
హోబర్ట్ : పునరాగమనంలో ఆడుతోన్న తొలి టోర్నీలోనే భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచింది. హోబర్ట్ ఇంటర్నేషనల్ మహిళల టెన్నిస్ టోర్నమెంట్‌లో శుక్రవారం జరిగిన డబుల్స్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సానియా- నదియా కిచెనోక్ (ఉక్రెయిన్) ద్వయం 7-6(3), 6-2తో మారి బౌజ్‌కోవ(చైనీస్ తైపీ)-తామర-జిడన్‌సెక్(స్లొవెనియా) జోడీని ఓడించి ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్ ఆసాంతం అద్భుత పెర్ఫామెన్స్ కనబర్చిన ఈ ఇండో- ఉక్రెయిన్ జోడీ వరుస సెట్‌లలో గెలిచి విజయాన్నందుకుంది. ఇక గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సానియా జోడీ 6-2, 4-6, 10-4తో కింగ్‌వానియ-మిక్‌హెల్ క్రిస్టినా (అమెరికా)జోడీపై గెలుపొందింది.
ఈ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో కూడా సానియా బరిలోకి దిగనుంది. ఈ టోర్నీ మహిళల డబుల్స్‌లో నాదియా కిచనోక్ (ఉక్రెయిన్)తో, మిక్స్‌డ్ డబుల్స్‌లో బోపన్నతో జోడి కట్టనుంది. సానియా- రోహన్ బోపన్న జోడీ చివరిసారిగా 2016 ఒలింపిక్స్‌లో ఆడింది. ముందుగా రాజీవ్ రామ్ (అమెరికా)తో కలిసి ఆడాలనుకున్నా అతను గాయంతో తప్పుకోవడంతో బోపన్నతో జతకట్టింది.
రెండేళ్ల విరామం తీసుకున్న సానియా చివరగా 2017, అక్టోబర్‌లో చైనా ఓపెన్ ఆడింది. మొకాలి గాయంతో ఆ టోర్నీ నుంచి తప్పుకుంది. ఏప్రిల్ 2018లో ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సానియా హోబర్ట్ ఇంటర్నేషనల్ టోర్నీతోనే తన సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టింది.