు.. శానిటైజర్' అని ఆ వ్యక్తితో చెబుతాడు.
ఈ ఫన్నీ వీడియోని ఓ నెటిజన్ షేర్ చేసి.. అందులో సానియా మీర్జాని ట్యాగ్ చేశాడు.. దీన్ని రీట్వీట్ చేసిన సానియా నవ్వుతున్నట్లుగా, తల కొట్టుకుంటున్నట్లుగా ఉన్న ఎమోజీలను షేర్ చేసింది. ఈ వీడియాను చూసిన నెటిజన్లు కడుపుబ్బా నవ్వుతున్నారు. లైకులు, కామెంట్లతో తమ స్పందనను హోరెత్తిస్తున్నారు.
ఇక కరోనా కట్టడిలో తన వంతు సాయంగా సానియా నిరుపేదలను, వలస కూలీలకు అండగా నిలిచింది. వారిని ఆదుకునేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే విరాళాలను సేకరించి, నిరుపేద కుటుంబాలకు సాయం చేసింది. తాజాగా ప్రతిష్టాత్మక ఫెడ్ కప్ హార్ట్ అవార్డును గెలుపొందిన సానియా.. తనకు లభించిన ప్రైజ్‌మనీ 2వేల అమెరికన్ డాలర్ల ( సుమారు రూ.లక్షా 58 వేలు)ను కరోనా పోరులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చింది.